టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి వరస పెట్టి ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా కోమటిరెడ్డి సోదరుల విషయంలో చోటుచేసుకుంటున్న పరిణామాలతో ఆయనకు సమస్యలు వచ్చిపడుతున్నాయి. మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ కు రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించిన తర్వాత రేవంత్ మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ లేకపోతే మీ బ్రాండ్ బ్రాందీ షాపుల్లో మందు అమ్ముకోవటానికి కూడా పనికిరాదంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. దీనిపై ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ మీరు మీరు అంటూ తనను ఎందుకు కలపాల్సి వచ్చిందని, దీనిపై క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. అయితే దీనిపై వివరణ ఇచ్చిన రేవంత్ రెడ్డి తాను కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని ఉద్దేశించి మాత్రమే మాట్లాడానని..కోమటిరెడ్డి వెంకటరెడ్డి తమ సహచరుడు అని..తాను ఆయన్ను ఏమీ అనలేదన్నారు. తాజాగా ఓ బహిరంగ సభలో కాంగ్రెస్ నేత అద్దంకి దయాకర్ అనుచిత వ్యాఖ్యలు చేశారు. దీనిపై తర్వాత ఆయన క్షమాపణలు కూడా చెప్పారు. అయినా ఈ వివాదం సద్దుమణగకపోవటంతో రేవంత్ రెడ్డి నేరుగా రంగంలోకి దిగి క్షమాపణలు చెప్పారు.
ఈ మేరకు ఓ వీడియో విడుదల చేశారు. 'ఈ మధ్య పత్రికా సమావేశంలో హోం గార్డు ప్రస్తావన. మునుగోడు బహిరంగ సభలో అద్దంకి దయాకర్ పార్లమెంట్ సభ్యుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిపై పరుషమైన పదజాలం వాడటంతో వారెంతో మన స్థాపానికి గురయ్యారు. వారు పీసీసీ ప్రెసిడెంట్ గా నన్ను సారీ చెప్పాలని డిమాండ్ చేశారు. కోమటిరెడ్డి వెంటకరెడ్డికి భేషరతుగా క్షమాపణ చెబుతున్నా. ఇట్లాంటి చర్యలు..ఇట్లాంటి భాష ఎవరికీ మంచిది కాదు. తెలంగాణ ఉద్యమంలో, రాష్ట్ర సాధనలో క్రియాశీలక పాత్ర పోషించిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి ని ఇలా అవమానించేలా ఎవరు మాట్లాడినా తగదు. తదుపరి చర్యల కోసం క్రమశిక్షణా సంఘం ఛైర్మన్ చిన్నారెడ్డికి సూచన చేయటం జరుగుతుంది.' అని ప్రకటించారు.