జిన్ పింగ్ త‌ర‌హాలోనే మోడీ..కెసీఆర్

Update: 2022-02-04 13:15 GMT

టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. దేశానికి కొత్త రాజ్యాంగం రాసుకోవాల్సిన అవ‌స‌రం ఉంద‌ని అంటూ సీఎం కెసీఆర్ ఇటీవ‌ల చేసిన వ్యాఖ్య‌ల‌పై ఆయ‌న మండిప‌డ్డారు. ప్ర‌పంచానికి తెలిసిన భార‌త దేశ‌పు రాజ్యాంగ స్పూర్తి కెసీఆర్ కు తెలియ‌లేదా? అని ప్ర‌శ్నించారు. సీఎం కెసీఆర్ వ్యాఖ్య‌ల‌ను అంత తేలిగ్గా తీసుకోవ‌టానికి వీల్లేద‌న్నారు. కెసీఆర్, మోడీ కూడా చైనా ప్రెసిడెంట్ జిన్ పింగ్ త‌ర‌హాలోనే ఆలోచ‌న చేస్తున్నార‌ని ఆరోపించారు. జిన్ పింగ్, ర‌ష్యా ప్రెసిడెంట్ పుతిన్ లాగా వీరిద్ద‌రూ కూడా రాజ్యాంగంలో మార్పులు చేసి శాశ్వ‌తంగా అదికారంలో ఉండేలా ప్ర‌ణాళిక‌లు ర‌చిస్తున్నార‌ని ఆరోపించారు. రాజ్యాంగం అవసరంలేదనే నియంతృత్వ ధోరణితో కేసీఆర్‌ వ్యాఖ్యలు చేశారని రేవంత్‌రెడ్డి అన్నారు.

రాజ్యాంగాన్ని కాపాడడానికి కాంగ్రెస్‌ సిద్ధమని ఆయన ప్రకటించారు. ప‌ద‌వుల కోసం కేసీఆర్‌ని కేకే, కడియం సమర్థించడం సరికాదన్నారు. రాజ్యాంగం లేకపోతే తెలంగాణ వచ్చేదే కాదన్నారు. రాజ్యాంగం వల్లే కేసీఆర్ రెండుసార్లు సీఎం అయ్యారని ఆయన పేర్కొన్నారు. పదవులున్నాయని విర్రవీగితే ప్రజలే బుద్ధి చెబుతారని రేవంత్ హెచ్చరించారు. శనివారం కేసీఆర్‌, టీఆర్ఎస్‌ నేతలపై అన్ని పీఎస్‌లలో ఫిర్యాదు చేస్తామని ఆయన తెలిపారు. ఆదివారం అంబేద్కర్ విగ్రహాలకు పాలాభిషేకం చేస్తామన్నారు. సోమవారం పార్లమెంట్‌లో కేసీఆర్‌పై నిరసన తెలుపుతామని రేవంత్‌ పేర్కొన్నారు. 

Tags:    

Similar News