దేశంలోనే అరుదైన ఎక్స్ టెన్షన్ పొందిన రెండవ వ్యక్తిగా సమీర్ శర్మ!
అసాధారణం. ఇప్పటివరకూ బిజెపి పాలిత రాష్ట్రమైన యూపీలోనే ఇలా జరిగింది. ఇప్పుడు బిజెపి పాలిత రాష్ట్రం కాకపోయినా..వైసీపీ పాలనలో ఉన్న ఏపీలోనూ యూపీని చూసినట్లే చూస్తున్నారు ఢిల్లీ పెద్దలు. అన్ని విషయాల్లో కాకపోయినా కనీసం కొన్నింట్లో అయినా. ప్రధాని మోడీ స్థాయిలో వ్యక్తిగతంగా తలచుకుంటే తప్ప ఇది అదికారుల స్థాయిలో జరిగే నిర్ణయం కాదు. పలు రాష్ట్రాల్లో సీఎస్ స్థాయిలో ఉన్న వారికి ప్రత్యేక పరిస్థితుల్లో మూడు నెలలు లేదా ఆరు నెలల వరకూ గరిష్టంగా పదవి కాలం పొడిగింపు ఇస్తారు. కానీ ఇప్పటివరకూ ఆరు నెలలు దాటిన తర్వాత కూడా మరో ఆరు నెలలు పొడిగింపు పొందిన వారిలో ఏపీ సీఎస్ సమీర్ శర్మ రెండవ వ్యక్తి అని అధికార వర్గాలు తెలిపాయి. వాస్తవానికి పీఎంవోలోని ఉన్నతాధికారి ఒకరు ఇలా పొడిగింపు ఇవ్వటం నిబంధనలకు విరుద్ధం అయినందున తాను ప్రతిపాదనలు పెట్టలేనని..ఏదైనా ఉంటే నేరుగా ప్రధాని మోడీతో మాట్లాడుకోవాలని సూచించగా..అలాగే చేశారని ఢిల్లీలోని ఓ ఉన్నతాధికారి తెలిపారు. ఏపీ సర్కారుకు అందిన ఆదేశాల్లోనూ అదే అంశం స్పష్టంగా కన్పిస్తోంది. ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఏప్రిల్ 12న ప్రధాని నరేంద్రమోడీకి ఇదే అంశంపై లేఖ రాయగా..ప్రధాని మోడీ దీనికి అనుగుణంగా నిర్ణయం తీసుకున్నారు. అఖిల భారత సర్వీసు అధికారుల నిబంధనలకు మినహాయింపు ఇచ్చిమరీ సమీర్ శర్మకు అదనంగా మరో ఆరు నెలలు సర్వీసు పొడిగింపు కల్పించారు. పోనీ ఇప్పుడు ఏమైనా కరోనా వంటి అసాధారణ పరిస్థితులు ఉన్నాయా..లేక సమీర్ శర్మ లేకపోతే ఏపీ పాలన ముందుకు సాగదనే పరిస్థితి అంటే అదేమీ లేదు.
కానీ సీఎం జగన్ అడిగారు..ప్రధాని మోడీ ఓకే అన్నారు. అంటే ప్రధాని మోడీకి కావాల్సిన పనులు సీఎం జగన్ చేసి పెడుతున్నారని..అలాగే జగన్ కు కావాల్సిన పనులు ప్రధాని మోడీ చేస్తున్నారని ఓ ఉన్నతాధికారి వ్యాఖ్యానించారు. అదేదో రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించినవో..మరొకటో అనుకుంటే పొరపాటే. పరస్పర అవసరాలు...రాజకీయ అంశాలకు అనుగుణంగానే ఇది అంతా సాగుతోందని ఓ అధికారి వ్యాఖ్యానించారు. ఓ వైపు తెలంగాణకు అప్పుల విషయంలో నో చెబుతున్న కేంద్రం..అదే ఏపీ విషయానికి వస్తే మాత్రం సై సై అంటూ అనుమతులు ఇచ్చేస్తోంది. ఓ వైపు కేంద్ర అధికారులే నిబంధనల ఉల్లంఘన జరుగుతోందని లేఖలు రాస్తూనే ఉంటారు..కానీ రావాల్సిన అనుమతులు వస్తూనే ఉంటాయి. అలా ఉంటది మరి ఏపీ సీఎం జగన్ తో అని వ్యాఖ్యానించారు ఓ సీనియర్ అధికారి. ఏది ఏమైనా కూడా సమీర్ శర్మకు దక్కిన ఈ అదనపు ఎక్స్ టెన్షన్ తో మోడీ, జగన్ ల బంధం ఎంత బలోపేతంగా ఉందో నిరూపించిందని అధికార వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. ఇలాంటిఅసాధారణ ఉత్తర్వులు సహజంగా చివరి నిమిషంలో వస్తాయని..అలా కాకుండా ఏకంగా పదమూడు రోజుల ముందుగానే ఈ ఆదేశాలు రావటం అంటే ఆషామాషీ వ్యవహారం కాదని అభిప్రాయపడ్డారు ఓ అధికారి.