ఏపీ 'బండి సంజయ్ లా...చంద్రబాబు'!

Update: 2021-01-05 11:37 GMT

తెలుగుదేశం అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు రూట్ మార్చారా?. ఆయన కూడా తెలంగాణ బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ లాగా మారాలని నిర్ణయించుకున్నారా?. అన్నింటి కంటే అత్యంత ప్రమాదకరం అయిన మత విద్వేషాలు అనే ఆయుధాన్ని వాడుకుంటే తప్ప ఏపీ రాజకీయాల్లో మనుగడ సాగించలేమని నిర్ణయానికి వచ్చారా?. అలా చేయకపోతే బిజెపి తమ స్పేస్ ఆక్రమిస్తుందని భయపడుతున్నారా?. అందుకే బిజెపిని మించిన 'హిందుత్వ' వాదిగా ముద్ర వేసుకోవాలని ప్రయత్నం చేస్తున్నారా?. గతంలో ఎన్నడూలేని రీతిలో నుదుట పేద్ద బొట్టు పెట్టుకోవటంతో పాటు సీఎం జగన్ ను 'మతపరంగా టార్గెట్ ' చేయటం వెనక అదే కోణం ఉన్నట్లు స్పష్టంగా కన్పిస్తోంది. మంగళవారం నాడు జరిగిన తెలుగుదేశం పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు అందుకు ఊతమిచ్చేలా ఉన్నాయి.

అసలు ఏ మాత్రం లింక్ లేని 'అమరావతి' అంశాన్ని వాటికన్ ల మధ్య పోలిక తెచ్చారు. వాటికన్ సిటి అంటే జగన్ కు అభిమానం అంటూ వ్యాఖ్యానించటం ద్వారా చంద్రబాబు ఏమి చెప్పాలనుకుంటున్నారో స్పష్టం అవుతోంది. ' జగన్ ఒక క్రిస్టియన్... అతని నమ్మకం అతనిది....మా నమ్మకం మాది. మెజారిటీ ప్రజలు ఉండే హిందువుల మనోభావాలు కొనసాగించాలి. సీఎం, హోమ్ మంత్రి , డీజీపీ తో పాటు స్థానిక ఎస్పీ కూడా క్రిస్టియన్. ముఖ్యమంత్రి మత మార్పిడులు చెయ్యడం ఏంటి. పోలీస్ స్టేషన్ లో క్రిస్మస్ చేస్తారా....శ్రీవారి టెంపుల్లో క్రిస్మస్ శుభాకాంక్షలు చెపుతారా. క్రిస్టియన్ లకే మనోభావాలు ఉంటాయా....హిందువులకు, ముస్లింలకు ఉండవా. ఫాస్టర్ల కు 5 వేలు ఇవ్వడం చట్ట విరుద్ధం. రిజర్వేషన్ లు ఉన్న ఫాస్టర్ లకు ఐదు వేలు ఇవ్వడం ఎందుకు' అంటూ ప్రశ్నించటం ద్వారా చంద్రబాబు తన ఏజెండాను చెప్పకనే చెప్పేశారు. అంతే కాదు..ఆదివారం నాడు జరిగిన పొలిట్ బ్యూరో సమావేశంలోనూ చంద్రబాబు ఇదే తరహా వ్యాఖ్యలు చేశారు. ఎవరైనా తిరుమల బ్రహ్మోత్సవాలకు కుటుంబ సభ్యులతో కలసి వెళతారని..కానీ జగన్ అలా ఎందుకు చేయరని ప్రశ్నించటం ద్వారా తాను ప్రజల్లోకి పంపాలనుకున్న మెసేజ్ ను పంపే ప్రయత్నం చేశారు.

అయితే ఇక్కడ ఓ విషయం ఖచ్చితంగా ప్రస్తావించుకోవాలి. రాష్ట్రంలోని దేవాలయాలపై దాడులు జరగటం ప్రారంభం అయిన వెంటనే ప్రభుత్వం ఈ విషయంలో మరింత కఠినంగా వ్యవహరించి ఉంటే బాగుండేదనే అభిప్రాయం అధికార వర్గాల్లో కూడా వ్యక్తం అవుతోంది. అంతే కాదు..కొడాలి నాని వంటి మంత్రులు...హనుమంతుడు చేయి విరిగితే ఏమవుతుంది?. దుర్గగుడిలో రధానికి ఉన్న వస్తువులు పోతే ఏమి అవుతుంది..మళ్ళీ పెడతారు అంటూ చేసిన వ్యాఖ్యలు సర్కారుకు లాభం కంటే నష్టమే ఎక్కువ చేశాయి. దీనికి తోడు ఈ పనులు ఎవరు చేస్తున్నారు.. ఎందుకు చేస్తున్నారు అనే సంగతి తేల్చి..వాటికి అడ్డుకట్ట వేయాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే. కానీ మంత్రులు, కొంత మంది వైసీపీ నేతల వ్యాఖ్యలు పరిస్థితిని ఇక్కడ వరకూ తెచ్చాయనే విమర్శలు ఉన్నాయి. ఉదాహరణకు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి రామతీర్ధం ఘటన వెనక చంద్రబాబునాయుడు, నారా లోకేష్ ఉన్నారని ఆరోపించారు. నిజంగా ప్రభుత్వంలో ఉండి ఆధారాలు ఉంటే వారిపై చర్యలు తీసుకోవాలి. కానీ టీవీల ముందు చెపితే పని అయిపోతుందా?.

విజయసాయిరెడ్డి అలా చెపితే మరో కీలక నేత, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి మాత్రం రామతీర్ధం ఘటనపై విచారణ జరుగుతోందని..అందులో వాస్తవాలు తెలుస్తాయని.. సీఎం జగన్ ప్రతిష్టను దెబ్బతీసేందుకే కొంత మంది ఇలాంటి పనులు చేస్తున్నారని ప్రకటించారు. ఆలయాలపై దాడులు చేసే వారి ఉద్దేశం రాజకీయ కోణంతో సాగేది అయినా దాన్ని అడ్డుకట్ట వేయాల్సింది మాత్రం ప్రభుత్వమే. అంతే కాకుండా వరస పెట్టి జరుగుతున్న ఘటనపై ఖచ్చితంగా ప్రభుత్వ ప్రతిష్టకు మచ్చగా మిగులుతాయనటంతో ఎలాంటి సందేహం లేదు. ఈ అవకాశాన్ని అటు బిజెపి, టీడీపీలు వాడుకునేందుకు రెడీ అయ్యాయి. అందులో భాగంగానే బండి సంజయ్ ఏకంగా తిరుపతి లోక్ సభ ఉప ఎన్నిక లో బైబిల్ పార్టీకి ఓటేస్తారో...భగవద్గీత పార్టీకి ఓటేస్తారో తేల్చుకోవాలంటూ సంచలన ప్రకటన చేశారు. ఇక చంద్రబాబు తాను ఎక్కడ వెనకబడి పోతానో అన్న భయంతో ఏకంగా 'వాటికన్' వరకూ వెళ్లొచ్చారు. చూడాలి మరి ఏపీలో ఈ మత రాజకీయాలు ఎక్కడ వరకూ వెళతాయో.

Tags:    

Similar News