ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సిమ్లా పర్యటన ముగించుకుని అమరావతి వచ్చేశారు. ఆయన తన సిల్వర్ జూబ్లి వివాహ వేడుకలు జరుపుకునేందుకు కుటుంబ సమేతంగా సిమ్లా వెళ్ళిన విషయం తెలిసిందే. వ్యక్తిగత పర్యటన సందర్భంగా భార్య భారతితో కలసి సరదాగా పర్యాటక ప్రాంతాల్లో సందర్శించిన ఫోటోలు కూడా బయటకు వచ్చాయి. ఇదిలా ఉంటే సీఎం జగన్ వచ్చిన విమానంపైన ప్రత్యేకంగా రెండు పేర్లు కన్పిస్తున్నాయి. అందులో ఒకటి జయ్ అన్ మోల్, మరొకటి జై అన్షుల్. వీళ్లిద్దరూ అనిల్ అంబానీ, టినా అంబానీల కొడుకులు. అయితే ఆర్ధికంగా దివాళా తీసిన అనిల్ అంబానీ చేతిలో ప్రత్యేకంగా విమానం ఉందా?. లేక ఇది ముఖేష్ అంబానీల ఆధీనంలో ఉన్నదా అన్న అంశంపై స్పష్టత లేదు.
ఏపీ సీఎం జగన్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రత్యేక విమానాల్లో పర్యటిస్తున్నారు. గతంలో ఇదే జగన్ ప్రత్యేక విమానాల వాడకంపై విమర్శలు చేసి..తాను అధికారంలోకి వచ్చాక అదే మోడల్ ఫాలో అవుతున్నారు. ముఖేష్ అంబానీ కి అత్యంత సన్నిహితుడు అయిన పరిమళ్ నత్వానీకి వైసీపీ తరపున రాజ్యసభ సభ్యత్వం ఇచ్చిన విషయం తెలిసిందే. ఆయన పార్టీ కార్యక్రమాలకు హాజరు కావటం కానీ..ఏపీ తరపున ఎక్కడా మాట్లాడిన దాఖలాలు లేవు. సీఎం జగన్ ఇప్పుడు అంబానీలకు చెందిన విమానంలో రావటం ఆసక్తికర పరిణామంగా మారింది. అయితే మామూలుగా కూడా అద్దెకు తెచ్చుకున్న విమానాల్లోనే పర్యటిస్తున్నారు.