కాంగ్రెస్ అగ్రనేత, మాజీ ఎంపీ రాహుల్ గాంధీ ని నిజంగా కేంద్రంలోని మోడీ సర్కారు అంతగా టార్గెట్ చేసిందా?.అసలు ఈ విషయంలో మోడీ సర్కారు కు సంబంధం ఉందో లేదో తెలియదు కానీ ఇప్పుడు బయటకు వచ్చిన విషయం మాత్రం పెద్ద సంచలనంగా మారింది. అదేంటి అంటే కొద్ది రోజుల క్రితం రాహుల్ గాంధీ కొన్ని వీడియోలు చేశారు. అవేంటి అంటే ప్రధాని నరేంద్ర మోడీ, ప్రముఖ పారిశ్రామిక వేత్త గౌతమ్ అదానీల మధ్య సంబంధాల గురించి వివరిస్తూ వీడియోలు చేసి యూట్యూబ్ లో పెట్టారు. . ప్రధాని మోడీ విదేశీ పర్యటనలు, ఆ తర్వాత అదానీ గ్రూప్ కు కలిగిన ప్రయోజనాలు...వివరిస్తూ అందులో మాట్లాడారు. దీనికి ఆధారంగా మీడియాలో వచ్చిన వార్తలను కూడా ప్రస్తావించారు. కానీ యూట్యూబ్ అనలిటిక్స్ చూపించిన దానికంటే రాహుల్ వీడియోలకు వచ్చిన వ్యూస్ చాలా చాలా తక్కువగా ఉన్నాయి. దీనిపై ఓవర్సీస్ కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ హెడ్ సామ్ పిట్రోడా యూట్యూబ్ కు ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన యూట్యూబ్ సీఈఓ నీల్ మోహన్ దీనిపై విచారణ చేస్తాం అని తెలిపారు. అల్గోరిథం ప్రకారం రాహుల్ గాంధీ అదానీ-మోడీ పై చేసిన వీడియోలకు పెద్దగా వ్యూస్ రాకుండా తొక్కేశారు అనే ఆరోపణలు వెల్లువెత్తాయి.
ఇది ఇప్పుడు పెద్ద సంచలనంగా మారింది. ముఖ్యంగా అమెరికా కు చెందిన హిండెన్ బర్గ్ రీసెర్చ్ అదానీ గ్రూప్ పై ఒక నివేదిక బయటపెట్టిన తర్వాత అందరి ఫోకస్ అదానీ గ్రూపుపై పడిన విషయం తెలిసిందే. ఆ తర్వాత రాహుల్ గాంధీ కూడా ఈ అంశంలో ప్రధాని మోడీ పై విమర్శలు చేయటంలో స్పీడ్ పెంచారు. వీరిద్దరి మధ్య అనుబంధంపై దేశంలోని రాజకీయ పార్టీలు అన్నీ టార్గెట్ చేసిన సంగతి తెలిసిందే. అదే సమయంలో మోడీ పేరు ఉన్న వారు అంతా దొంగలే అన్న చందంగా రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలకు సూరత్ కోర్టు రాహుల్ కు రెండేళ్ల జైలు శిక్ష విధించటం..ఆ వెంటనే ఆగమేఘాల మీద రాహుల్ లోక్ సభ సభ్యత్వం కూడా రద్దు అయినా విషయం తెలిసిందే. ఇదే ఇప్పుడు దేశంలో ప్రతిపక్ష పార్టీలు అన్నింటిని ఏకం చేస్తోంది. ఈ అంశం రాబోయే రోజుల్లో కేంద్రంలోని బీజేపీ సర్కారు కు ఇబ్బందులు సృష్టించటం ఖాయం అన్న చర్చ సాగుతోంది.