తెలంగాణలో ప్రభుత్వం మారింది కానీ చాలా విషయాల్లో బిఆర్ఎస్ హయాంలో కొనసాగిన పద్ధతులే ఇప్పటికి కంటిన్యూ అవుతున్నాయి. విచిత్రం ఏమిటి అంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు బిఆర్ఎస్ విధానాలను తీవ్రంగా విమర్శించిన నేతలు అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని యధాతధంగా అమలు చేస్తుండటం. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా చాలా విషయాల్లో బిఆర్ఎస్ లైన్ లోనే వెళుతున్నారు. ఇందులో పెద్దగా మార్పేమీ లేదు. బిఆర్ఎస్ అధికారంలో ఉన్న కాలంలో ప్రభుత్వం నుంచి ఎక్కువ నిధులు అప్పటి సీఎం కెసిఆర్, మంత్రులు కేటీఆర్, హరీష్ రావు నియోజకవర్గాలకే వెళుతున్నాయని...ఇతర నియోజకవర్గాలను ఏ మాత్రం పట్టించుకోవటం లేదు అంటూ అప్పటిలో రేవంత్ రెడ్డి తో పాటు కాంగ్రెస్ నేతలు తీవ్ర విమర్శలు చేశారు. అప్పటి బిఆర్ఎస్ మంత్రుల పాటు ఇతర నియోజకవర్గాలతో పోలిస్తే ఈ ముగ్గురి నియోజవర్గాల్లోనే అభివృద్ధి పనులు...ఇతర అవసరాల కోసం ఎక్కువ నిధులు కేటాయించుకున్న మాట వాస్తవమే అనే విషయం అందరికి తెలిసిందే. ఇప్పుడు కాంగ్రెస్ హయాంలో కూడా అదే ట్రెండ్ కంటిన్యూ అవుతోంది. తాజాగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన నియోజకవర్గం కొడంగల్ లో ఇటీవల ఏకంగా 9000 కోట్ల రూపాయల పనులకు శ్రీకారం చుట్టారు.
సీఎం నియోజకవర్గం పై ప్రత్యేక దృష్టి పెట్టుకోవటాన్ని తప్పుపట్టరు. కానీ ఇతర నియోజకవర్గాల సంగతి ఏంటి?.. వాటిలో జరుగుతున్న అభివృద్ధి పనులు ఏంటి అన్న ప్రశ్న లు ఉదయించటం సహజమే. బిఆర్ఎస్ హయాంలో ఆ ముగ్గురి కే నిధులు ఎక్కువ వెళ్ళినా కూడా ప్రతిపక్షాలు విమర్శలు చేశాయి తప్ప ..సొంత పార్టీ లో ఎవరూ నోరు తెరిచే సాహసం చేసే వాళ్ళు కాదు. కాంగ్రెస్ పార్టీ లో అలాంటి కట్టుబాట్లు ఏమీ ఉండవు. అందుకే మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి అభివృద్ధి కేవలం ముఖ్యమంత్రి ..మంత్రుల నియోజకవర్గాల్లోనే జరగాలా...తమకు నిధులు ఇవ్వరా అని బహిరంగంగానే ప్రశ్నించారు. కాంగ్రెస్ కు చెందిన జడ్చెర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి కూడా పనులు చేసిన కాంట్రాక్టర్లకు బిల్లు లు ఇవ్వటం లేదు అని తీవ్ర విమర్శలు చేశారు.
బిఆర్ఎస్ హయాంలో సాగినట్లే ఇప్పుడు కూడా నిధులు అన్ని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క తో పాటు ఉత్తమ్ కుమార్ రెడ్డి వంటి మంత్రుల నియోజకవర్గాలకే వెళుతున్నాయి అని కాంగ్రెస్ ఎమ్మెల్యేలే విమర్శలు గుప్పిస్తున్నారు. ఇక్కడ విచిత్రం ఏమిటి అంటే తన నియోజవర్గంలో అభివృద్ధి పనులు జరుగుతుంటే కొంత మంది కళ్ళల్లో నిప్పులు పోసుకుంటున్నారు...కడుపులో విషం నింపుకుంటున్నారు అంటూ సీఎం రేవంత్ రెడ్డి పదే పదే చేస్తున్న వ్యాఖ్యలు చాలా చీప్ గా ఉన్నాయనే చర్చ కాంగ్రెస్ నేతల్లోనే సాగుతోంది. సీఎం గా ఉన్న వ్యక్తి కుళాయి పంచాయతీల దగ్గర మాట్లాడినట్లు మాట్లాడటం సరికాదు అని ఒక సీనియర్ నేత వ్యాఖ్యానించారు.