ఏపీలోని వైసీపీ సర్కారుపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. వైసీపీ మరోసారి అధికారంలోకి వస్తే రాష్ట్రాన్ని రక్షించడం ఎవరి తరం కాదని, ఆ పార్టీ పాలన ఎమర్జెన్సీ కంటే దారుణంగా ఉందన్నారు. అక్కచెల్లెమ్మల పసుపుకుంకుమలు తుడిచేస్తున్న అన్న అంటూ ఆరోపించారు. సంపూర్ణ మద్య నిషేధం అని చెప్పి మద్యం ఆదాయాన్ని పెంచుకుంటున్నారని విమర్శలు గుప్పించారు. ' రాష్ట్రంలో దర్జాగా మద్యం మాఫియా నడుస్తోంది. కల్తీ మద్యం దెబ్బకు ఐదువేల మరణాలు నమోదు అయ్యాయి. గడపగడపలో సంపూర్ణ మద్య నిషేధం ఏమైందని ఆడపడుచులు నిలదీయాలి. విద్యా వ్యవస్థను అస్తవ్యస్తం చేసిన ప్రభుత్వం ఇది. ప్రపంచ బ్యాంకు అప్పుల కోసమే ..అందులోభాగమే స్కూల్స్ మూత ఉపాధ్యాయుల తొలగింపు. క్షత్రియ సామాజిక వర్గాన్ని ప్రభుత్వం అవమానించింది.' అంటూ పవన్ కళ్యాణ్ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ఆదివారం నాడు భీమవరంలో జనవాణి - జనసేన భరోసా కార్యక్రమం అనంతరం మీడియాతో పవన్ కళ్యాణ్ మీడియాతో మాట్లాడారు. గత మూడేళ్లలో రూ. 25 వేల కోట్ల ఆదాయాన్ని మద్యం మీద అర్జించారు. మరో రెండేళ్లలో రూ.30 వేల కోట్ల ఆదాయం రాబట్టడమే లక్ష్యంగా ప్రభుత్వం పని చేస్తోంది. రూ.100లు ఉన్న క్వార్టర్ మద్యం ధరలు రెండింతలపైగా పెంచేశారు. డిజిటల్ చెల్లింపులు చేయాలని కేంద్రం ప్రోత్సహిస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం మాత్రం విచిత్రంగా మద్యం మీద డిజిటల్ చెల్లింపులకు నో చెబుతోంది. అంటే మద్యం మీద వచ్చే ఆదాయం ఎవరి జేబులోకి వెళ్తుంది.. ఎటు వెళ్తుంది అన్న లెక్క ఉండకూడదు అనే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం డిజిటల్ చెల్లింపులు వద్దని చెబుతోంది. దీని వెనుక భారీ కుంభకోణం ఉందని ఆరోపించారు. రాష్ట్రంలో 70 రకాల నకిలీ మద్యం బ్రాండ్లు ఉన్నట్లు అంచనా. ఆదాన్ డిస్టిలరీస్ పేరుతో కల్తీ మద్యం అమ్ముతున్న ప్రభుత్వం ఆ కంపెనీ ఎవరిదో బయట పెట్టాలి. మాకు వచ్చిన సమాచారం మేరకు వైసీపీ నేతల బినామీలు కొందరి పేర్లు బయటికి వస్తున్నాయి. రాష్ట్రంలో ప్రతి లీటరు మద్యం అమ్మకాలపై రూ. 5 కప్పం హైదరాబాదులో కట్టాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ కప్పం డబ్బులు ఎవరి జేబులోకి వెళ్తున్నాయి? కప్పం తీసుకొని కల్తీ మద్యం తయారు చేస్తున్న కంపెనీలను నియంత్రించే బాధ్యత ప్రభుత్వాన్నిది కాదా? అని ప్రశ్నించారు.
అన్నీ తెలిసే నియంత్రించడం లేదంటే తప్పు ఎక్కడ జరుగుతుంది? అసలు ఇంతగా పేదల జీవితాల పై ఆటలాడుతున్న వ్యక్తిని ఆడపడుచులు ఎలా నమ్మారు? అన్నగా ఎందుకు భావించారు? అడ్డగోలుగా మద్యం అమ్ముతూ మన బతుకులను ప్రభుత్వమే చిధ్రం చేస్తోంది. ఈసారి ప్రతి ఇంటి నుంచి అమ్మ, అక్క, చెల్లెలు నడుం బిగించాల్సిన సమయం వచ్చింది. ఒక్కసారి ఆలోచించండి. అన్న పాలన ఎంత దారుణంగా ఉందో మీకే అర్థం అవుతుంది. వచ్చే ఎన్నికలు ఎప్పుడు వచ్చినా బలంగా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నాం. జనసేన పుట్టినప్పటి నుంచి జన క్షేత్రంలోనే తిరుగుతున్నాం. గత ఎన్నికల్లో అన్నను నమ్మారు... అదో భ్రమ అని తేలింది. రోడ్లమీద తిరిగిన వ్యక్తి ఎంతో మంచి చేస్తాడని అనుకున్నారు. రాగానే 30 లక్షల మంది భవన నిర్మాణ కార్మికుల జీవితాలను రోడ్డున పడేశాడు. సహజ సంపదలను దోచుకునే మార్గాలను ఎంచుకున్నాడు. ఒక్కసారి రాష్ట్రంలోని ప్రజలంతా ఆలోచించాలి. అన్న వస్తే అద్భుతాలు జరుగుతాయని భావించిన వారు సైతం కళ్ళు తెరవాల్సిన సమయం వచ్చింది. కచ్చితంగా మేము ప్రజా పోరాటాలు చేస్తాం. ప్రజలకు అద్భుత పరిపాలన అందించగల పటిష్టమైన ప్రణాళిక జనసేన వద్ద ఉంది అని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.