మోడీ కోసం అదానీ స్కాం పై జగన్, బాబు, పవన్ సైలెన్స్ !

Update: 2023-02-20 04:44 GMT

అదానీ గ్రూప్ -హిండెన్ బర్గ్ రీసెర్చ్ ఎపిసోడ్ దేశంలోనే కాకుండా విదేశాల్లోనూ ప్రకంపనలు రేపుతోంది. ఈ దెబ్బకు అదానీ గ్రూప్ షేర్ల విలువ ఏకంగా పది లక్షల కోట్ల రూపాయల మేర పతనం అయిన విషయం తెలిసిందే. దీంతో లక్షలాది మంది ఇన్వెస్టర్లు లబోదిబోమంటున్నారు. దీనిపై దేశంలోని పార్టీలు అన్ని మాట్లాడుతున్నాయి. కాని విచిత్రం ఏమిటి అంటే ఆంధ్ర ప్రదేశ్ లోని అధికార వైసీపీ, ప్రతిపక్ష తెలుగు దేశం పార్టీలు దీనిపై ఒక్కటంటే ఒక్క మాట మాట్లాడటం లేదు. అంతే కాదు...ఒకవైపు హిండెన్ బర్గ్ రీసెర్చ్ నివేదిక బయటకు వచ్చాక అదానీ గ్రూప్ లో అల్లకల్లోలం సాగుతుంది. అయినా సరే ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఇటీవల జరిగిన మంత్రివర్గ సమావేశంలో అదానీ ప్రాజెక్టులకు పలు భూ కేటాయింపులు చేస్తూ నిర్ణయం తీసుకున్నట్లు వార్తలు వచ్చాయి. ఒక వైపు ఈ గ్రూప్ పై దేశమంతటా రచ్చ నడుస్తున్నా ఇవేమి పట్టించుకోకుండా జగన్ సర్కారు మాత్రం తన పని తాను కానిచ్చేసింది. జగన్ ఎప్పుడో బహిరంగ సభల్లో తాను తిట్టాలనుకున్న వాళ్ళను తిట్టేసి ఊరుకుంటారు తప్ప...ఏ ఇష్యూ మీద అయన మీడియా తో మాట్లాడరు అనే విషయం తెలిసిందే.

                                     దేశ వ్యాప్తంగా పెద్ద సంచలనంగా మారిన అదానీ ఎపిసోడ్ పై అటు జగన్ కానీ..ఇటు వైసీపీ నుంచి కానీ అసలు ఎలాంటి ప్రకటన లేదు. అన్ని అంశాలపై స్పందించటానికి ముందు ఉండే తెలుగు దేశం పార్టీ, ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు కూడా ఈ విషయంలో ఎక్కడ నోరు తెరవటం లేదు. మరో కీలక పార్టీ జనసేన కూడా అదే లైన్ లో ఉంది. ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కూడా దీనిపై మాట్లాడ లేదు. ప్రస్తుతానికి బీజేపీ, జనసేనలు మిత్ర పక్షాలుగా ఉన్నాయి. అందుకే పవన్ దీనిపై మాట్లాడే ఛాన్స్ లేదు అని చెపుతున్నాడు. అదానీ కి వ్యతిరేకంగా మాట్లాడితే ప్రధాని మోడీకి ఎక్కడ కోపం వస్తోందో అని అటు జగన్, ఇటు చంద్రబాబులు సైలంట్ గా ఉన్నట్లు ఉన్నారని ఒక సీనియర్ ఐఏఎస్ అధికారి వ్యాఖ్యానించారు. హిండెన్ బర్గ్ రీసెర్చ్ రిపోర్ట్ తర్వాత కూడా ఈ ప్రకంపనలు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా ఫోర్బ్స్ కూడా నిబంధనలు ఉల్లఘించి అదానీ గ్రూప్ విదేశాల్లో రుణం తీసుకున్నట్లు వెల్లడించారు. ఇంత జరుగుతున్నా ప్రధాని మోడీ, సెబీ లు మాత్రం అంతా బాగున్నాయని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు.



Tags:    

Similar News