సొసైటీ ప్రెసిడెంట్ రవీంద్రనాధ్ తీరుపై సభ్యుల విమర్శలు
సహజంగా ఎన్నికలు అంటే ఎవరు పోటీ చేయాలనుకుంటే వారికి నామినేషన్ల పత్రాలు ఇవ్వాలి. కానీ అక్కడ మాత్రం విచిత్రం. నామినేషన్ల పత్రాలు అడిగిన వారికి కౌన్సిలింగ్ చేస్తున్నారు. ఈ సారి మాకు సహకరించండి వచ్చే ఎన్నికల్లో ఏకగ్రీవంగా ఎన్నికయ్యేలా చూస్తామని హామీలు ఇస్తున్నారు. అంతే కాదు..కొంత మందికి అయితే అసలు నామినేషన్ పత్రాలు కూడా ఇవ్వకుండా చుక్కలు చూపిస్తున్నారు. అంతే కాదు నామినేషన్ల దాఖలుకు కూడా రాష్ట్రపతి ఎన్నికకు కూడా ఉండనన్ని నిబంధనలు పెట్టి ప్రత్యర్ధులను పక్కకు తప్పించే ప్రణాళికలో ఉన్నారని సభ్యులు విమర్శిస్తున్నారు. కొంత మందికి నామినేషన్ల పత్రాలు ఇచ్చినా కూడా స్క్రూటినిలో వాటిని తిరస్కరిస్తామని కూడా ముందే బహిరంగంగా చెబుతున్నారంటే అక్కడ ఎంత బరితెగింపు ఉందో ఊహించుకోవచ్చు. ఈ వ్యవహారం ఇప్పుడు అదికారులకు ఫిర్యాదు చేసే వరకూ వెళ్ళింది. ఈ ఎన్నికలకు ఎన్టీవీ ఛైర్మన్, సొసైటీ మాజీ ప్రెసిడెంట్ తుమ్మల నరేంద్ర చౌదరి రిటర్నింగ్ అధికారిగా వ్యవహరిస్తున్నారు. ఈ ఏడాది మార్చిలో జరిగిన జూబ్లిహిల్స్ హౌసింగ్ సొసైటీ ఎన్నికల్లో ఘోరపరాజయం పాలైన వర్గమే ఇప్పుడు క్లబ్బులో పాగావేసేందుకు ప్రయత్నం చేస్తోంది. సొసైటీ ఎన్నికల్లో ఓటమితో విలవిలలాడుతున్న వారు కనీసం ఇక్కడ అయినా బెదిరించో..బతిమిలాడుకునో ఎన్నికలను మమ అన్పించే పనిలో ఉన్నారు. నామినేషన్ల కోసం వస్తున్న వ్యక్తులను అక్రమాలకు కేరాఫ్ అడ్రస్ గా మారిన వ్యక్తి పక్కకు తీసుకెళ్ళి బేరాలు పెడుతున్నాడని సభ్యులు ఆరోపిస్తున్నారు. గత రెండు రోజులుగా ఇదే వ్యవహారం సాగుతోంది అక్కడ. సొసైటీ ఎన్నికల్లో చట్టబద్దంగా ఎన్నికైన వారిని ఏ మాత్రం ముందుకు కదలకుండా అడ్డుకున్న వారే ఇదంతా చేస్తుంటంతో సభ్యుల్లో అసహనం పెరిగిపోతుంది.
అదే సమయంలో గత ఎన్నికల్లో మంచి మెజారిటీతో విజయం సాధించిన సొసైటీ ప్రెసిడెంట్ బి. రవీంద్రనాధ్ అండ్ టీమ్ క్లబ్బు ఎన్నికలను ప్రత్యర్ధులకు పూర్తిగా వదిలేయటంపై కూడా విస్మయం వ్యక్తం అవుతోంది. ఆరు నెలల క్రితం సొసైటీ ఎన్నికల్లో గెలిచిన వారు ప్యానల్ పెడితే ఇక్కడ కూడా ఈజీగా విజయం సాధించే అవకాశం ఉందని..అలాంటి సువర్ణావకాన్ని రవీంద్రనాధ్ అండ్ కో వదిలేయటంపై సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. బహిరంగంగానే ఈ అంశంపై వారు వ్యాఖ్యానిస్తున్నారు. క్లబ్బు ఎన్నికల్లో గెలిచే ఛాన్స్ ఉన్నా కూడా వదులుకోవటంపై కూడా వీరికి ఓటేసిన వారు..సహకరించిన వర్గాలు మండిపడుతున్నాయి. అసలు ప్యానల్ పోటీలో లేకుండా ఉండటం ఒకెత్తు అయితే...ఎవరైతే వేల కోట్ల రూపాయలు అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపణలు ఎదుర్కొంటున్నారో అలాంటి వారి ప్యానల్ లోని ప్రెసిడెంట్ వంటి కీలక పదవికి అనధికారికంగా మద్దతు తెలపటంపై సభ్యుల్లో చర్చ సాగుతుంది. రవీంద్రనాధ్ తీరును అందరూ తప్పుపడుతున్నారు. ప్రస్తుత పరిస్థితికి రవీంద్రనాధే కారణం అని చాలా మంది బహిరంగంగానే విమర్శలు గుప్పిస్తున్నారు.