ఆర్ఆర్ఆర్ మూవీ విడుదల అనంతరం ఓ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చాలా స్పష్టంగా తాను ప్రస్తుతం సినిమాలపైనే ఫోకస్ పెట్టానని..భవిష్యత్ లో ఎప్పుడో జరిగే వాటి గురించి అసలు తాను ఆలోచించటం లేదని వ్యాఖ్యానించారు.టీడీపీలో ప్రస్తుతం ఉన్న పరిస్థితిని ఊహించే ఎన్టీఆర్ ఆ వ్యాఖ్యలు చేశారు. ఒకవేళ ఎన్టీఆర్ ఇప్పుడు ఆగమేఘాల మీద టీడీపీలో ఫుల్ యాక్టివ్ అయినా కూడా ఆయన చంద్రబాబు, నారా లోకేష్ ల తర్వాత మూడవ స్థానంలో ఉండాల్సి ఉంటుంది. అలా కాదని ఎన్టీఆర్ ను ఇప్పటికిప్పుడు ఏమీ కీలక స్థానం అప్పగించటం జరగదు. మరో వైపు ఎన్టీఆర్ ఇప్పుడు సినిమాల్లో ఫుల్ పామ్ లో ఉన్నారు. ఆర్ఆర్ఆర్ సినిమాలో ఎన్టీఆర్ నటనకు జాతీయ స్థాయిలో ప్రశంసలు దక్కాయి.
అదే సమయంలో ఇప్పటికే ఒకటి కొరటాల శివ దర్శకత్వంలో, మరొకటి కెజీఎఫ్ 2 ద్వారా దేశ వ్యాప్తంగా అందరి దృష్టిని ఆకట్టుకున్న దర్శకుడు ప్రశాంత్ నీల్ తో సినిమాల ప్రకటన చేశారు. ఈ రెండు సినిమాలు పూర్తవటానికి కనీసం రెండేళ్ళ సమయం పడుతుందనే అంచనాలు ఉన్నాయి. . సో...ఎన్టీఆర్ ఇప్పటికిప్పుడు రాజకీయాల్లోకి వచ్చే అవకాశం లేదనే చెప్పొచ్చు. గత కొన్ని రోజులుగా చంద్రబాబు చేస్తున్న పర్యటనలకు ప్రజలు భారీ ఎత్తున వస్తున్నారని..తాము ఇంకా అధికారంలోకి వచ్చేశామనే తరహాలో అటు చంద్రబాబు, ఇటు నారా లోకేష్ లు వ్యవహరిస్తున్నారని ఓ సీనియర్ నేత వ్యాఖ్యానించారు. ఎన్టీఆర్ కు చంద్రబాబు కనీసం పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పకుండా ఆయన ఫ్యాన్స్ ను దూరం చేసుకోవటం రాజకీయంగా లాభం కంటే నష్టమే ఎక్కువ జరుగుతుందనే అభిప్రాయం టీడీపీలో నేతల్లో వ్యక్తం అవుతోంది. చిన్న చిన్న అంశాలతో సొంత మనుషులను దూరం చేసుకోవటం ఏ మాత్రం సరికాదని ఓ నేత వ్యాఖ్యానించారు.