నిరుద్యోగులను మోసం చేయటంలో టీఆర్ఎస్, బిజెపిలు తోడుదోంగలు అని సీఎల్పీ నేత మల్లు భట్టివిక్రమార్క విమర్శించారు. రెండు పార్టీ ఉపాధి కల్పన విషయంలో ఘోరంగా విఫలం అయ్యాయని ఆయన ఆరోపించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్ని ఉద్యోగాలు కల్పించాయో చర్చకు రావాలని భట్టి డిమాండ్ చేశారు. రెండు ప్రభుత్వాలు ఉపాధి అవకాశాలు పెంచకపోగా నిరుద్యోగ సమస్య తీవ్రతరం చేశారని అన్నారు. ప్రభుత్వ రంగ సంస్థలను ఎత్తేయడం, అమ్మేయడం వల్ల దళిత, బడుగు, బలహీన ఇతర వర్గాల ప్రజలు ఉద్యోగాలను కోల్పోవడమేకాక భవిష్యత్తులో ఉద్యోగవకాశాలు లేకుండా పోతాయని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఆందోళన వ్యక్తం చేశారు. భట్టి విక్రమార్క మంగళశారం శాసనసభ మీడియా పాయింట్ వద్ద మీడియాతో మాట్లాడుతూ.. రిజర్వేషన్స్ ద్వారా కూడా ఉద్యోగావకాశాలు లేకుండా చేస్తున్నారని ప్రధాని మోదీపై విమర్శలు గుప్పించారు.
రాష్ట్రం తెచ్చుకున్నదే ఉద్యోగాల కోసమని, కానీ కేసీఆర్ అధికారంలోకి వచ్చాక ఉద్యోగాలు ఇచ్చింది లేదని అన్నారు. పీఆర్‌సీ ఇచ్చిన నివేదిక ప్రకారమే రాష్ట్రంలో 1 లక్షా 91 వేల ఖాళీలు ఉన్నాయని అన్నారు. రెండు లక్షల ఉద్యోగాల నియామకాలు చేస్తానన్న కేసీఆర్ అదీ చేయకపోగా ఈ లక్షా 91 వేల ఖాళీలు అలాగే ఉన్నాయని చెప్పారు. వాస్తవాలు ఇలా ఉంటే కేటీఆర్ మాత్రం ఇష్టం వచ్చినట్లు నోటికి వచ్చిన లెక్కలు చెబుతున్నారని ఆరోపించారు. ఉద్యోగాల భర్తీ క్యాలెండర్‌ను ప్రకటించాలని డిమాండ్ చేశారు. నిరుద్యోగభృతి ఊసేలేదని 3016 రుపాయలు ఇస్తానన్నారని, దాని ప్రస్తావన లేదన్నారు. కనీసం రిజిస్ట్రేషన్ కూడా ప్రారంభించలేదని మండిపడ్డారు.