ఎత్తులు..పై ఎత్తులు. బిజెపి ఎప్పటి నుంచో మహారాష్ట్రలోని సంకీర్ణ సర్కారును అస్ధిర పర్చేందుకు సర్వశక్తులు ఒడ్డుతోంది. చూస్తుంటే ఆ ప్రయత్నాలు విజయానికి చేరువ అయినట్లే కన్పిస్తున్నాయి. మరి ఈ సమస్య నుంచి ఉద్థవ్ ఠాక్రే సారధ్యంలోని సంకీర్ణ సర్కారు ఎలా బయటపడుతుంది అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. గుట్టుచప్పుడు కాకుండా బిజెపి వేసిన ప్లాన్ కు శివసేనకు భారీ షాక్ తగిలేలా కన్పిస్తోంది. రాజ్యసభ ఎన్నికలతోపాట తాజాగా జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ దెబ్బలు తగిలాయి. దీంతో అప్రమత్తం అయ్యేందుకు రెడీ అయిన శివసేనకు ఊహించని షాక్ తగిలినట్లు అయింది. ఇదే అదనుగా బిజెపి అసంతృప్తి నేతలను ఆకట్టుకునే పనిలో పడింది. ఇది ఇప్పుడు కీలక దశకు చేరినట్లు కన్పిస్తోంది. మారిన పరిస్థితుల్లో సంకీర్ణ సర్కారు నిలబడాలంటే చాలా కసరత్తే జరగాల్సి ఉంటుందని చెబుతున్నారు. మరి మహారాష్ట్ర రాజకీయాలు ఎన్ని మలుపులు తిరుగుతాయో వేచిచూడాల్సిందే. అధికార కూటమిలోని శివ సేన ఎమ్మెల్యే, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఏక్‌నాథ్ షిండే వేరు కుంపటితో.. సంకీర్ణ ప్రభుత్వం సంక్షోభంలో పడినట్లు అయింది . గుజరాత్ సూరత్‌లోని ఓ హోటల్‌లో ఆయన మరికొందరు ఎమ్మెల్యేలతో క్యాంప్ ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. ఆయనతో పాటు సుమారు 11 మంది ఎమ్మెల్యేలు అక్కడ ఉన్నట్లు సమాచారం. థానేకు చెందిన ప్రముఖ నేతగా ఉన్న ఏక్‌నాథ్ షిండే.. ఆ ప్రాంతంలో శివ సేన బలోపేతానికి గట్టిగా ప్రయత్నం చేశారు. కీలక నేతగా ఉన్న తన శాఖల్లో(అర్బన్ డెవలప్‌మెంట్‌తో పాటు పబ్లిక్ వర్క్స్) సీఎం ఉద్దవ్ థాక్రే, ఆయన తనయుడు టూరిజం మంత్రి అయిన ఆదిత్యా థాక్రేల జోక్యం ఎక్కువగా ఉండడంతో ఆయన రలిగిపోతున్నారని చెబుతున్నారు. మరోవైపు డిప్యూటీ సీఎం అజిత్ పవార్ నుంచి నిధుల కేటాయింపుల విషయంలోనూ షిండేతో పాటు మరికొందరు ఎమ్మెల్యేలు అసంతృప్తితో ఉన్నారు. ఈ నేపథ్యంలోనే వీళ్లంతా సూరత్ హోటల్‌కు చేరుకోవడం ఆసక్తికరంగా మారింది. తాజా పరిస్థితులపై
ముఖ్యమంత్రి ఉద్దవ్ థాక్రే అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. మంత్రులతో పాటు శివ సేన ఎమ్మెల్యేలంతా మంగళవారం మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో తనతో భేటీ కావాలని ఆయన పిలుపు ఇచ్చారు.క్రాస్ ఓటింగ్ కోసం జరుగుతున్న భేటీ అని చెప్తున్నప్పటికీ.. షిండే ఎఫెక్ట్ వల్లే ఈ భేటీ అనేది జోరుగా చర్చ సాగుతోంది. ఇక గుజరాత్ సూరత్ హోటల్‌లో ఉన్న ఏక్‌నాథ్ షిండే సైతం అదే సమయానికి మీడియా సమావేశం నిర్వహించొచ్చని చెబుతున్నారు. సోమవారం నాడు జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల్లో.. మహా వికాస్ అఘాడి కూటమి కి పెద్ద దెబ్బ తగిలింది. బీజేపీ ఏకంగా ఐదు సీట్లు గెల్చుకోగా.. కాంగ్రెస్ 1, ఎన్పీపీ, శివసేలు చెరో రెండు గెల్చాయి. అధికార కూటమి నుంచే 20 మంది ఎమ్మెల్యేలు క్రాస్ ఓటింగ్‌కు పాల్పడి బీజేపీ అభ్యర్థి విజయంలో కీలక పాత్ర పోషించారు. కాంగ్రెస్ దళిత అభ్యర్థి చంద్రకాంత్ హందోరే ఓటమికి సొంత పార్టీ ఎమ్మెల్యేల క్రాసింగ్ ఓటమే కారణమంటూ కార్యకర్తలూ నిరసనలకు దిగారు. శివ సేన లో శరవేగంగా సాగుతున్న పరిణామాలను ఎన్సీపీ, కాంగ్రెస్‌లు పరిశీలిస్తున్నాయి. మహారాష్ట్రంలో శివ సేన, కాంగ్రెస్, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ సంయుక్తంగా మహా వికాస్ అగాడి(ఎంవీఏ) కూటమిగా.. ప్రభుత్వాన్ని నడిపిస్తున్న సంగతి తెలిసిందే.అయితే ఈ పరిణామాలపై శివసేన కీలక నేత, ఎంపీ సంజయ్ రౌత్ స్పందిస్తూ బిజెపి కుట్ర ఫలించదు. ఎక్ నాథ్ షిండే తో చర్చలు జరుగుతున్నాయని తెలిపారు.