ఆదిత్యనాథ్ దాస్ కు అవమానం?!
సర్కారు తీరుపై ఐఏఎస్ ల్లో చర్చ
ఢిల్లీ నుంచి ఒత్తిళ్లే కారణమా?
ఏపీ ఐఏఎస్ వర్గాలు సర్కారు తీరు చూసి అవాక్కుతున్నాయి. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పోస్టు ఎవరికి ఇవ్వాలనేది ముఖ్యమంత్రి ఛాయిసే కీలకం. ఇందులో ఎలాంటి అనుమానాలు లేవు. ఆదిత్యనాథ్ దాస్ సెప్టెంబర్ 30కి రిటైర్ అవుతారనే విషయంలోనూ స్పష్టత ఉంది. తొలుత జగన్ సర్కారు ఆయనకు ఆరు నెలల పొడిగింపు కోరుతూ కేంద్రానికి లేఖ రాసింది. కేంద్రం మూడు నెలలే పొడిగింపు ఇచ్చింది. అది సెప్టెంబర్ 30తో ముగియనుంది. అయితే చంద్రబాబు హయాంలో ఒకే జీవోలో నెల రోజుల సీఎస్ గా అజయ్ కల్లాంను నియమిస్తూ..ఆ తర్వాత దినేష్ కుమార్ సీఎస్ బాధ్యతలు చేపడతారని ఉత్తర్వులు ఇచ్చారు. ఇది అప్పట్లో పెద్ద దుమారమే రేపింది. ఇది అజయ్ కల్లాంను అవమానించటమే అన్న చర్చ సాగింది అప్పట్లో. జగన్ హయాంలోనూ అదే సీన్ రిపీట్ అయింది. కాకపోతే ఆ పద్దతి మారింది అంతే. ఇరవై రోజుల ముందు..అందులో వినాయకచవితి పండగ..సెలవు రోజు ఏపీ కొత్త సీఎస్ గా సమీర్ శర్మను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. సహజంగా ఇలాంటి ఉత్తర్వులు..ప్రస్తుత సీఎస్ పదవి విరమణ చేయటానికి ఒకట్రెండు రోజుల ముందు వస్తాయి. మహా అయితే వారం రోజుల ముందు వస్తాయి. కానీ ఏకంగా ఇరవై రోజుల ముందే కొత్త సీఎస్ జీవో జారీ చేయటం అంటే ఇది ప్రస్తుతం పోస్టులో ఉన్న వారిని అవమానించటమే అని ఓ సీనియర్ అధికారి వ్యాఖ్యానించారు. పైగా ఇది ఏ మాత్రం మంచి సంప్రదాయం కాదన్నారు. ఛాయిస్ సీఎందే అయినా..ఇలాంటి నిర్ణయాలు తప్పుడు సంకేతాలు పంపుతాయని వ్యాఖ్యానించారు.
ఇది అంతా ఒకెత్తు అయితే తదుపరి సీఎస్ గా తెలుగుదేశం హయాంలో ఓ వెలుగు వెలిగిన సీనియర్ ఐఏఎస్ అధికారి సతీష్ చంద్రకు సీఎస్ పదవి ఇవ్వాలనుకుంటున్నట్లు సీఎం జగన్ స్వయంగా చెప్పినట్లు సీనియర్ ఐఏఎస్ వర్గాల్లో బాగా ప్రచారం జరిగింది. చాలా మంది సతీష్ చంద్ర తదుపరి సీఎస్ అవటం పక్కా అంటూ వారం రోజుల కిందట కూడా తమను కలసిన వారి వద్ద వ్యాఖ్యానించారు. కానీ అకస్మాత్తుగా సీఎం జగన్ నోటి నుంచి వచ్చిన మాట కాకుండా ఇలా పేరు మారటం వెనక కారణాలు ఏమై ఉంటాయా అన్న అంశంపై కూడా ఐఏఎస్ వర్గాల్లో చర్చ సాగుతోంది. ఢిల్లీ నుంచి వచ్చిన ఒత్తిళ్ళ మేరకే సమీర్ శర్మ పేరు తెరపైకి వచ్చినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. అందుకే ఇంత ముందుగా జీవో జారీ చేశారని ఓ ఉన్నతాధికారి అభిప్రాయపడ్డారు. దీంతో పాటు సీఎస్ పదవి ఆశిస్తున్న వారి నుంచి ఒత్తిళ్ళకు ఛాన్స్ లేకుండా చేసేందుకు ఇలా చేశారనే అభిప్రాయం కూడా ఉంది. ఏది ఏమైనా అప్పుడు చంద్రబాబు తరహాలోనే ఇప్పుడు జగన్ కూడా సీఎస్ లకు సంబంధించి నియామక ప్రక్రియలో ఓ కొత్త సంప్రదాయానికి తెరతీశారని ఐఏఎస్ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి.