కెసిఆర్ పై డైరెక్ట్ ఎటాక్ చేసిన కవిత

Update: 2026-04-25 06:30 GMT

తెలంగాణాలో టిఆర్ఎస్ మళ్ళీ పుట్టింది. మాజీ సీఎం కెసిఆర్ కుమార్తె కవిత శనివారం నాడు హైదరాబాద్ లో కొత్త పార్టీ ప్రకటించారు. ఆమె పెట్టబోయే పార్టీ పేరు ఇది అంటూ రకరకాల పేర్లు ప్రచారంలోకి వచ్చినా కూడా గత కొంత కాలం నుంచి ప్రచారం జరిగినట్లు టిఆర్ఎస్ పేరునే ఆమె తెరమీదకు తెచ్చారు. గతంలో కెసిఆర్ సారథ్యంలోని పార్టీ పేరు తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్ఎస్) ఉన్న విషయం తెలిసిందే. జాతీయ రాజకీయాల్లోకి ప్రవేశించాలనే లక్ష్యంతో టిఆర్ఎస్ పేరును తర్వాత భారత రాష్ట్ర సమితి (బిఆర్ఎస్) గా మార్చిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి కెసిఆర్ సారథ్యంలోని పార్టీకి కష్టాలు మొదలయ్యాయి. ఇప్పుడు కవిత తన కొత్త పార్టీ పేరును తెలంగాణ రాష్ట్ర సేన అంటూ నామకరణం చేశారు. ఈ పేరును పార్టీ ఆవిర్భావ సభలో కవిత ప్రకటించారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో భాగం అయినందునకు సంతోషంగా ఉన్నానని..అదే సమయంలో పదేళ్ల బిఆర్ఎస్ పాలనలో భాగం అయినందుకు కొన్ని విషయాల్లో సిగ్గుపడుతున్నానని...అందుకు క్షమాపణ చెపుతున్నట్లు కవిత ప్రకటించారు.

                                                         తెలంగాణ జాగృతి రాష్ట్రంలో కాంతిరేఖ గా పని చేసింది అని కవిత వెల్లడించారు. బిఆర్ఎస్ హయాంలో దారుణమైన నిఘానీడలో తెలంగాణ సమాజం బతికింది అని...బిఆర్ఎస్ లో ఆత్మ లేకుండా పోయింది అని ఆరోపించారు. తెలంగాణ కలలు అన్నీ ఇంకా నిజం కాలేదు...సామాజిక రధచక్రం గాడి తప్పింది అన్నారు. తెలంగాణ ప్రజలకు అమ్మగా మారాలనుకుంటున్నట్లు కవిత ప్రకటించారు. బిడ్డలా కష్టం తల్లికే తెలుస్తుంది అని అందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. అప్పటి కెసిఆర్ వేరు..ఇప్పుడు కెసిఆర్ వేరు. ఇప్పుడు కెసిఆర్ మారిన మనిషి...మర మనిషి అని అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. గుంటనక్కలు..తోడేళ్ళ చేతిలో చిక్కుకున్న మనిషి. ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు ఎప్పుడూ ఆయన బయటకు రాలేదు అన్నారు. రాష్ట్రంలో పీకి కట్టలు కట్టినం అని...గుజరాత్, బీహార్, పంజాబ్ పోయి జాతీయ పార్టీ అంటూ డ్రామాలు ఆడారు అన్నారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కర్కోటకుడు అంటూ కవిత తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ మాట అనటానికి బాధ ఉన్నా కూడా ఆయన అలాగే వ్యవహరిస్తున్నందున అనేక తప్పటం లేదు అన్నారు.

                                     పార్టీ ని ప్రకటించటంతో పాటు తమ పార్టీ ఎజెండా ను కూడా ఆమె ప్రకటించారు. టిఆర్ఎస్ అధికారంలోకి వస్తే ప్రజలకు ఉచిత విద్యతో పాటు ఉచిత వైద్యం అందిస్తామన్నారు. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత ఒకే సారి ఏకంగా నాలుగు లక్షల మందికి ఉద్యోగాలు వచ్చేలా నోటిఫికేషన్ ఇస్తామన్నారు. అత్యంత కీలకమైన సామాజిక న్యాయాన్ని పక్కాగా అమలు చేస్తామని తెలిపారు. అభివృద్ధిని...సామాజిక న్యాయం అనే అంశాలను రెండు కళ్లుగా తీసుకుని మీ ముందుకు వస్తామన్నారు. జీహెచ్ఎంసి ఎన్నికలతో పాటు జిల్లా పరిషత్ , మండల పరిషత్ ఎన్నికల్లో కూడా ప్రజల ముందుకు వస్తామన్నారు. తమ ప్రభుత్వంలో రైతే రాజుగా పాలన సాగుతుంది అని చెప్పారు.

Full View

Tags:    

Similar News