నేను నొక్కుతాను..మీరు నొక్కివ‌క్కాణించాలి

Update: 2022-07-19 06:43 GMT

Full Viewవైసీపీ ఎమ్మెల్యేల‌కు సీఎం జ‌గ‌న్ చెప్పింది ఇదే. ఎన్ని కష్టాలు ఉన్నా నేను బ‌ట‌న్ నొక్కుతున్నాను. నొక్కిన దానికి ఫ‌లితం మీరు రాబ‌ట్టాలి. ఆ బాధ్య‌త మీదే అదే అంటూ సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి వైసీపీ ఎమ్మెల్యేల‌కు హిత‌బోధ చేశారు. ముప్ప‌యి సంవ‌త్స‌రాలు అధికారంలో ఉండేలా పాల‌న అందిస్తాన‌ని చెప్పిన సీఎం జ‌గన్ మూడేళ్ల‌కే నా నొక్కుడు ఒక్క‌టే చాలదు...మీరు నొక్కి వ‌క్కాణించ‌టం కూడా కీల‌క‌మే అంటూ ఎమ్మెల్యేల‌ పాత్ర‌ను గుర్తించటంపై వైసీపీ నేత‌లు చ‌ర్చించుకుంటున్నారు. అతి త‌క్కువ స‌మ‌యంలో గ‌డ‌ప‌గ‌డ‌ప‌కూ ప్ర‌భుత్వం విష‌యంలో వైసీపీ అధినేత‌, సీఎం జ‌గ‌న్ పార్టీ ఎమ్మెల్యేల‌తో రెండ‌వ‌సారి స‌మావేశం నిర్వ‌హించిన విష‌యం తెలిసిందే. తాజాగా జ‌రిగిన వైసీపీ ప్లీన‌రీలో మాట్లాడిన మాజీ మంత్రి పేర్ని నాని కీలక వ్యాఖ్య‌లు చేశారు. ప్ర‌జ‌లు త‌మ‌ను చూసి కాద‌ని..జ‌గ‌న్ ను చూసి ఓటు వేసినందున‌..వ‌చ్చే ఎన్నిక‌ల్లోనూ ఆయ‌న్ను చూసే ఓటు వేయాలన్నారు. తాము ఇప్పుడు ఇక్క‌డ ఉంటాం..త‌ర్వాత ఎక్క‌డైనా ఉండొచ్చ‌న్నారు. మంత్రి జోగి ర‌మేష్ కూడా అంత‌కు ముందు జిల్లాలో జ‌రిగిన ప్లీన‌రీలో ఇవే త‌ర‌హా వ్యాఖ్య‌లు చేశారు. ఈ మూడేళ్ళ స‌మయంలో ఎప్పుడూ సీఎం జ‌గ‌న్ ఏదైనా సమావేశాలు ఉంటే త‌ప్ప‌....జిల్లాల వారీగా కానీ..విడిగా కానీ ప్ర‌త్యేకంగా ఎమ్మెల్యేల‌తో స‌మావేశం అయింద‌ని లేద‌ని ఓ సీనియ‌ర్ నేత వ్యాఖ్యానించారు.

ఏ ప‌థ‌కం అయినా..ఓ స్కీమ్ అయినా తాడేప‌ల్లిలోనే..లేక ఏదైనా జిల్లాలోనే కార్య‌క్ర‌మం పెట్టి అంతా సీఎం జ‌గ‌న్ చేతుల మీదుగా నొక్కుడు కార్య‌క్ర‌మం నిర్వ‌హించారు. రాజ‌కీయంగా ఇది త‌మ‌కు న‌ష్టం అయినా మ‌ధ్య‌వ‌ర్తులు లేకుండా ప్ర‌జ‌ల‌కు నేరుగా సాయం అందించేందుకు ఈ మార్గాన్ని ఎంచుకున్న‌ట్లు ప్ర‌భుత్వ స‌ల‌హాదారు స‌జ్జ‌ల రామ‌క్రిష్ణారెడ్డి ఓ సారి స్ప‌ష్టం చేశారు కూడా. ప్ర‌భుత్వం త‌ర‌పున సాయం అందించే విష‌యాల‌ను తెలుపుతూ ప‌త్రిక‌ల్లో ఇచ్చే ఫుల్ పేజీ, జాకెట్ యాడ్స్ లోనూ ఒక్క సీఎం జ‌గన్ త‌ప్ప ..సంబంధిత శాఖ మంత్రుల ఫోటోలు కూడా లేకుండా చేస్తున్న విష‌యం తెలిసిందే. ఉప ముఖ్య‌మంత్రులు..మంత్రుల‌కు శాఖ‌ల కేటాయింపు విష‌యంలో సామాజిక న్యాయం పాటించామ‌ని గొప్ప‌గా చెప్పుకునే సీఎం జ‌గ‌న్..క‌నీసం వారి ఫోటోల‌ను కూడా ప్ర‌భుత్వ యాడ్స్ లో వేయ‌టానికి అంగీక‌రించ‌టంలేద‌నే చ‌ర్చ ప్ర‌భుత్వ వ‌ర్గాల్లోనే సాగుతుంది. అదే స‌మ‌యంలో సీఎం పోస్టు అంటే అదేదో కేవ‌లం బ‌ట‌న్ నొక్క‌ట‌మే అన్న త‌ర‌హాలో జ‌గ‌న్ వ్యాఖ్య‌లు ఉన్నాయ‌నే అభిప్రాయం పార్టీ నేత‌ల్లో వ్య‌క్తం అవుతోంది. బ‌ట‌న్లు నొక్క‌టానికి అయితే సీఎంలు ఎందుకు..ఆ ప‌ని ఏ అధికారికి అప్ప‌గించినా చేస్తారు క‌దా..పాల‌న‌లో కొత్త మోడ‌ల్ చూపించాల్సిన నాయ‌కులు..ప్ర‌భుత్వ ధనాన్ని ప్ర‌జ‌ల‌కు పంచి ఇదే పాలన అన్న‌ట్లు వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని ఓ సీనియ‌ర్ అధికారి అభిప్రాయ‌ప‌డ్డారు.

Tags:    

Similar News