గత కొన్ని రోజులుగా తెలంగాణలో బిఆర్ఎస్ కీలక నేతల భూములు...ఆస్తుల వ్యవహారం తీవ్ర చర్చనీయాంశగా మారింది. దీనికి ప్రధాన కారణం తెలంగాణా అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన ప్రకటనే అని చెప్పాలి. ధరణిని అడ్డంపెట్టుకుని కెసిఆర్ కుటుంబ సభ్యులతో పాటు ఇతర నేతలు కూడా అక్రమంగా భూములు సంపాదించారు అని రేవంత్ రెడ్డి ఆరోపించిన సంగతి తెలిసిందే. తర్వాత దీనిపై విచారణకు కూడా ఆదేశించారు. బుధవారం నాడు సిరిసిల్ల లో పర్యటించిన సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీ లో చెప్పిన దానికి పార్ట్ 2 అంటూ కేటీఆర్ ఫ్యామిలీకి హైదరాబాద్ లోని హై టెక్ సిటీ పరిసర ప్రాంతాల్లో స్టార్ హోటల్స్ ఉన్నాయి అని ఆరోపించారు. ఇది నిజమో కాదో చెప్పాలని సవాల్ విసిరారు. రాష్ట్రంలోనే కాకుండా అమెరికా, సింగపూర్ ల్లో కూడా కేటీఆర్ కు పెట్టుబడులు ఉన్నాయని ఆరోపించారు.
అయితే హైదరాబాద్ లోని హోటల్స్ గురించి ఆరా తీయగా అవి అధికారికంగానే కేటీఆర్ కుటుంబ సభ్యులు డైరెక్టర్లు గా ఉన్న కంపెనీ పేరు మీదే ఉన్నాయి. హైటెక్ సిటీ పరిసర ప్రాంతాల్లో ఉన్న డెక్కన్ సెరాయి హైటెక్ సిటీ (డెక్కన్ సేరి), డెక్కన్ సెరాయి గ్రాండ్ హోటల్ గచ్చిబౌలి లో ఉంది. వీటితో పాటు ప్రీమియం సర్వీస్ అపార్ట్ మెంట్స్ కూడా ఇదే బ్రాండ్ తో ఉన్నాయి. ఇవి అన్నీ కూడా ఎట్ హోమ్ హాస్పిటాలిటీ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ పేరు మీద ఉన్నాయి. ఇందులో ప్రసుతం డైరెక్టర్లుగా కేటీఆర్ భార్య శైలిమా కల్వకుంట్ల తో పాటు శ్రీధర్ తేలుకుంట్ల, పట్టాభిరామారావు చిలుకూరి ఉన్నారు. ఎట్ హోమ్ హాస్పిటాలిటీ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ లో బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ 2005 అక్టోబర్ 25 నుంచి 2014 అక్టోబర్ వరకు డైరెక్టర్ గా కొనసాగారు. గతంలో సంతోష్ రావు జోగినపల్లి కూడా ఈ కంపెనీలో డైరెక్టర్ గా ఉండేవాళ్ళు.
సీఎం రేవంత్ రెడ్డి తాజాగా కేటీఆర్ కుటుంబ సభ్యులకు హైదరాబాద్ లో స్టార్ హోటల్స్ ఉన్నాయి అని చెప్పటం...ఇప్పుడు ఆ విషయం నిజమే అని నిర్దారణ కావటం ప్రాధాన్యత సంతరించుకుంది. హైదరాబాద్ లో తమకు ఉండటానికి సరైన ఇల్లు కూడా లేదు అని చెపుతున్న కేటీఆర్ కు ఈ స్టార్ హోటల్స్ ఎక్కడ నుంచి వచ్చాయి అని సీఎం రేవంత్ రెడ్డి సిరిసిల్ల సభలో విమర్శలు గుప్పించిన సంగతి తెలిసిందే. ఒక వైపు రేవంత్ రెడ్డి కెసిఆర్ ఫ్యామిలీ ఆస్తుల వివరాలను బహిర్గతం చేస్తుంటే...బిఆర్ఎస్ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోదరులు పెద్ద ఎత్తున భూములు దక్కించుకుంటున్నారు అని విమర్శలు గుప్పిస్తోంది. అధికారాన్ని అడ్డం పెట్టుకుని లక్ష కోట్ల రూపాయలు అక్రమంగా సంపాదించారు అని ఆరోపణలు చేయటం తప్ప...ఇప్పటి వరకు సీఎం రేవంత్ రెడ్డి ఒక్క విషయంలో కూడా యాక్షన్ తీసుకున్న దాఖలాలు లేవు. దీంతో ఇది అంతా పొలిటికల్ గేమ్ గానే వాడుకుంటున్నట్లు కనిపిస్తోంది. రాబోయే రోజుల్లో ఇలా కెసిఆర్ ఫ్యామిలీ కి చెందిన ఆస్తుల వివరాలు మరికొన్ని కూడా బయటకు వస్తాయని కాంగ్రెస్ నాయకులు చెపుతున్నారు.