ఎవరైనా కోటి రూపాయలు పెట్టి పరిశ్రమ పెడితే దానికి ప్రచార బడ్జెట్ మహా అయితే ఓ పది లక్షలు పెట్టుకుంటారు. అది కూడా చాలా ఎక్కువే. కానీ ఏపీ సర్కారు తీరే విచిత్రంగా ఉంది. అసలు యాప్ తయారీ ఖర్చు కంటే యాడ్స్ ఖర్చే ఎక్కువ. ఎక్కువ అంటే అది కూడా మామూలుగా కాదు. మామూలుగా అయితే ఓ మంచి మొబైల్ యాప్ తయారీకి ఐదు లక్షల రూపాయల ఖర్చు అవుతుంది. కానీ ఏపీ సర్కారు తీసుకొచ్చిన దిశ యాప్ అద్భుతమైన ఫీచర్లతో..హై ఎండ్ యాప్ అనుకుందాం. ఎంత అద్భుతంగా చేసినా ఈ యాప్ ఖర్చు 50 లక్షల రూపాయలు దాటదని యాప్ప్ తయారీలో విశేష అనుభవం ఉన్న ఓ ఐటి నిపుణుడు వెల్లడించారు. పోనీ రెట్టింపు మొత్తంతో కోటి రూపాయలు అయింది అనుకుందాం. కానీ ఏపీ సర్కారు ఈ యాప్ ప్రచారం కోసం ఖర్చు పెట్టిన మొత్తం కోట్ల రూపాయల్లో ఉంది. తెలుగు, ఇంగ్లీష్ పత్రికల్లో ఈ యాప్ పేరుతో జాకెట్ యాడ్స్ పండగ చేశారు. ఈ యాడ్స్ ఖర్చు తక్కువలో తక్కువ ఐదారు కోట్ల రూపాయల వరకూ ఉంటుందని ఓ అధికారి తెలిపారు. అంటే 50 లక్షల నుంచి కోటి రూపాయలతో తయారు చేసిన యాప్ ప్రచారం కోసం ఏకంగా ఐదారు కోట్ల రూపాయలు వ్యయం చేస్తున్నారన్న మాట. బహుశా ఇలాంటి వింత సంఘటనలు ఏపీలో మాత్రమే సాధ్యం అవుతాయోమే. దిశ యాప్ అనేది మహిళలకు రక్షణ కోసం ఉద్దేశించింది. తెలంగాణలో ఇప్పటికే ఇలాంటి యాప్ ఒకటి ఉంది. అయినా ఏపీ సర్కారు ఉద్దేశం మంచిదే.
ఇది ప్రజలకు..మహిళలకు పనికొచ్చేది కాబట్టి మీడియా కూడా సహజంగా ప్రచారం కల్పిస్తుంది. ఏపీ సర్కారు యాడ్స్ యజ్ఞంలో పాలు పంచుకుంటున్న వారందరికీ విధిగా దీని కవరేజ్ ఇవ్వాలని కూడా చెప్పొచ్చు. కానీ సర్కారే యాడ్స్ ఇవ్వటం అనేది ఓ యజ్ఞంగా నిర్వహిస్తోంది. అందుకే అసలు ఖర్చు కంటే యాడ్స్ ఖర్చు ఎక్కువైనా ఏ మాత్రం వెనకంజ వేయకూండా దూసుకెళుతోంది. ఈ విషయంలో ఏపీ సర్కారును బహుశా దేశంలోని ఏ రాష్ట్రం కూడా బీట్ చేయలేదేమో. కార్యక్రమం ఏదైనా జాకెట్ యాడ్ ఉండాల్సింది. గత కొన్ని నెలల తీరు చూస్తుంటే ఇలా నెలకు ఓ రెండు యాడ్స్ అయినా ఉండేలా పక్కాగా ప్లాన్ చేసినట్లే కన్పిస్తోంది. ఏదో ఒక కార్యక్రమం విడతల వారీగా నిర్వహించటం..విడత విడతకూ యాడ్స్ ఇవ్వటం ఏపీ సర్కారుకు ఓ నిత్య కార్యక్రమంగామారింది. మరో వైపు లక్షల రూపాయల దగ్గర నుంచి కోట్ల రూపాయల వరకూ సర్కారు పనులు చేసిన వారు బిల్లులు రాక నానా అవస్థలు పడుతున్నారు. స్వయంగా ఈ మధ్యే సర్కారు బిల్లులు చెల్లించేందుకు డబ్బులు లేవని కోర్టుకు తెలిపింది. అయినా సరే యాడ్స్ యజ్ఞం మాత్రం ఆపటం లేదు.