రాష్ట్రంలోని పందొమ్మిది జిల్లాల్లో ప్రజలకు ఉచితంగా వైద్య పరీక్షలు అందుబాటులోకి రానున్నాయి. సర్కారు కొత్తగా 19 జిల్లాల్లో ప్రభుత్వ ఆధ్వర్యం డయాగ్నిస్టిక్ సెంటర్లు ఏర్పాటు చేయనుంది. ఈ మేరకు ముఖ్యమంత్రి కెసీఆర్ ఆదేశాలు జారీ చేశారు. తెలంగాణ ప్రజలకు మెరుగైన వైద్యం అందిచేందుకు, అన్నిరకాల వైద్యసేవలను మరింతగా అందుబాటులోకి తేవడమే ప్రభుత్వ లక్ష్యం అని సిఎం అన్నారు. కరోనా వంటి వ్యాధుల నేపథ్యంలో , రాష్ట్ర వ్యాప్తంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు సహా పలు ఇతర ప్రభుత్వ దవాఖానాల్లో మౌలిక వసతులను మెరుగుపరిచామన్నారు. ప్రజలకు ఉచిత వైద్యకోసం ఇప్పటికే పలు పథకాలను ప్రభుత్వం అమలు చేస్తున్నదన్నారు. సామాన్యుడికి వైద్యాన్ని మరింతగా అందుబాటులోకి తెచ్చి ఆరోగ్య తెలంగాణను తీర్చిదిద్దుతున్న తెలంగాణ ప్రభుత్వం ఆ దిశగా మరో ముందడుగు వేస్తుందన్నారు. వైద్యంలో అత్యంత కీలకమైన రోగ నిర్ధారణ పరీక్షా (డయాగ్నోస్టిక్) కేంద్రాలను తెలంగాణలోని జిల్లా ప్రధాన కేంద్రాల్లో ఏర్పాటు చేయాలని నిర్ణయించడం రాష్ట్ర వైద్య చరిత్రలో గొప్ప సందర్భమని తెలిపారు. ప్రజలకు వైద్యం రాను రాను అత్యంత ఖరీదుగా మారిందని, పేదలకు జబ్బు చేస్తే నయం చేయించుకోవడానికి ఆస్తులు అమ్ముకునే పరిస్థితి వచ్చిందన్నారు.
దీన్ని దృష్టిలో ఉంచుకునే ప్రభుత్వ ఆధ్వర్యంలో డయాగ్నోస్టిక్ సెంటర్లు ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. ప్రభుత్వాస్పత్రుల్లో డాక్టర్ పరీక్ష చేసి మందులు రాస్తాడు కానీ.. ప్రైవేట్ సెంటర్లకు వెళ్లి వేల వేలు ఖర్చు చేయాల్సి వస్తుందన్నారు. ప్రభుత్వ డయాగ్నోస్టిక్ సెంటర్లలో 57 పరీక్షలు ఉచితమని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. ఈ నెల 7న తెలంగాణలో 19 జిల్లా కేంద్రాల్లో డయాగ్నోస్టిక్ సెంటర్లు ప్రారంభించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారు. ఈ మేరకు శనివారం వైద్యాధికారులకు ఆదేశాలు జారీ చేశారు. వైద్యారోగ్యశాఖ అధికారులతో మాట్లాడిన సీఎం.. రాష్ట్రంలో కరోనా తగ్గుముఖం పడుతున్న తీరును అడిగి తెలుసుకున్నారు. వైద్య సేవల గురించి, పలు అంశాల మీద అధికారులతో సీఎం చర్చించారు.మహబూబ్ నగర్, భద్రాద్రి, జగిత్యాల, సిద్ధిపేట, నల్లగొండ, ఖమ్మం, సిరిసిల్ల, వికారాబాద్, నిర్మల్, కరీంనగర్,ఆదిలాబాద్, గద్వాల్, అసిఫాబాద్ తదితర జిల్లా కేంద్రాల్లో ఇవి ఏర్పాటు కానున్నాయి.