ఏపీలోని జగన్ సర్కారు కేంద్రంలోని బిజెపి ప్రభుత్వంపై యాడ్స్ యుద్ధం ప్రకటించిందా?. ఆదివారం నాటి పత్రికలు చూస్తే ఎవరికైనా ఇదే అనుమానం వస్తుంది. బిజెపి, టీడీపీ చేసే రాజకీయ విమర్శలకు కూడా ప్రభుత్వం కోట్ల రూపాయల ప్రజాధనం ఖర్చు పెట్టి ప్రధాన పత్రికల్లో జాకెట్ యాడ్స్ ఇవ్వటం దుమారం రేపుతోంది. ఈ తీరు చూసి అదికారులు కూడా అవాక్కు అవుతున్నారు. ఓ పక్క ఏపీ పూర్తిగా అప్పుల్లో కూరుకుపోయి రాజకీయ విమర్శలకు యాడ్స్ తో సమాధానం చెప్పటం ఏమిటి అంటూ విస్మయం వ్యక్తం చేస్తున్నారు. బిజెపి, టీడీపీ చేసే విమర్శల్లో అవాస్తవాలు ఉంటే..పార్టీపరంగా..ప్రభుత్వపరంగా వాస్తవాలు ప్రజలకకు చెప్పటంలో ఎవరూ అభ్యంతరం చెప్పరు. కానీ రాజకీయ విమర్శలకు, ప్రభుత్వం ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో ప్రజల సొమ్ముతో పేజీలకు పేజీలు ప్రకటనలు ఇవ్వటంపై అధికారులు కూడా అవాక్కు అవుతున్నారు. సీఎం జగన్ ఫోటో వేసి మరీ 'పెట్రోల్, డీజిల్ ధరలు పెంచింది ఎంత?. తగ్గించింది ఎంత?. లీటరు ధర 100 రూపాయలు దాటించి ఐదో, పదో తగ్గించాం అంటూ పెంచిన వారే రోడ్ల మీదకు వచ్చి నిరసన చేస్తామంటే ఇంతకంటే ఘోరం ఉంటుందా' అని ప్రశ్నించారు. యాడ్ లో. ఒకరేమో ఇబ్బడిముబ్బడిగా పెంచి, అరకొరగా తగ్గించి ధర్నాలు అంటూ ఇప్పుడు రాజకీయం చేస్తున్నారు. మరొకరు తమ హయాంలో ఎంత పెంచారు అన్నది మరచి రాజకీయం చేస్తున్నారు. ప్రజలకు వాస్తవాలు తెలియాలన్న సదుద్దేశంతోనే, వినయపూర్వకంగా అసలు నిజాలు మీ ముందు ఉంచుతున్నాం అంటూ యాడ్ లో పేర్కొన్నారు. అంతే కాదు కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ పై 3,35,000 కోట్లరూపాయల పన్నులు వసూలు చేసినప్పటికీ అందులో రాష్ట్రాలకు పంచింది కేవలం 19,475 కోట్ల రూపాయలు మాత్రమే. అంటే కేవలం 5.80 శాతం. వాస్తవంగా కేంద్రం వసూలు చేసే పన్నుల్లో రాష్ట్రాలకు 41 శాతం వాటా పంచవలసి ఉన్నప్పటికి పెట్రో ఆదాయాన్ని డివిజబుల్ పూల్ లోకి రాకుండా సెస్ లు, సర్ ఛార్జీలరూపంలో సుమారు 2,87,500 కోట్ల రూపాయలు వసూలు చేసి ఆ మేరకు రాష్ట్రాలకు ఇవ్వవలసిన వాటా తగ్గించిన విషయం వాస్తవం కాదా? అని ప్రశ్నించారు.
నిజంగానే ఏపీ సర్కారు చెప్పినట్లు కేంద్రం ఇలా మోసం చేస్తే ఈ విషయంపై ఇప్పటివరకూ కేంద్రానికి లేఖ రాయటం కానీ..ఈ అక్రమాలను సరిదిద్దాలని గట్టిగా డిమాండ్ చేయటం కానీ..ప్రభుత్వపరంగా, పార్టీపరంగా ఎక్కడైనా చేశారా?. చట్టబద్దంగా రాష్ట్రానికి రావాల్సిన వాటా రాకపోతే దీనిపై వైసీపీ చేసిన పోరాటం ఏమిటి?. ఇప్పటివరకూ ఈ అంశంపై ఎందుకు మౌనంగా ఉన్నట్లు. విభజన చట్టం ప్రకారం రావాల్సిన హామీలు ఇవ్వకపోతే బిజెపి సర్కారు మరో అన్యాయం చేస్తే వైసీపీ ఎందుకు మౌనంగా భరిస్తున్నట్లు?. ఇదే జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షంలో ఉండగా అప్పటి చంద్రబాబు సర్కారుపై పెట్రో ఉత్పత్తుల పన్నుల అంశంపై తీవ్ర విమర్శలు చేశారు. కానీ ఇప్పుడు పొరుగు రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో పెట్రోల్, డీజిల్ రేట్లు ఎక్కువ. అంతర్జాతీయంగా క్రూడ్ ఆయిల్ తగ్గుదల, పెరుగుదలతో సంబంధం లేకుండా కేంద్రం మాత్రం అడ్డగోలుగా రేట్లు పెంచుకుంటూ పోయింది. పన్నులరూపంలో ఈ రేట్ల పెరుగుదల ఉంది. రాజకీయ కారణాలో..మరో కారణాలో తెలియదు కానీ..కేంద్రం మాత్రం తాజాగా పన్నులు తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. అదే బాటలో బిజెపి పాలిత రాష్ట్రాలు రాష్ట్ర ప్రభుత్వాల పన్నులు కూడా తగ్గించాయి. కానీ ఏపీ, తెలంగాణల్లో మాత్రం ఇప్పటివరకూ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఇదే అంశంపై రాజకీయంగా డిమాండ్ లు వస్తుండటంతో ప్రభుత్వం ఇలా యాడ్స్ తో ఎదురుదాడి ప్రారంభించింది. రేట్లు తగ్గకపోతే ప్రజలపై ఇది మరో రకమైన భారమే అని ఓ అధికారి వ్యాఖ్యానించారు.