వైసీపీ వాయిస్ కు వైఎస్ జ‌గన్ ఈ సారైనా చోటిస్తారా?

Update: 2022-03-30 12:18 GMT

Full Viewఆంధ్ర‌ప్ర‌దేశ్ లో మంత్రివ‌ర్గ పున‌ర్ వ్య‌వ‌స్థీక‌ర‌ణ‌కు రంగం సిద్ధం అయింది. సీఎం జ‌గ‌న్ గ‌తంలో ఏ సీఎం చేయ‌ని రీతిలో ప్ర‌యోగాలు చేస్తున్నారు. తొలి రెండున్న‌ర సంవ‌త్స‌రాలు కొంత మందికి..త‌ర్వాత రెండున్న‌ర సంవ‌త్స‌రాలు మ‌రికొంత మందికి మంత్రివ‌ర్గంలో చోటు క‌ల్పిస్తాన‌ని ప్ర‌క‌టించి సంచ‌ల‌నం రేపారు. అయితే కోవిడ్ కార‌ణంగా ఈ మార్పులు కొంత ఆల‌శ్యం అయ్యాయి. ఏప్రిల్ 11న మంత్రివ‌ర్గ విస్త‌ర‌ణ‌కు రంగం సిద్ధం అయింది. అయితే ఇప్పుడు మంత్రివ‌ర్గ విస్త‌ర‌ణ విష‌యంలో అంద‌రి చూపు వారివైపే ఉంది. వారే ఆర్ కె రోజా, అంబ‌టి రాంబాబు, ఆళ్ల రామ‌క్రిష్ణారెడ్డి. వైసీపీ ప్ర‌తిప‌క్షంలో ఉండ‌గా..రోజా, అంబ‌టి రాంబాబులు నిత్యం మీడియా స‌మావేశాలు నిర్వ‌హించి ఆ పార్టీ వాయిస్ ను బ‌లంగా ప్ర‌జ‌ల్లోకి తీసుకెళ్లేవారు. గ‌త టీడీపీ ప్ర‌భుత్వంపై నిత్యం విమ‌ర్శ‌లు చేస్తూ వీరిద్ద‌రే ముందు వ‌ర‌స‌లో ఉండేవారు. వాస్త‌వానికి తొలి సారి జ‌గ‌న్ కేబినెట్ లోనే వీరిద్ద‌రికి ఛాన్స్ వ‌స్తుంద‌ని పార్టీలో అంద‌రూ భావించారు. కానీ జ‌గ‌న్ మాత్రం ఎవ‌రూ ఊహించ‌ని రీతిలో వీరిద్ద‌రికి ఛాన్స్ ఇవ్వ‌లేదు.

దీంతో అప్ప‌ట్లో వైసీపీ నేత‌లు కూడా ఒకింత షాక్ కు గుర‌య్యారు. రోజా త‌న అసంతృప్తి వ్య‌క్తం చేయ‌గా..ఆమెకు ఏపీఐఐసీ ఛైర్మ‌న్ ప‌ద‌వి ఇచ్చారు. అంబ‌టికి అలాంటిది కూడా ఏమీలేదు. ఇప్పుడు మంత్రివ‌ర్గ పున‌ర్ వ్య‌వస్థీక‌ర‌ణకు రంగం సిద్ధం కావ‌టంతో గ‌తంలో పార్టీ వాయిస్ బ‌లంగా విన్పించిన అంబ‌టి రాంబాబు, రోజాల‌కు ఈ సారైనా ఛాన్స్ వ‌స్తుందా లేదా అన్న అంశాన్ని అంద‌రూ ఆస‌క్తిగా గ‌మ‌నిస్తున్నారు. వీరిద్ద‌రితోపాటు మంగ‌ళ‌గిరి ఎమ్మెల్యే ఆళ్ళ రామ‌క్రిష్ణారెడ్డికి త‌న మంత్రివ‌ర్గంలో చోటు క‌ల్పిస్తాన‌ని సీఎం జ‌గ‌న్ ప్ర‌క‌టించారు. దీంతో ఆయ‌న‌కు ఇచ్చిన హామీని జ‌గ‌న్ నిలబెట్టుకుంటారా లేదా అన్న‌ది ఆస‌క్తిక‌రంగా మారింది. మ‌రో నేత మ‌ర్రి రాజ‌శేఖ‌ర్ కు గ‌త ఎన్నిక‌ల్లో సీటు ఇవ్వ‌లేక‌పోయినందుకు ఎమ్మెల్సీ చేసి మంత్రి ప‌ద‌వి ఇస్తామ‌ని హామీ ఇచ్చారు. ఇప్ప‌టివ‌ర‌కూ ఎమ్మెల్సీ హామీనే అమ‌లుకు నోచుకోలేదు. ఈ సారి జ‌గ‌న్ మంత్రివ‌ర్గ పున‌ర్ వ్య‌వ‌స్థీక‌ర‌ణ‌లో ఎన్ని సంచ‌ల‌నాలు న‌మోదు చేస్తారో వేచిచూడాల్సిందే.

Tags:    

Similar News