కెసీఆర్..జ‌గ‌న్ ల‌కు పెద్ద‌ ఊర‌ట‌

Update: 2021-06-07 14:40 GMT

క‌రోనా క‌ష్ట‌కాలంలో ఇటు తెలంగాణ ముఖ్య‌మంత్రి కెసీఆర్..అటు ఏపీ ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ ల‌కు పెద్ద ఊర‌ట ల‌భించింది. కేంద్రం కొద్ది రోజుల క్రితం 18 సంవ‌త్స‌రాల పైబ‌డిన వారంద‌రికీ వ్యాక్సిన్ వేయ‌టానికి అనుమ‌తిస్తూ నిర్ణ‌యం తీసుకుంది. అయితే ఇందుకు అయ్యే ఖ‌ర్చు రాష్ట్రాలే భ‌రించాల‌ని పేర్కొంది. కేంద్రం ప్ర‌క‌ట‌న చేసిన వెంట‌నే తెలుగు రాష్ట్రాల సీఎంలు ఇద్ద‌రూ పోటీలు ప‌డి త‌మ త‌మ రాష్ట్రాల్లో ప్ర‌జ‌ల‌కు తామే ఉచితంగా వ్యాక్సిన్లు వేస్తామ‌ని తెలిపారు. తెలంగాణ సీఎం కెసీఆర్ అయితే రాష్ట్రంలో వ్యాక్సినేష‌న్ల కార్య‌క్ర‌మానికి 2500 కోట్ల రూపాయ‌లు అవుతాయ‌ని...ఏపీలో అయితే వ్యాక్సినేష‌న్ కు 1600 కోట్ల రూపాయ‌లు అవుతాయ‌ని సీఎం జ‌గ‌న్ లు లెక్క‌లు క‌ట్టారు. తీరా సీన్ క‌ట్ చేస్తే వాళ్లు డ‌బ్బులు ఖ‌ర్చు పెట్ట‌డానికి సిద్ధంగా ఉన్నా వ్యాక్సిన్లు మాత్రం అందుబాటులో లేవు. రెండు రాష్ట్రాలు వ్యాక్సిన్ల కొనుగోలు కోసం అంటూ గ్లోబ‌ల్ టెండ‌ర్లు పిలిచినా స్పంద‌న శూన్యం. అయితే సీఎం జ‌గ‌న్ తాజాగా ప్ర‌ధాని న‌రేంద్ర‌మోడీకి లేఖ రాశారు. కేంద్ర‌మే వ్యాక్సిన్ల బాధ్య‌త తీసుకోవాల‌ని..ఇది కేంద్ర‌, రాష్ట్రాల మ‌ధ్య‌ స‌మ‌స్య‌గా మారుతుంద‌ని ప్ర‌క‌టించారు. కానీ ఎక్క‌డా కేంద్ర‌మే ఉచితంగా వ్యాక్సిన్ స‌ర‌ఫ‌రా చేయాల‌ని మాత్రం కోర‌లేదు. అంతే కాకుండా సీఎం జ‌గ‌న్ కొద్ది రోజుల క్రితం వ్యాక్సిన్లు ప్రైవేట్ ఆస్ప‌త్రుల‌కు ఇవ్వ‌టాన్ని త‌ప్పుప‌ట్టారు.

ప్రైవేట్ కు వ్యాక్సిన్లు ఇవ్వ‌టం వ‌ల్ల వాళ్లు బ్లాక్ లో విక్ర‌యిస్తూ ప్ర‌జ‌ల‌నుకొల్ల‌గొడుతున్నార‌ని అంత‌కు ముందు ప్ర‌ధానికి రాసిన లేఖ‌లో ప్ర‌స్తావించారు. అయితే ఇప్పుడు ప్ర‌ధాని మోడీ మాత్రం 25 శాతం వ్యాక్సిన్ల‌ను ప్రైవేట్ ఆస్ప‌త్రుల‌కు కేటాయిస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు. అయితే ఇప్పుడు కేంద్రం ఇచ్చిన వ్యాక్సిన్లు వేయించ‌టం త‌ప్ప‌..రాష్ట్రాల‌కు వ్యాక్సిన్ల కొనుగోలు..బ‌డ్జెట్ కేటాయింపుల బాధ‌లు త‌ప్పాయి. అస‌లు క‌రోనాతో ఆదాయం త‌గ్గిన రాష్ట్రాల‌కు ఇది ఊర‌ట క‌ల్పించే నిర్ణ‌య‌మే. మ‌మ‌తా బెన‌ర్జీ, పిన‌ర‌య్ విజ‌య‌న్ వంటి ముఖ్య‌మంత్రులే అంద‌రికీ ఉచితంగా వ్యాక్సిన్లు వేయాల‌ని కేంద్రాన్ని డిమాండ్ చేశారు. కార‌ణం ఏదైనా ఇప్పుడు దేశంలోని అన్ని రాష్ట్రాల‌కు ఊర‌ట ల‌భించిన‌ట్లు అయింది.

Tags:    

Similar News