ఏపీ కొత్త చీఫ్ సెక్రటరీ ఛాన్స్ ఎవరికి ఉంది. ఏపీ ఐఏఎస్ సర్కిళ్లలో ప్రస్తుతం హాట్ హాట్ గా సాగుతున్న చర్చ ఇది. ప్రస్తుత సీఎస్ ఆదిత్యనాథ్ దాస్ సెప్టెంబర్ నెలాఖరుకు పదవి విరమణ చేయబోతున్నారు. ప్రస్తుతం ఉన్నత విద్యా శాఖలో ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఉన్న సతీష్ చంద్ర ఈ రేసులో ముందు వరసలో ఉన్నట్లు అధికార వర్గాలు చెబుతున్నాయి. ముఖ్యమంత్రి జగన్ ను కలసి ఈ మేరకు తనకు అవకాశం కల్పించాల్సిందిగా కోరటం..అందుకు ఆయన సమ్మతించటం జరిగిపోయాయని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. సతీష్ చంద్ర కు కూడా నవంబర్ వరకే సర్వీసు ఉంది. సీఎస్ ఛాన్స్ వస్తే అంటే ఆదిత్యనాథ్ దాస్ పదవి విరమణ తర్వాత రెండు నెలలు పాటు కొనసాగే అవకాశం ఉంటుంది. తర్వాత మూడు నెలలు పొడిగింపు దక్కితే ఐదు నెలల పాటు ఆయన సీఎస్ గా ఉంటారు. సీఎంకు అత్యంత సన్నిహితుడిగా పేరున్న అధికారి సూచన మేరకు సతీష్ చంద్ర తనకు అవకాశం ఇవ్వాలని కోరటంతో జగన్ కూడా ఓకే అన్నారని అధికార వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. వాస్తవానికి వైసీపీ ప్రతిపక్షంలో ఉండగా సతీష్ చంద్రపై ప్రస్తుత వైసీపీ పార్లమెంటరీ పార్టీ నాయకుడు విజయసాయిరెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సీఎం ఆఫీసులో ఉండి మంత్రుల మధ్య వాటాలు సెటిల్ చేస్తున్నారంటూ ఆయన విమర్శించిన విషయం తెలిసిందే.
దీంతో పాటు వైసీపీ ఎమ్మెల్యేల ఫిరాయింపుల విషయంలోనూ సతీష్ చంద్రదే కీలకపాత్ర అంటూ అప్పట్లో విమర్శలు చేశారు. అయితే ఇప్పుడు సీఎం జగన్ తాను సతీష్ చంద్రకు సీఎస్ పదవి ఇవ్వాలనుకుంటే గతంలో విజయసాయిరెడ్డి తదితరులు చేసిన విమర్శల పరిస్థితి ఏమిటన్న చర్చ కూడా సాగుతుంది. టీడీపీ హయాంలో సతీష్ చంద్ర తీరు వివాదస్పదంగానే ఉండేది. అప్పటి సీనియర్ మంత్రులు అయ్యన్నపాత్రుడు, కె ఈ క్రిష్ణమూర్తి లాంటి బహిరంగంగానే సతీష్ చంద్రపై తీవ్ర విమర్శలు చేసిన విషయం తెలిసిందే. తాము ఇచ్చిన సమాచారం సీఎం వద్దకు చేరకుండా అడ్డుకున్నారని ఆరోపించారు. దీంతో పాటు ఆయన అప్పట్లో పలు వివాదాల్లోనూ ఇరుక్కున్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత సతీష్ చంద్రకు పోస్టింగ్ రావటంలోనూ విపరీతమైన జాప్యం జరిగింది. కానీ ఇప్పుడు ఏకంగా సీఎస్ పదవి హామీ దక్కినట్లు అధికార వర్గాలు చెబుతున్నాయి. మరి గతం మర్చిపోయి జగన్ సతీష్ చంద్రకే ఛాన్స్ ఇస్తారా? లేక జవహర్ రెడ్డి తెరమీదకు వస్తారా అన్నది వేచిచూడాల్సిందే.