ఇది వెయ్యి కోట్ల స్కామ్ విచారణ జరిపించండి..సీబీఐ డైరక్టర్ కు రేవంత్ రెడ్డి లేఖ
పిర్యాదులో సీఎస్, ఐటి, మున్సిపల్ శాఖ ఉన్నతాధికారుల పేర్లు
మైహోమ్, రాజపుష్ప కు సర్కారు అనుకూలంగా వ్యవహరించిందని ఆరోపణ
కోకాపేట భూముల విక్రయం వ్యవహరం సీబీఐ దగ్గరకు చేరింది. ఈ భూముల విక్రయం ద్వారా వెయ్యి కోట్ల రూపాయల స్కామ్ జరిగిందని..దీనిపై సమగ్ర విచారణకు ఆదేశించాలంటూ టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి గురువారం నాడు ఢిల్లీలో సీబీఐ డైరక్టర్ కు ఫిర్యాదు చేశారు. ఈ వేలానికి సంబంధించిన వ్యవహరంలో జరిగిన అక్రమాలను వివరిస్తూ ఐదు పేజీల ఫిర్యాదును అందించారు. ప్రభుత్వ ఈ ప్రొక్యూర్ మెంట్ టెండర్ వెబ్ సైట్ ద్వారా టెండర్లు పిలిచే అవకాశం ఉన్నా ఎంఎస్ టీసీని రంగంలోకి దించి ముఖ్యమంత్రి కెసీఆర్ తన అస్మదీయులకు మేలు చేసేలా అధికారులను ఉపయోగించుకుని ప్రభుత్వ ఖజానాకు వెయ్యి కోట్ల రూపాయల మేర నష్టం చేకూర్చారని తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ వేలం ద్వారా కమిషన్ రూపంలో ఎంఎస్ టీసీకి 50 కోట్ల రూపాయల మేర చెల్లింపులు చేశారని..అదే ఈ ప్రొక్యూర్ మెంట్ ద్వారా అయితే ఈ మేరకు ఆదా అయ్యేవన్నారు.
నిబంధనల ప్రకారం ఈ కెవైసీని ఫాలో అవ్వాల్సి ఉండగా..ఎంఎస్ టీసీ ఎంపిక చేసిన సంస్థలకు మేలు చేసేందుకే మాన్యువల్ పద్దతిలో కూడా అనుమతించారన్నారు. అసలు వేలంలో ఎవరెవరు పాల్గొన్నారు..బిడ్డింగ్ లో విజేత తర్వాత నిలిచింది ఎవరు అనే అంశాలను బహిరంగ పర్చకుండా అంతా గోప్యత పాటించారని..ఈ వేలంలో అసలు పారదర్శకత లేదని పేర్కొన్నారు. 2021 జూన్ 10న జీవో ఎంఎస్ 13 జారీ చేసి కోకాపేట భూముల వేలానికి ఎంఎస్ టిఎస్ ను అనుమతించటం వెనక దురుద్దేశాలు ఉన్నాయని తెలిపారు. ఎంపిక చేసిన రియల్ ఎస్టేట్ కంపెనీల కోసం ఈ వేలం నిబంధనల్లో సర్దుబాట్లు చేశారన్నారు. వీరంతా ముఖ్యమంత్రి కెసీఆర్ కు సన్నిహితులు అయిన కంపెనీల వారు అని తెలిపారు.
దీనికి సహరించిన వారిలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్, ఐటి శాఖ ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్,, హెచ్ఎండీఏ కమిషనర్ అరవింద్ కుమార్ లు ఉన్నారని ఫిర్యాదులో ప్రస్తావించారు. ఈ అధికారులు అందరూ ఐదేళ్ళుగా కీలక శాఖల్లోనే కొనసాగుతున్నారని తెలిపారు. జూపల్లి రామేశ్వరరావుకు చెందిన మైహోమ్ గ్రూప్, సిద్ధిపేట కలెక్టర్ గా ఉన్నవెంకట్రామిరెడ్డికి కుటుంబానికి చెందిన రాజపుష్ప సంస్థలకు అనుచిత లబ్ది కలిగేలా చేశారన్నారు. ఎంఎస్ టిసితో కుమ్మక్కు అయి కొన్ని సంస్థలకు ప్రయోజనం చేకూరేలా వ్యవహరించటం వల్ల ప్రభుత్వానికి 1000 కోట్ల రూపాయల మేర నష్టం వచ్చిందని తెలిపారు. ఎంఎస్ టీసీ పనితీరుపై పలు విచారణలు సాగుతున్నాయని.కాగ్ తోపాటు సీబీఐ కూడా ఎంఎస్ టిసికి చెందిన కొంత మంది అధికారులపై కేసులు కూడా నమోదు చేసిందని తెలిపారు. ఈ అంశాలన్నింటిని పరిగణనలోకి తీసుకుని దీనిపై సమగ్ర విచారణ చేయటంతోపాటు దీనికి కారణమైన అధికారులను ప్రాసిక్యూట్ చేయాలని కోరారు.