కానీ రేవంత్ రెడ్డి సర్కారు మాత్రం ఈ ప్రాజెక్ట్ పై మరో నాలుగు వేల కోట్ల రూపాయలు ఖర్చుపెట్టడానికి సిద్ధం అవుతోంది. రైతుల కోసం ఇప్పటికే భారీ వ్యయం చేసిన ప్రాజెక్ట్ పునరుద్ధరణకు ఈ ఖర్చు చేయటం ఏ మాత్రం తప్పు కాకపోయినా కూడా...గత ప్రభుత్వంలో జరిగిన అక్రమాలు..అవినీతికి బాధ్యులు ఎవరో గుర్తించకుండా...వాళ్లపై ఎలాంటి చర్యలు తీసుకోకుండా ఈ పని చేయటం...ప్రజల సొమ్ము అంటే అధికారంలో ఉన్న వాళ్ళ ఇష్టం అన్నట్లు చేయటం ఏ మాత్రం సరికాదు అనే చర్చ సాగుతోంది. 4000 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే కొత్తగా ఒక మీడియం సైజు సాగునీటి ప్రాజెక్ట్ పూర్తి చేయవచ్చు అని చెపుతున్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ అవినీతి నిగ్గుతేల్చేందుకు అంటూ జస్టిస్ పీసి ఘోష్ కమిషన్ వేసినా కూడా దీని పరిధి నుంచి అతి కీలక మైన కంపోనెంట్స్ ను రేవంత్ రెడ్డి సర్కారు తప్పించినట్లు స్పష్టంగా కనిపిస్తోంది. ఈ ప్రాజెక్ట్ లో బందిపోట్ల లా దోచుకున్నారు అని తాను స్వయంగా ఆరోపించిన వాళ్ళను ఇప్పుడు తన పక్కనే తిప్పుకుంటున్నారు సీఎం.
జస్టిస్ పీసి ఘోష్ కమిషన్ నివేదికను కూడా సిబిఐ విచారణ కోసం అంటూ కేంద్రానికి పంపి చేతులు దులుపుకుంది రేవంత్ రెడ్డి సర్కారు. ఇదే కాళేశ్వరం ప్రాజెక్ట్ పై రేవంత్ రెడ్డి...ఉత్తమ్ కుమార్ రెడ్డి వంటి నేతలు ప్రతిపక్షంలో ఉండగా చేసిన ఆరోపణలు అన్నీ ఇన్నీ కావు. ఇక్కడ విచిత్రం ఏమిటి అంటే దెబ్బతిన్న కాళేశ్వరం ప్రాజెక్ట్ పునరుద్ధరణ కు 500 కోట్ల రూపాయల లోపు ఖర్చుపెడితే సరిపోతుంది అని...తమకు అప్పగించితే తామే రిపేర్లు చేయించుతాం అంటూ బిఆర్ఎస్ నేతలు సవాళ్లు విసిరారు గతంలో. వాళ్ళు కట్టించిన ప్రాజెక్ట్ లో పగుళ్లు వచ్చినా కూడా ఇప్పటికీ కుట్ర సిద్ధాంతాలను ప్రచారం చేస్తున్నారు. ఈ విషయంలో సీఎం రేవంత్ రెడ్డి...మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి రాజీ పడటం కూడా బిఆర్ఎస్ వాళ్లకు కలిసి వచ్చింది అనే చర్చ అధికార, రాజకీయ వర్గాల్లో ఉంది.