అమరావతి రైతులతో చర్చల్లేకుండా 'మూడు' రాజధానులు ముందుకు సాగుతుందా?
వికేంద్రీకరణ బిల్లులో లోపాలు ఉన్నట్లు సర్కారు అంగీకరించనట్లేనా?
రాజదాని వంటి కీలక నిర్ణయంలోనూ అంత లైట్ తీసుకున్నారా?
ఒక్క నిర్ణయం. ఎన్నో ప్రశ్నలు. సోమవారం నాడు ఏపీలో చకచకా సాగిన జరిగిన పరిణామాలు పలు కొత్త ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మూడు రాజధానులకు సంబంధించి పాత చట్టాలను రద్దుచేస్తూ కొత్త చట్టాలు తీసుకురానున్నట్లు పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కొత్త బిల్లులో చట్టపరంగా..న్యాయపరంగా అన్ని సమాధానాలను బిల్లులో సమగ్రంగా వివరించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. బిల్లులో ఎన్ని సమాధానాలు చెప్పినా కొత్తగా ప్రశ్నలు వేయకూడదు అని ఎక్కడా ఉండదు కదా. అంతే కాదు.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తెచ్చిన ఏ బిల్లును అయినా బాధితులు ఉంటే ప్రశ్నించవచ్చు..వాటిని న్యాయస్థానం ముందు సవాల్ చేయవచ్చు. జగన్ తీసుకున్న మూడు రాజధానుల నిర్ణయం వల్ల బాధితులుగా మారింది రాజధాని కోసం అంటూ భూములు ఇచ్చిన అమరావతి రైతులు. ఇప్పుడు ప్రభుత్వం వారిని చర్చల ద్వారా లేదా ఏదైనా ఒప్పందం ద్వారా సెటిల్ చేస్తే తప్ప ఈ వ్యవహారం ముందుకు సాగదని ఓ సీనియర్ అదికారి వ్యాఖ్యానించారు. అంతే కాదు అత్యంత కీలకమైన రాజధానుల విషయంలో కూడా ప్రభుత్వం సరైన జాగ్రత్తలు తీసుకోకుండా, కసరత్తులు చేయకుండా ఈ వికేంద్రీకరణ బిల్లులు పెట్టిందనే సంకేతాలను ప్రభుత్వం తనంతట తాను ఇచ్చుకున్నట్లు అయిందని ఆయన వ్యాఖ్యానించారు.
అన్నింటి కంటే ముఖ్యమైనది సర్కారు నిర్ణయంపై హైకోర్టు ధర్మాసనం ఎలా స్పందిస్తుంది అన్నదే. అడ్వకేట్ జనరల్ మూడు రాజధానుల నిర్ణయాన్ని ఉపసంహరించుకుంటున్నట్లు కోర్టుకు నివేదించారు. కానీ సీఎం జగన్ మాత్రం మరింత పకడ్భందీగా..ఎలాంటి లోపాలు లేకుండా గతంలో చేసిన ప్రకటనకు కట్టుబడి మరింత సమగ్రంగా..స్పష్టంగా మూడు రాజధానుల బిల్లు తెస్తామని ప్రకటించారు. గతంలో ప్రభుత్వం కోరినందునే హైకోర్టు అమరావతికి సంబంధించి రోజువారీ విచారణకు అంగీకరించింది. ఇప్పుడు ఆ విచారణ వేగవంతం అయిన తరుణంలో సర్కారు పాత బిల్లులను ఉపసంహరించుకున్నట్లు ప్రకటించింది. అంటే హైకోర్టు ఇప్పుడు విచారణను ఆపేసి.కొత్త బిల్లులు వచ్చాక..వాటిపై రైతులకు అభ్యంతరాలు ఉంటే ..వారు కేసులు వేస్తే అప్పుడు విచారణ చేయాలా?. ఇది అత్యంత సంక్లిష్టమైన వ్యవహారంగా మారే అవకాశం ఉందని ఓ న్యాయవాది అభిప్రాయపడ్డారు. దీనిపై మరి హైకోర్టు దీనిపై ఎలా స్పందిస్తుందో వేచిచూడాల్సిందే. రాజధాని కోసమే తాము భూములు ఇచ్చినందున ఒకే రాజధాని ఉండాలనేది అమరావతి రైతుల వాదన.
తాజాగా సీఎం జగన్ అసెంబ్లీలో చేసిన ప్రకటన ప్రకారం ప్రభుత్వం మూడు రాజదానులకే కట్టుబడి ఉంది. ఇది అమరావతి రైతులకు ఆమోదయోగ్యం అవుతుందా?. ఛాన్సే లేదు అని చెప్పొచ్చు. మూడు రాజధానుల ప్రకటన చేసిన ఏడాదిన్నర తర్వాత మళ్ళీ రాజధాని అంశాన్ని సీఎం జగన్ మొదటికి తెచ్చినట్లు అయింది. బిల్లులో పేర్కొన్నట్లు భాగస్వాములు అందరితో చర్చలు జరిపి..ఎలాంటి పొరపాట్లు లేకుండా బిల్లు తయారు చేసి ఉభయ సభల్లో ఆమోదింప చేసుకుని ముందుకు పోవటానికి ఎంత సమయం పడుతుంది?. ఇది జరిగే పనేనా?. ఇప్పటికి జగన్ సీఎం అయి రెండున్నర సంవత్సరాలు పూర్తి అయింది. చివరి ఏడాది అంతా ఎన్నికల హంగామా తప్ప ఏమీ ఉండదు. పైగా ఏపీ ప్రస్తుతం ఉన్న ఆర్ధిక పరిస్థితుల్లో ఒక వేళ అన్ని అడ్డంకులు అధిగమించినా విశాఖలో కొత్త రాజధాని పనులు ప్రారంభించటానికి ఆర్ధిక వనరులు అనుకూలిస్తాయా?. అంటే సందేహమే అంటున్నారు ప్రభుత్వ అధికారులు. ఏది ఏమైనా ఏపీ సర్కారు సోమవారం నాడు తీసుకున్న నిర్ణయం ఒక చిక్కు నుంచి మరిన్ని చిక్కుల్లోకి పడినట్లు ఉందనే అబిప్రాయం వ్యక్తం అవుతోంది.