కెసీఆర్ ను రాజ‌కీయంగా ఫిక్స్ చేసిన జ‌గ‌న్ !

Update: 2021-07-02 13:33 GMT

ఏపీ, తెలంగాణల జ‌ల‌వివాదం కొత్త మ‌లుపు తిరిగింది. గ‌త కొన్ని రోజులుగా ముఖ్య‌మంత్రి కెసీఆర్..తెలంగాణ మంత్రులు ఏపీ స‌ర్కారుపై, సీఎం జ‌గ‌న్ పై తీవ్ర స్థాయిలో విమర్శ‌లు గుప్పిస్తున్నారు. ముఖ్యంగా రాయ‌ల‌సీమ లిఫ్ట్ ఇరిగేష‌న్ ప్రాజెక్ట్ పై వీరు తీవ్ర అభ్యంత‌రం వ్య‌క్తం చేస్తున్నారు. ఈ త‌రుణంలో శుక్ర‌వారం నాడు స‌జ్జ‌ల రామ‌క్రిష్ణారెడ్డి చేసిన వ్యాఖ్య‌లు రాజ‌కీయంగా కెసీఆర్ ను తీవ్ర ఇర‌కాటంలోకి నెట్టే ప‌రిస్థితి క‌న్పిస్తోంది. స‌జ్జ‌ల చెప్పారంటే అంటే అది సీఎం జ‌గ‌న్ మాట కిందే లెక్క అన్న సంగ‌తి తెలిసిందే. అది ఎంత పెద్ద ప్ర‌భుత్వం విష‌యం అయినా..పార్టీ అంశం అయినా స‌జ్జ‌లే మాట్లాడ‌తారు. తాజాగా ఆయ‌న చేసిన వ్యాఖ్య‌లు రాజ‌కీయంగా తెలంగాణ‌లో మంట‌లు పుట్టించేవే. అవి ఏమిటంటే జ‌గ‌న్ ప్ర‌య‌త్నాల‌ను కెసీఆర్ అంగీక‌రించారు..ప్రోత్స‌హించారు కూడా అని వ్యాఖ్యానించారు. ఇవే ఇప్పుడు అత్యంత కీలకం. గ‌త కొంత కాలంగా తెలంగాణ‌లో ప్ర‌తిప‌క్ష పార్టీలు కూడా ఇవే విమ‌ర్శ‌లు చేస్తున్నాయి. తాజాగా టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి కూడా ప్ర‌గ‌తి భ‌వ‌న్ లోనే ఈ ప్రాజెక్టుకు రూప‌క‌ల్ప‌న జ‌రిగింద‌ని ఆరోపించారు. ఇప్పుడు ఏపీ ప్ర‌భుత్వ స‌ల‌హాదారు ఏకంగా సీఎం కెసీఆర్ అంగీకారం..ప్రోత్సాహంతోనే చేస్తున్నార‌ని ప్ర‌క‌టించ‌టం ద్వారా ఈ వ్య‌వ‌హారం కొత్త మ‌లుపు తిప్పిన‌ట్లు అయింది.

రాయ‌ల‌సీమ‌ను స‌స్య‌శ్యామ‌లం చేస్తా..ర‌తనాల సీమ చేస్తా అంటూ తెలంగాణ సీఎం కెసీఆర్ ఏపీ ప‌ర్య‌ట‌న సంద‌ర్బంగా చేసిన వ్యాఖ్యలు అప్ప‌ట్లోనే మీడియాలో ప్ర‌ముఖం వ‌చ్చాయి. అయితే ఇప్పుడు అత్యంత కీల‌కంగా మారింది ఏమిటంటే జ‌గ‌న్ ప్ర‌య‌త్నాల‌కు కెసీఆర్ అంగీక‌రించారు...ప్రోత్స‌హించారు అన‌టంతో ఆయ‌న ఆమోదంతోనే ఏపీ కొత్త‌గా త‌ల‌పెట్టిన ప్రాజెక్టు సాగుతున్న‌ట్లు చెప్పిన‌ట్లు అయింది. మ‌రి స‌జ్జ‌ల వ్యాఖ్య‌లు తెలంగాణ‌లో రాజ‌కీయంగా ఎంత వేడి రాజేస్తాయ‌న్న‌ది వేచిచూడాల్సిందే. ఇవి ఏపీ కంటే తెలంగాణ‌కే అత్యంత కీల‌కం అన్న విష‌యం తెలిసిందే. తెలంగాణ‌లోని ప్ర‌తిప‌క్ష పార్టీల విమ‌ర్శ‌ల‌ను ఎండార్స్ చేసేలా స‌జ్జ‌ల వ్యాఖ్య‌లు ఉన్నాయ‌ని...ఇవి భ‌విష్య‌త్ లో ఖ‌చ్చితంగా కెసీఆర్ ను ఇర‌కాటంలోకి నెడ‌తాయ‌ని ఓ సీనియ‌ర్ నేత వ్యాఖ్యానించారు. దీని ద్వారా తెలంగాణ సీఎం కెసీఆర్ ను జ‌గ‌న్ బాగా ఫిక్స్ చేసిన‌ట్లు అయింద‌ని అన్నారు.

Tags:    

Similar News