అధికారం కోల్పోయినప్పటి నుంచి బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ వ్యవహరిస్తున్న తీరు ఆ పార్టీ నేతలతో పాటు బయట కూడా తీవ్ర చర్చనీయాంశగా మారింది. అయన మాట్లాడుతున్న మాటలు చూసిన తర్వాత కొంత మంది సొంత పార్టీ నాయకులు కూడా ఓటమి తర్వాత కూడా కేటీఆర్ లో ఎలాంటి మార్పు కనిపించటంలేదు అనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. రాబోయే రోజుల్లో కూడా ఇదే ధోరణి కనబర్చితే పార్టీకి మరింత నష్టం తప్ప...ఎలాంటి ఉపయోగం ఉండదు అని ఒక సీనియర్ నేత వ్యాఖ్యానించారు. తెలంగాణాలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటై ఇంకా రెండు నెలలు కూడా కాలేదు కానీ అప్పుడే కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అమలు చేయపోతే నడిరోడ్డులో కాంగ్రెస్ వాళ్ళ బట్టలు ఊడదీసి నిలబెడతాం అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తొమ్మిదిన్నర సంవత్సరాలు రాష్ట్రాన్ని పాలించిన బిఆర్ఎస్ ఎగవేసిన హామీలు ఎన్నో లెక్కేలేదు. అలాగని కాంగ్రెస్ హామీలు అమలు చేయక్కరలేదు అని ఎవరూ చెప్పరు. కానీ కేటీఆర్ మాటలు చూస్తుంటే అయన ఓటమిని ఏ మాత్రం జీర్ణించుకోలేక..అక్కసు వెళ్లగక్కుతున్నారు అనే భావన అయన మాటల్లో స్పష్టంగా కనిపిస్తోంది అనే చర్చ సాగుతోంది.
తాజాగా కేటీఆర్ త్వరలోనే కెసిఆర్ ను సీఎం చేసుకుందాం అని చేసిన వ్యాఖ్యలు కూడా దుమారం రేపుతున్నాయి. ఎన్నికలు జరిగి ఇంకా మూడు నెలలు కూడా కాకముందే మళ్ళీ కెసిఆర్ ను సీఎం ఎలా చేస్తారు అనే ప్రశ్న ఉదయించటం సహజం. కొంత మంది బిఆర్ఎస్ నాయకులు చెప్పినట్లు కాంగ్రెస్ ఎమ్మెల్యేలను చీల్చి కెసిఆర్ ను సీఎం చేస్తారా?. త్వరలోనే సీఎం చేయటం అంటే ఉన్న మార్గం ఇది ఒక్కటే