ఇప్పటి వరకు ఒక లెక్క ..ఇప్పటి నుంచి మరో లెక్క...టిఆర్ఎస్ కు బిగ్ షాక్ !

Update: 2022-12-01 05:17 GMT

ఢిల్లీ లిక్కర్ స్కాములో ముఖ్యమంత్రి కుమార్తె, ఎమ్మెల్సీ కవిత పేరు అధికారికంగా రావటం కచ్చితంగా అధికార టిఆర్ఎస్ పార్టీకి రాజకీయంగా ఇరకాట పరిస్థితి తేవటం ఖాయం అనే చర్చ రాజకీయ వర్గాల్లో సాగుతోంది. ఇంత కాలం రాజకీయ ఆరోపణలుగా ఉన్న అంశం కాస్త అధికారికంగా ఈడీ రిమాండ్ రిపోర్ట్ లోకి వెళ్లటంతో ఇది టిఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కెసిఆర్ కు, టిఆర్ఎస్ పార్టీకి షాక్ వంటి పరిణామంగానే భావిస్తున్నారు. త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలు జరగనుండటంతో ఇది ప్రాధాన్య అంశంగా మారటం ఖాయం అనే చర్చ నడుస్తోంది. టిఆర్ ఎస్ పార్టీ , టి ఆర్ ఎస్ ప్రభుత్వం ఇంతకాలం కేవలం తెలంగాణ ప్రయోజనాలు కాపాడడం కోసమే ఉన్నట్లు చెపుతూ వచ్చారు. కానీ ఇప్పుడు అధికారాన్ని అడ్డం పెట్టుకుని దేశ రాజధాని ఢిల్లీ లోని లిక్కర్ స్కాములో..సౌత్ లాబీ తరుపున స్వయంగా సీఎం కెసిఆర్ కుమార్తె భాగస్వాములు అయ్యారనే వార్త రావటం...అది కూడా పక్కాగా ఫోన్ నెంబర్లు...వాడిన ఫోన్ల సంఖ్య వంటి అంశాలు కూడా రిమాండ్ రిపోర్ట్ లో ప్రస్తావించటం తో వ్యవహారం కాస్త సీరియస్ గా మారినట్లు అయింది అనే చర్చ అధికార వర్గాల్లో ఉంది. ఎమ్మెల్సీ కవిత తో పాటు శరత్ చంద్ర రెడ్డి, మరి కొంత మంది వాడిన ఫోన్లను నాశనం చేయటం అనేది అత్యంత పెద్ద నేరం గా ఒక సీనియర్ ఐఏఎస్ అధికారి అభిప్రాయం పడ్డారు.

                                   ఇలాంటి పనులు ఎవరు చేస్తారో అందరికి తెలుసనీ...కానీ వ్యాపారాలు, ప్రజాప్రతినిధులుగా ఉన్నారు వారు ఇలా చేయటం అంటే ఇది చాలా పెద్ద అంశం అనే అభిప్రాయం అధికారుల్లో ఉంది. తెలంగాణ ప్రభుత్వంపై ప్రతిపక్షాలు చాలా సార్లు అవినీతి ఆరోపణలు చేశాయి. దమ్ముంటే ఆధారాలు చూపాలి అంటూ ఇంత కాలం రివర్స్ ఎటాక్ చేస్తూ వచ్చింది అధికార పార్టీ. కానీ ఇప్పుడు ఏకంగా సీఎం కూతురుపైనే తీవ్రమైన అభియోగాలు మోపటం అనేది ఇప్పుడు పార్టీ నాయకుల్లో కూడా హాట్ టాపిక్ గా మారింది. ఇది కేవలం శాంపిల్ మాత్రమే అని...ఇప్పటికే కేంద్ర ఏజెన్సీలు తెలంగాణ లో జరిగిన కీలక లావాదేవాల విషయాలకు సంబంధించి పూర్తి సమాచారంతో సిద్ధంగా ఉన్నాయని ...వీటిని కేంద్రంలోని బీజేపీ కేవలం ఎన్నికల సమయంలోనే వాడుతుంది అని చెపుతున్నారు. అధికారిక సమాచారాన్ని తన రాజకీయ అవసరాలకు వాడటంతో బీజేపీ గతంలో కాంగ్రెస్ కు ఉన్న అన్ని రికార్డులని తిరగ రాయటమే కాదు..ఎవరు తమను రీచ్ కాలేరు అనే స్థాయికి చేరిందని విమర్సలు ఆ పార్టీ పై ఉన్నాయి. గురువారం ఉదయం ఎమ్మెల్సీ కవిత ఈడీ రిమాండ్ రిపోర్ట్ పై స్పందించారు..కానీ ఆమె ఎక్కువగా పొలిటికల్ ఎటాక్ మార్గంలో వెళ్లారు తప్ప తాను ఆ ఫోన్లు వాడలేదు...ఆ నెంబర్లు తనవి కావు అని ఎక్కడ చెప్పక పోవటం విశేషం.

. ఇంత కాలం కడుపు కట్టుకుని..అటుకులు తిని పని చేస్తున్నామని చెపుతూ వచ్చిన కెసిఆర్ కు కవిత వ్యవహారం ఇబ్బందులు కలిగించటం ఖాయం అని చెపుతున్నారు. ఇప్పటి వరకు ఒక లెక్క. ఇప్పటి నుంచి మరో లెక్కగా రాజకీయం మారబోతుంది అని చర్చ నడుస్తోంది.

Tags:    

Similar News