రెండేళ్ళలో మూడు రాజధానుల సాధ్యం అయ్యేనా?
ఆర్ధిక పరిస్థితులు అనుకూలిస్తాయా?
ఏపీలో రాజధాని అనిశ్చితి ఇప్పట్లో వీడేలా లేదు. తొలి ఐదేళ్ళే కాదు..తర్వాత ఐదేళ్లు కూడా ఏపీ రాజధాని లేకుండానే సాగిపోయేలా కన్పిస్తోంది. తాజా పరిణామాలు దీనికి మరింత ఊతం ఇస్తున్నాయి. రాజధాని అమరావతికి సంబంధించి నవంబర్ 15 నుంచి ఏపీ హైకోర్టు రోజువారీ విచారణకు నిర్ణయం తీసుకుంది. ఇది అత్యంత వేగంగా పూర్తి అవుతుంది అనుకున్నా తక్కువలో తక్కువగా కనీసం ఆరు నెలల సమయం పడుతుందని న్యాయ నిపుణుల అంచనా. ఆరు నెలలు అంటే అప్పటికి జగన్ సర్కారు అధికారంలోకి వచ్చి మూడు సంవత్సరాలు పూర్తి అవుతుంది. అంటే ఆయనకు మిగిలి ఉండేది ఇంకా రెండేళ్ళే. అందులో చివరి ఏడాది అంతా ఎన్నికల హడావుడే. ఏ ప్రభుత్వం ఉన్నా కూడా పరిపాలన అంతా అరకొరగానే సాగుతుంది. రాజకీయ వేడి మొదలవుతుంది. అంటే ఏడాది కాలంలో కోర్టు గ్రీన్ సిగ్నల్ ఇస్తే సీఎం జగన్ తన మూడు రాజధానుల ప్లాన్ ను అమలు చేయటం సాధ్యం అవుతుందా?. అంటే ఇది ఏ మాత్రం జరిగే పనికాదు అని అధికార వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. కోర్టులు..అనుమతులు అన్నింటి కంటే ముఖ్యం రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి. ఇప్పటికే ఏపీ ఆర్ధిక పరిస్థితి దారుణాతి దారుణంగా ఉంది.. అది ఎంతలా అంటే గతంలో ఎన్నడూలేని రీతిలో రోడ్ల పనుల కోసం టెండర్లు పిలిచినా కాంట్రాక్టర్లు కనీసం అటువైపు కన్నెత్తిచూడకపోవటం. రాబోయే రోజుల్లో పరిస్థితి మరింత దిగజారటమే తప్ప..మెరుగుపడే సంకేతాలు అయితే పెద్దగా ఎక్కడా కన్పించటంలేదు. ఈ వాతావరణం చూస్తుంటే సీఎం జగన్ తలపెట్టిన మూడు రాజధానుల్లో ఏ ఒక్క చోట కూడా పనులు పట్టాలెక్కి ముందుకు సాగే వాతావరణం కన్పించటం లేదు. అంటే ఏపీ ప్రజలు మరో ఐదేళ్ళు కూడా రాజధాని లేకుండానే అనిశ్చితిలో ముందుకు సాగనున్నారన్న మాట. ఐదేళ్ళలో అమరావతిలో ఒక్క ఇటుక కూడా పెట్టలేదంటూ చంద్రబాబుపై గతంలో విమర్శలు చేసిన సీఎం జగన్ కు ఇది ఖచ్చితంగా ఇబ్బందికర పరిస్థితే.
అటు అమరావతి వద్దనుకుని..ఇటు మూడు రాజధానుల విషయంలో ఎక్కడా కూడా ఎలాంటి పురోగతి చూపించకపోతే రాజకీయంగా కూడా వైసీపీకి నష్టం చేయటం ఖాయం అని అధికార వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. నిజంగా సీఎం జగన్ మూడు రాజధానుల విషయంలో నిక్కచ్చిగా ముందుకు వెళ్ళాలనుకుంటే అమరావతి రైతులతో పరస్పర ఆమోదయోగ్యమైన ఒప్పందం చేసుకుని ఉండేవారని..కానీ ఆ దిశగా ఎలాంటి ప్రయత్నాలు లేకపోవటంతో సమస్య సంక్లిష్టంగా మారిందని అధికార వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. రాజధాని కోసం రైతులు భూములు ఇవ్వటం, ఇప్పటికే గత ప్రభుత్వం అక్కడ దాదాపు 15 వేల కోట్ల రూపాయల వరకూ వ్యయం చేసి ఉండటం కూడా కోర్టు విచారణలో కీలక అంశాలుగా మారబోతున్నాయి. ఏపీ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలతో ఇతర డెవలప్ మెంట్ పథకాలకు నిధుల సమస్య తీవ్రంగా వెంటాడుతోంది. కొత్తగా ఎలాంటి పనులు చేపట్టాలన్నా అప్పులపైనే ఆధారపడాల్సిన పరిస్థితి. ఈ దశలో రెండేళ్ళ వ్యవధిలో సీఎం జగన్ తలపెట్టిన మూడు రాజధానులు ముందుకు సాగటం కలే నని ఓ సీనియర్ అధికారి వ్యాఖ్యానించారు. ఇదే పరిస్థితి కొనసాగితే ఇబ్బడిముబ్బడిగా అమలు అవుతున్న సంక్షేమ పథకాలకు కూడా కోత పెట్టాల్సిన పరిస్థితి తప్పదంటున్నారు.