ఐఆర్ ఎఫ్ సి లోన్ గోవిందా!

Update: 2026-06-23 10:03 GMT

ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోడీ ని అలవోకగా కలవగలిగే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్ర మంత్రులను కలవటం కోసం తెలంగాణ కు చెందిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సాయం కోరటం ఏంటి?. ఆయన కేంద్ర రైల్వే...పట్టణాభివృద్ధి శాఖల మంత్రుల అపాయింట్ మెంట్ ఇప్పించటం..దగ్గర ఉండి మరీ రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్, పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ లతో సమావేశం ఏర్పాటు చేయించటం ఏంటో?. ఈ వ్యవహారం ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో పెద్ద హాట్ టాపిక్ గా మారింది. అంతే కాదు..స్వయంగా ప్రధాని మోడీని కలవగలిగే సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర మంత్రులను కలవటానికి మరో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కి లేఖ రాయటం...దానిపై ఆయన స్పందించి ఈ మీటింగ్ లు ఏర్పాటు చేయటం అంతా చూస్తుంటే ఇదేదో తేడా వ్యవహారంగానే ఉంది అనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. పోనీ ఇన్ని మీటింగ్ లు జరిగిన తర్వాత గతంలో అంగీకరించిన 13527 కోట్ల రూపాయల రుణాన్ని ఇండియన్ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్ (ఐఆర్ఎఫ్ సి) వెంటనే మంజూరు చేస్తుందా అంటే అటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన ట్వీట్ లో కానీ..ఇటు కిషన్ రెడ్డి చెప్పిన దాంట్లో కానీ ఈ విషయం ఎక్కడా లేదు. కానీ వాళ్ళు ఇద్దరూ చెప్పిన మాటలు చూస్తే వ్యవహారం మళ్ళీ మొదటికి వచ్చింది తప్ప...ఎంతో హంగామా చేసి ఈ మీటింగ్ లతో ఇద్దరూ సాధించింది ఏమి లేదు అనే సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.

                               ఢిల్లీ లో ఖట్టర్ తో మీటింగ్ ముగిసిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోషల్ మీడియా ఖాతాలో అధికారికంగా పెట్టిన పోస్ట్ ఇలా ఉంది. హైద‌రాబాద్ మెట్రో ఫేజ్‌-I స్వాధీనం.. ఫేజ్‌-II విస్త‌ర‌ణ‌పై ఉన్న ఆటంకాల‌ను తొల‌గించేందుకు రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణ‌వ్‌, కేంద్ర బొగ్గు, గ‌నుల శాఖ మంత్రి కిష‌న్ రెడ్డి, పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ తో సుదీర్ఘంగా చ‌ర్చించాను. ఈ సంద‌ర్బంగా హైద‌రాబాద్ మెట్రో ఫేజ్‌- I వాల్యూయేష‌న్‌... ఫేజ్‌-I స్వాధీనానికి అవ‌స‌ర‌మైన రుణ సేక‌ర‌ణ‌.. రుణ సంస్థ ఎంపిక... మెట్రో ఫేజ్‌-II విస్త‌ర‌ణ‌.. నిర్మాణ‌ వ్య‌యం... అందుకు అవ‌స‌ర‌మైన రుణ సేక‌ర‌ణ అంశాల‌ను అధ్య‌య‌నం చేసేందుకు క‌న్స‌ల్టెంట్ ను నియ‌మించాల‌ని నిర్ణయించాం. దీనికి క‌న్స‌ల్టెంట్‌గా ఎస్ బిఐ కాప్స్ ని ఎంపిక చేశాం. ఈ సంస్థ ఇచ్చే నివేదిక ఆధారంగా భ‌విష్య‌త్ కార్యాచ‌ర‌ణ చేప‌ట్ట‌ాలని నిర్ణయించాం అని పేర్కొన్నారు. మరి రెండు రోజులుగా ఎంతో హడావుడి చేసి ఢిల్లీ మీటింగ్ తో సీఎం రేవంత్ రెడ్డి సాధించింది ఏమి లేదు అనే విషయం స్పష్టం అయింది. గతంలోనే ఎల్ అండ్ టి నుంచి రాష్ట్ర ప్రభుత్వం మెట్రో స్వాధీనానిని అవసరమైన రుణాన్ని అందించటానికి ఐఆర్ఎఫ్ సి అంగీకరించింది అని...దీన్ని కిషన్ రెడ్డి అడ్డుకున్నారు అని సీఎం రేవంత్ రెడ్డి ఇటీవల ప్రెస్ మీట్ పెట్టి మరీ ఆరోపించారు.

                             ఇప్పుడు మళ్ళీ ఎస్ బిఐ కాప్స్ మొదటి నుంచి వ్యవహారాన్ని స్టార్ట్ చేయబోతున్నట్లు వీళ్ళ ప్రకటన చూస్తే అర్ధం అవుతోంది. ఈ సమావేశాలపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా ట్వీట్ చేశారు. కేంద్ర మంత్రులతో సమావేశం కోసం సీఎం రేవంత్ రెడ్డి తనకు రెండు లేఖలు రాశారు అని...దీనికి అనుగుణంగానే అశ్విని వైష్ణవ్, మనోహర్ లాల్ ఖట్టర్ లతో సమావేశం ఏర్పాటు చేయించినట్లు తెలిపారు. మెట్రో రైల్ విస్తరణ పై సానుకూల వాతావరణంలో చర్చలు జరిగాయి అని..తెలంగాణ నుంచి కేంద్ర క్యాబినెట్ మంత్రిగా ఉన్న తాను రాష్ట్ర అభివృద్ధి కోసం, ప్రజల సంక్షేమం కోసం ఎల్లవేళలా పనిచేస్తా అన్నారు. ఈ తంతు అంతా చూసిన తర్వాత కాంగ్రెస్, బీజేపీ కలిసి డ్రామా ఆడుతున్నాయనే అనుమానాలు ప్రజల్లో కలిగే అవకాశం లేకపోలేదు అనే భయం కాంగ్రెస్ నేతల్లో వ్యక్తం అవుతోంది.

Tags:    

Similar News