తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ల పై ఏపీ మంత్రి కొడాలి నాని మండిపడ్డారు. వైసీపీ నేతలు ఎవరూ ప్రాణత్యాగం చేయాల్సిన అవసరం లేదు అని, ఆ పార్టీ ఎంపీలు పార్లమెంట్ లో ప్లకార్డులు పట్టుకుంటే చాలు అంటూ పవన్ కళ్యాణ్ తాజాగా ట్వీట్ చేశారు. దీనిపై స్పందించిన మంత్రి కొడాలి నాని ప్లకార్డులు పట్టుకునంటే ప్రైవేటీకరణ ఆపేస్తారా? అని ప్రశ్నించారు. అలా చేస్తారంటే ప్లకార్డులే కాదు..చొక్కాలపైనే ముద్రించుకుంటామన్నారు. వైసీపీకి సలహాదారు పీకె అంటే ప్రశాంత్ కిషోర్ కానీ..పవన్ కళ్యాణ్ కాదన్నారు. పవన్ కళ్యాణ్ తాను ఏమి చేయాలో ముందు అది చూసుకోవాలని ఎద్దేవా చేశారు. భువనేశ్వరిని ఏమీ అనకున్నా అన్నామని చంద్రబాబు ప్రచారం చేశారని చెప్పారు. విశాఖ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపాల్సింది కేంద్రమేనన్నారు. తాము ఏంచేయాలో తమకు తెలుసన్నారు. విశాఖ ప్లాంట్‌పై కేంద్రాన్ని నిలదీసే దమ్ము పవన్‌కు లేదని విమర్శించారు.
''చంద్రబాబు సతీమణి భువనేశ్వరి చెప్పినట్లు తప్పుడు వ్యాఖ్యలు చేసిన వాళ్ళు వాళ్ళ పాపాన వాళ్ళు పోతారు. వ్యాఖ్యలు చేయకపోయినా చేసినట్లు చెప్పిన వాళ్ళు కూడా వాళ్ళ పాపాన వాళ్ళు పోతారు. ఆడవాళ్ళని రోడ్డు మీదకు తెచ్చిన వారికి కూడా ఈ శాపం వర్తిస్తుంది. ఎవరన్నా భార్యని అడ్డం పెట్టుకుని రాజకీయాలు చేస్తారా... ఆమె శాపం చంద్రబాబుకి తప్పనిసరిగా తగులుతుంది. చంద్రబాబుకి రాబోయే ఎన్నికల్లో కనీసం ప్రతిపక్ష హోదా కూడా రాకుండా పోతుంది'' అన్నారు మంత్రి కొడాలి నాని. వైసీపీ కేంద్ర కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కొడాలి నాని మాట్లాడారు. ''పంట వేసుకోవడం రైతు ఇష్టం.. మనం కేవలం సలహాలు ఇవ్వడమే. ఎంత వరి ధాన్యం వచ్చినా ప్రతి గింజా కొనుగోలు చేస్తాం. ధాన్యం కొనుగొల్లలో రైతులకు ఇబ్బంది లేకుండా ఆర్బీకెల ద్వారా చేయాలని సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశించారు. తడిసిన ధాన్యంతో సహా ప్రతి గింజను కొనుగోలు చేయాలని సీఎం చెప్పారు. కేవలం 21 రోజుల్లో వారికి పేమెంట్ ఇవ్వాలన్నారు. పక్కనున్న రాష్ట్రాల్లో బహిరంగంగా కొనుగోలు చేయలేమని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చెప్తున్నాయి కానీ మనకు ఇబ్బందులు ఉన్నా కొనుగోలు చేస్తున్నాం'' అన్నారు.
''పార్లమెంట్ చట్టం వల్ల దొంగ ఓట్ల బెడద తగ్గుతుంది. చంద్రబాబు కుప్పంలో 10 వేలకు పైగా దొంగఓట్లు చేర్చారు. ఇలాంటి వారికి ఇలాంటి నిర్ణయం వల్ల చెక్ పడుతుంది. చంద్రబాబు ముఖం చూసి అప్పులిస్తామని అన్నారట.. జగన్‌ను చూసి ఇవ్వడం లేదు అన్నారు. ఇప్పుడు మళ్లీ అదే నోటితో జగన్ విపరీతంగా అప్పులు చేశారు అంటారు. అన్ని పరిశీలించే బ్యాంకులు అప్పులు ఇస్తాయి. ఇక్కడ పెట్టె పెట్టుబడులు, తీర్చే పరిస్థితి చూసే బ్యాంకులు అప్పులు ఇస్తాయి'' అని మంత్రి నాని తెలిపారు. పవన్ కళ్యాణ్ తన దత్తత తండ్రి చంద్రబాబుకి ఇవ్వండి మీ సలహాలు. ముద్రగడ దీక్ష చేస్తే ఎంత దుర్మార్గంగా వ్యవహరించాడో అందరూ చూశారు. అదీ అరాచక పాలన. ఇప్పుడు చంద్రబాబుకి ప్రజాస్వామ్యం గుర్తుకు వచ్చిందా'' అని మంత్రి కొడాలి నాని విమర్శలు గుప్పించారు.