బిఆర్ఎస్ కు ఇది గడ్డుకాలమే!

Update: 2024-03-17 13:49 GMT

Full Viewకెసిఆర్ కు వరస దెబ్బలు. ఈ దెబ్బల నుంచి అంత ఈజీగా బయటపడటం సాధ్యం అవుతుందా?. అసలు బిఆర్ఎస్ కు పూర్వ వైభవం అన్నది జరిగే పనేనా?. ఇదే ఇప్పుడు ఆ పార్టీ నాయకుల మధ్య సాగుతున్న చర్చ. ఇదే కారణంతో..రక రకాల అనుమానాలతో ఇప్పటికే బిఆర్ఎస్ కు చెందిన కీలక నేతలు కొంత మంది ఎవరి దారి వాళ్ళు చూసుకుంటున్నారు. అసెంబ్లీ ఎన్నికల దెబ్బ నుంచి కోలుకుని లోక్ సభ ఎన్నికల సమయంలో పరువు నిలుపుకునేందుకు కెసిఆర్ తన వంతు ప్రయత్నాలు చేస్తున్న తరుణం లో చోటు చేసుకుంటున్న పరిణామాలు బిఆర్ఎస్ ను..ఆ పార్టీ అధినేత, తెలంగాణ మాజీ సీఎం కెసిఆర్ ను ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. ఆదివారం నాడు చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ లు కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. లోక్ సభ ఎన్నికల ముందు ఢిల్లీ లిక్కర్ స్కాం లో కెసిఆర్ కుమార్తె, ఎమ్మెల్సీ కవిత ను ఈడీ అరెస్ట్ చేయటం ఆ పార్టీని షాక్ కు గురిచేసింది అనే చెప్పాలి. ఇప్పటికే బిఆర్ఎస్ కు చెందిన సిట్టింగ్ ఎంపీలు, మాజీ ఎంపీలు కూడా అటు బీజేపీ...ఇటు కాంగ్రెస్ పార్టీల్లో చేరుతున్నారు. రాబోయే రోజుల్లో ఇది మరింత పెరిగే అవకాశం ఉంది అనే చర్చ సాగుతుంది. అధికార కాంగ్రెస్ పార్టీ కూడా రాబోయే రోజుల్లో ఎదురు అయ్యే రాజకీయ సవాళ్లకు సిద్ధంగా ఉండేందుకు వీలుగా ఎంత మందిని వీలు అయితే అంత మంది బిఆర్ఎస్ ఎమ్మెల్యేలను తమ వైపు తిప్పుకునే పనిలో ఉంది.దీనికి సంబంధించిన కసరత్తు వేగంగా జరుగుతున్నట్లు తాజా పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి.

                                        ఇవి ఇలా ఉంటే మరో వైపు టెలిఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఎప్పుడు ఎవరి మెడకు చుట్టుకుంటుందో అన్న భయం బిఆర్ఎస్ కీలక నేతల్లో ఉంది. దీంతో పాటు రేవంత్ రెడ్డి సర్కారు ఒక వైపు కాళేశ్వరం స్కాం తో పాటు విద్యుత్ ప్రాజెక్ట్ ల స్కాం లపై కూడా విచారణకు ఆదేశించిన విషయం తెలిసిందే. అదే సమయంలో ధరణికి సంబంధించి సాగిన అక్రమ దందాలు వరసగా బయటకు వస్తున్నాయి. ఇలా చెప్పుకుంటూ పోతే ఈ జాబితా ఎక్కడ ఆగుతుందో ఎవరికీ తెలియదు. ఎందుకంటే ఎప్పటికప్పుడు కొత్త కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. మరి ఇన్ని సవాళ్ళను అధిగమించటం...వీటి నుంచి అంత ఈజీగా బయటపడటం సాధ్యం అవుతుందా అన్న అనుమానాలు బిఆర్ఎస్ నేతలే వ్యక్తం చేస్తున్నారు. మాట్లాడితే తమది ఉద్యమ పార్టీ అని..ఇలాంటివి ఎన్నో చూశాం అని పైకి చెపుతున్నా పార్టీ నాయకుల్లో మాత్రం టెన్షన్ రోజు రోజుకూ పెరుగుతుందే తప్ప ఏ మాత్రం తగ్గటం లేదు అని ఒక సీనియర్ నేత వెల్లడించారు. ఒక వైపు కాంగ్రెస్, మరో వైపు బీజేపీ లు ఎంత వీలు అయితే అంత మేర బిఆర్ఎస్ ను దెబ్బకొట్టడానికి సిద్ధంగా ఉన్నట్లు కనిపిస్తోంది. మే 13 న జరగనున్న లోక్ సభ ఎన్నికల్లో బిఆర్ఎస్ గౌరవప్రదమైన సీట్లు దక్కించుకోకపోతే ఆ పార్టీ మరింత చిక్కుల్లో పడటం ఖాయంగా కనిపిస్తోంది. మరి ఈ సవాళ్ళను కెసిఆర్ ఎలా ఎదుర్కొంటారో చూడాలి. వీటిని మరి కెసిఆర్ ఎలా ఎదుర్కొంటారో చూడాలి. 

Tags:    

Similar News