హుజూరాబాద్ ఉప ఎన్నికల తర్వాత నుంచి ముఖ్యమంత్రి కెసీఆర్, ఆయన కుటుంబం కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం, ప్రధాని మోడీపై విషం చిమ్మే పనిలో ఉందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మండిపడ్డారు. కెసీఆర్ కుటుంబ సభ్యులు, మంత్రులు, అవసరమైనప్పుడు కెసీఆర్ ఇలా వంతుల వారీగా వచ్చి ఓ పథకం ప్రకారం ఇది అంతా చేస్తున్నారని మండిపడ్డారు. కెసీఆర్ పదే పదే ఎన్ని అబద్ధాలు చెప్పినా ప్రజలు వాటిని నమ్మే పరిస్థితి లేదన్నారు. కేంద్ర బడ్జెట్, ప్రధాని నరేంద్రమోడీపై సీఎం కెసీఆర్ చేసిన వ్యాఖ్యలను కిషన్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. కెసీఆర్ మాటలు చూస్తే ఆయన ఎంత అభద్రతా భావంలో ఉన్నారో తెలిసిపోతుందన్నారు. అంబేద్కర్ ను అవమానించేలా రాజ్యాంగాన్ని మార్చాలని కేసీఆర్ మాట్లాడటం దారుణమన్నారు. ప్రజలను తప్పుదోవ పట్టించేలా కేసీఆర్ మాట్లాడుతున్నారని..ముఖ్యమంత్రి పదవిలో ఉన్న వ్యక్తి ఓ ప్రధాని గురించి మాట్లాడేటప్పుడు కాస్త సభ్యత, సంస్కారం ఉండాలన్నారు. కానీ కెసీఆర్ మాత్రం దిగజారి మాట్లాడుతున్నారని విమర్శించారు.
రాజ్యాంగ బద్ద పదవిలో ఉండి ఏకంగా రాజ్యాంగాన్నే మార్చాలనటం ఏమిటని ప్రశ్నించారు. కెసీఆర్ వ్యాఖ్యలు చూస్తే నైతిక విలువలు, రాజకీయ విలువలు, మానవీయ విలువలకు జుగుప్స కలిగించేలా ఉన్నాయన్నారు. ఉద్యమ సమయంలోనూ ఇలాగే ఇష్టం వచ్చినట్లు మాట్లాడారని..సీఎం అయిన తర్వాత అయినా కాస్త హుందాగా ఉండాలి కదా అని ప్రశ్నించారు. ఈటెల విజయం తర్వాత కెసీఆర్ కుటుంబంలో అభద్రతా భావం స్పష్టంగా కన్పిస్తోందని అన్నారు. అందుకే ఇలా చేస్తున్నారని విమర్శించారు. మాట్లాడితే కేంద్ర హామీల గురించి ప్రస్తావిస్తున్నారని..ముందు కెసీఆర్ తాను ఇచ్చిన హామీలు ఎన్ని..అమలు చేసినవి ఎన్ని ప్రశ్నించారు.. ముందు వాటి సంగతి చూడాలన్నారు. బడ్జెట్ పై కూడా ప్రజలను తప్పుదారి పట్టించేలా కెసీఆర్ విమర్శలు చేశారన్నారు. అంతకు ముందు తెలంగాణ బిజెపి ప్రెసిడెంట్ బండి సంజయ్ కూడా సీఎం కెసీఆర్ రాజ్యాంగంపై చేసిన వ్యాఖ్యలను తప్పుపట్టారు.
రాజ్యాంగం జోలికి వస్తే కెసీఆర్ సంగతి చూస్తామన్నారు. తెలంగాణలో అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేస్తామని చెప్పి ఎన్ని రోజులు అయింది..ఇప్పటి వరకూ ఎందుకు ఆ పని చేయలేదు..ఎవరు ఆపుతున్నారని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి వ్యాఖ్యలకు నిరసనగా గురువారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు దీక్ష చేపడతామని సంజయ్ తెలిపారు. కేసీఆర్ అంబేద్కర్ వర్ధంతి, జయంతిలకు రారని, దళితుడిని సీఎం చేస్తానని కేసీఆర్ అన్నారా? లేదా? అని ప్రశ్నించారు. ఎస్సీగా ఉన్న డిప్యూటీ సీఎంను మార్చారని విమర్శించారు. దళిత రాష్ట్రపతి ప్రసంగాన్ని బహిష్కరించిన పార్టీ టీఆర్ఎస్ అని అన్నారు. మూర్ఖుడిని వదిలేస్తే బలుపెక్కి బరితెగిస్తారని, కేసీఆర్‌ను జైలుకు పంపడం ఖాయమని బండి సంజయ్ అన్నారు.