బీజేపీ కోసమే ఈ ప్లానా!

Update: 2026-05-11 04:07 GMT

రాజకీయంగా రేవంత్ రెడ్డి ఇప్పటికే ఒక టార్గెట్ పూర్తి చేసుకున్నారు. కాంగ్రెస్ లో సీనియర్ నేతలను వెనక్కి నెట్టి ముఖ్యమంత్రి పీఠంపై కూర్చుని దగ్గర దగ్గర రెండున్న సంవత్సరాలు కూడా పూర్తి చేసుకున్నారు. రేవంత్ రెడ్డి తెలంగాణ సీఎం అయిన దగ్గర నుంచి కూడా ముఖ్యంగా ప్రధాని మోడీ తో మంచి సంబంధాలు కొనసాగిస్తున్నారు. అలా అని రాష్ట్రానికి సీఎం రేవంత్ రెడ్డి కోరినవి అన్నీ ఇస్తున్నారా అంటే అలా కూడా ఏమి జరగటం లేదు. సీఎం రేవంత్ రెడ్డి ప్రధాని మోడీ తో కొనసాగిస్తున్న సాన్నిహిత్యం కారణంగా కాంగ్రెస్ అధిష్ఠానం అయితే కొన్ని నెలల పాటు ఆయన్ను దూరం పెట్టింది అనే ప్రచారం కూడా జరిగింది. రాష్ట్రం కోసం ప్రధాని మోడీ ని పెద్దన్నలా చూస్తాను అని రేవంత్ రెడ్డి పలు మార్లు బహిరంగంగానే ప్రకటించారు. అయినా కూడా రేవంత్ రెడ్డి ఎజెండా వేరే ఉంది అనే అభిప్రాయం రాజకీయ వర్గాల్లో ఎప్పటి నుంచో ఉన్న విషయం తెలిసిందే. ముఖ్యంగా మోడీ తో ...బీజేపీ నేతలతో సాన్నిహిత్యం విషయంలో రేవంత్ రెడ్డి సేఫ్ గేమ్ ఆడుతున్నారు అనే చర్చ కూడా ఉంది. ఇతర కాంగ్రెస్ సీఎంలకు భిన్నంగానే రేవంత్ రెడ్డి అటు బీజేపీ..మోడీ విషయంలో వెళుతున్నారు అనే చెప్పొచ్చు. కాంగ్రెస్ అధిష్ఠానం ఇప్పుడు గతంతో పోలిస్తే అత్యంత బలహీనంగా ఉండంతో రేవంత్ రెడ్డి విషయంలో చూసీ చూడనట్లు వదిలేస్తుంది కూడా.

                                  ఆదివారం నాడు హైదరాబాద్ లో పర్యటించిన ప్రధాని మోడీ బహిరంగంగా సీఎం రేవంత్ రెడ్డి నుద్దేశించి చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. మీరు నాతో కలిసి రండి...మీరు ఎక్కడికి వెళ్ళాలి అనుకుంటున్నారో అక్కడకి తీసుకెళతాను అంటూ సీఎం రేవంత్ రెడ్డి నుంచి ఉద్దేశించి ప్రధాని మోడీ చేసిన వ్యాఖ్యల వెనక ఎజెండా ఏంటి అనే చర్చ మొదలైంది. ఒక రకంగా ఇది సీఎం రేవంత్ రెడ్డి ని ప్రధాని మోడీ బుక్ చేసినట్లు కనిపిస్తుంది అనే అభిప్రాయం కూడా కొంత మంది నేతలు వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా రేవంత్ రెడ్డి విషయంలో కాంగ్రెస్ అధిష్ఠానం మరింత అనుమానపు చూపులు చూసేలా ఇవి చేస్తాయని కాంగ్రెస్ నేతలు అభిప్రాయపడుతున్నారు. అయితే రేవంత్ రెడ్డి మాత్రం ముందు నుంచి కూడా తన సొంత ఎజెండా తో పని చేస్తున్నారు అని...అందుకే అయన మోడీ వ్యాఖ్యల విషయంలో హ్యాపీ గానే ఉన్నారు అనే వాదన కూడా కాంగ్రెస్ నేతల్లో ఉంది. అయితే ఇప్పటి కే సీఎం పదవిని అధిష్టించిన సీఎం రేవంత్ రెడ్డి నెక్స్ట్ టార్గెట్ ఏంటి?. ఆ టార్గెట్ కు మోడీ ఎలా తీసుకెళ్తారు అన్న చర్చ కూడా రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతోంది. దేశ వ్యాప్తంగా కీలక రాష్ట్రాల్లో వరస విజయాలు సాధిస్తున్న బీజేపీని తెలంగాణాలో నాయకత్వ సమస్య వెంటాడుతోంది. రాష్ట్రంలో బీజేపీ తన సత్తా చాటేందుకు అవకాశం ఉన్నా కూడా ఇక్కడ ఎందుకో ఆ పార్టీ సరైన దిశలో వెళ్లటంలేదు అనే అభిప్రాయం బీజేపీ నేతల్లోనే ఉంది. ఈ తరుణంలో మోడీ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.

Tags:    

Similar News