మునుగోడులో కెసీఆర్ హుజూరాబాద్ క‌సి తీర్చుకుంటారా!

Update: 2022-08-08 12:45 GMT

Full Viewఅధికార పార్టీ దూకుడు చూస్తుంటే అలాగే క‌న్పిస్తోంది. మునుగోడు అసెంబ్లీకి కోమ‌టిరెడ్డి రాజ‌గోపాల్ రెడ్డి అలా రాజీనామా చేయ‌టం..దాన్ని స్పీక‌ర్ పోచారం ఆమోదించ‌టం నిమిషాల వ్య‌వ‌ధిలోనే జ‌రిగిపోయింది. నోటిఫికేష‌న్ కూడా జారీ అయిపోయింది. ఈ ప‌రిణామాలు ఒకింత ఆశ్చ‌ర్యం క‌లిగించేవే. కావాల‌నుకుంటే త‌ప్ప‌..ఇంత ఆగమేఘాల మీద రాజీనామా ఆమోదం జ‌ర‌గ‌దు. ఇవ‌న్నీ చూస్తుంటే హుజూరాబాద్ ఓట‌మి క‌సిని మునుగోడులో తీర్చుకునేందుకు అధికార టీఆర్ఎస్ సిద్ధ‌ప‌డుతున్న‌ట్లు క‌న్పిస్తోంది. కొద్ది రోజుల నుంచే టీఆర్ఎస్ ఉప ఎన్నిక‌కు రంగం సిద్ధం చేసుకుంటోంది. హుజూరాబాద్ ఉప ఎన్నిక‌పై పెట్టిన ఫోక‌స్ లో సగంపెట్టినా కూడా ఇక్క‌డ విజ‌యం సాధించ‌వ‌చ్చ‌నే ధీమాతో అధికార టీఆర్ఎస్ ఉంది. అదే స‌మ‌యంలో హుజూరాబాద్ ఉప ఎన్నిక‌లో కాడి వ‌దిలేసిన కాంగ్రెస్ పార్టీ ఇక్క‌డ అలా వ్య‌వ‌హ‌రించే ఛాన్స్ ఏ మాత్రం లేదు. అంతే కాదు ఈ ఎన్నిక ఆ పార్టీకి జీవ‌న్మ‌ర‌ణ స‌మ‌స్య‌గా కూడా మార‌బోతుంది. గెలుపు సంగ‌తి ప‌క్క‌న పెట్టినా..ఒక‌ట్రెండు స్థానాలు ఎవ‌రు ద‌క్కించుకుంటారో వారి మ‌ధ్యే సార్వ‌త్రిక ఎన్నిక‌ల పోరు అన్న అభిప్రాయం వ‌చ్చే అవ‌కాశం ఉంది.

అందుకే కాంగ్రెస్ పార్టీ కూడా ఈ ఎన్నిక‌ను అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకోవాల్సిన ప‌రిస్థితి. హుజూరాబాద్ ఓట‌మి క‌సిని తీర్చుకోవ‌టానికి మునుగోడు ఉప ఎన్నిక‌ను ఓ అవకాశంగా మార్చుకోవాల‌ని యోచిస్తున్న‌ట్లు టీఆర్ఎస్ వ‌ర్గాలు చెబుతున్నాయి. ఉప ఎన్నిక అంటే త‌మ‌కేమీ భ‌యంలేద‌నే సంకేతాలు ఇచ్చేందుకే స‌ర్కారు ఆగ‌మేఘాల మీద రాజ‌గోపాల్ రెడ్డి రాజీనామాకు ఆమోదం తెలిపేలా చ‌ర్య‌లు తీసుకుంద‌ని భావిస్తున్నారు. ఈ ఎన్నిక‌లో గెలుపు ద్వారా బిజెపి దూకుడుకు బ్రేకులు వేయాలన్న‌ది టీఆర్ఎస్ ప్లాన్. అయితే రాజీనామా ఆమోదం అయితే జ‌రిగింది కానీ..ఉప ఎన్నిక‌లు వ‌స్తాయా...లేక తెలంగాణ లో ముంద‌స్తు ఎన్నిక‌లు వ‌స్తాయా అన్న‌ది వేచిచూడాల్సిందే. ఆగ‌స్టు నెలాఖ‌రు లేదా సెప్టెంబ‌ర్ లో అసెంబ్లీ ర‌ద్దు ఉంటుంద‌నే ప్ర‌చారం జ‌రుగుతోంది. దీనిపై స్ప‌ష్ట‌త అయితే లేదు. మొత్తం మీద తెలంగాణ రాజ‌కీయాలు రాబోయే రోజుల్లో మ‌రింత ఆస‌క్తిక‌రంగా మార‌నున్నాయి.

Tags:    

Similar News