ఎన్నికల ముందు మోడీ కీలక ప్రకటనలు

Update: 2023-10-01 10:36 GMT

అసెంబ్లీ ఎన్నికల ముందు ప్రధాని నరేంద్ర మోడీ తెలంగాణ కు కీలక ప్రాజెక్టులు ప్రకటించారు. రాజకీయంగా ఇవి ఎంతో కీలకమైన అంశాలుగానే చెప్పాలి. ఎందుకంటే గత ఎన్నికల సమయంలో పసుపు బోర్డు ఏర్పాటు విషయాన్ని బీజేపీ ప్రముఖంగా ప్రచారం చేసింది. నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ గెలుపులో కూడా ఈ పసుపు బోర్డు ఏర్పాటు హామీ ఎంతో కీలక భూమిక పోషించింది అని చెప్పాలి. కానీ అప్పటి నుంచి ఇప్పటివరకు ఈ హామీ అమలకు నోచుకోలేదు. అక్టోబర్ మూడున ప్రధాని నరేంద్ర మోడీ నిజామాబాద్ లో పర్యటించనున్న వేళ మహబూబ్‌నగర్ పర్యటనలో పసుపు బోర్డు పై కీలక ప్రకటన చేశారు. దీంతో విభజన చట్టంలో ఉన్న మరో కీలక హామీని కూడా ప్రకటించారు. అదేంటి అంటే ములుగులో సమ్మక్క సారక్క పేరుతో గిరిజన యూనివర్సిటీని 900 కోట్ల రూపాయలతో ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీని ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఎమినెన్స్‌గా గుర్తిస్తున్నట్లు ప్రకటించారు.

                               ఎన్నికల ముందు మోడీ మూడు కీలక అంశాలపై ప్రకటించటం ప్రాధాన్యత సంతరించుకుంది. నరేంద్ర మోడీ ఆదివారం నాడు 13500 కోట్ల రూపాయల వ్యయంతో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా మోడీ మాట్లాడుతూ ‘‘పార్లమెంట్‌లో మహిళా రిజర్వేషన్‌ బిల్లు పాస్‌ చేశాం. తెలంగాణలో పలు అభివృద్ధి పనులు ప్రారంభించడం ఆనందంగా ఉంది. తెలంగాణలో రోడ్డు, రైలు కనెక్టివిటీ పెంచాల్సిన అవసరముంది. నవరాత్రికి ముందే శక్తి పూజలు ప్రారంభించాం. తెలుగు రాష్ట్రాలతో పాటు మహారాష్ట్ర మధ్య రవాణా సదుపాయాలు మెరుగవుతాయి. కరోనా తర్వాత పసుపు గొప్పదనం ప్రపంచానికి తెలిసిందని.. పసుపు పంటపై పరిశోధనలు పెరిగాయని చెప్పారు. పసుపు బోర్డు ఏర్పాటుతో.. తెలంగాణలోని పసుపు రైతులకు ఎంతో ప్రయోజనం కలుగుతుందని మోదీ పేర్కొన్నారు.

Tags:    

Similar News