రేవంత్ పై వ్యాఖ్య‌లు...త‌ప్పేన‌న్న జ‌గ్గారెడ్డి

Update: 2021-09-25 11:06 GMT

కాంగ్రెస్ లో రాజ‌కీయ దుమారం స‌ద్దుబాటు అయింది. టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలా పార్టీని న‌డ‌పాలంటే కుద‌ర‌ద‌ని..ఒక్క‌డే హీరో అవ్వాల‌ని చూస్తున్నారంటూ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే జ‌గ్గారెడ్డి శుక్ర‌వారం నాడు తీవ్ర వ్యాఖ్య‌లు చేసిన విష‌యం తెలిసిందే. త‌న‌కూ రాష్ట్ర‌మంతా అభిమానులు ఉన్నార‌ని..తాను కూడా భారీ స‌భ‌లు పెట్ట‌గ‌ల‌న‌న్నారు. ఈ వ్యాఖ్య‌లు రాజ‌కీయంగా దుమారం రేప‌టంతో అధిష్టానం రంగంలోకి దిగింది. దీనిపై వివ‌ర‌ణ కోర‌టంతో ఆయ‌న మీడియా ముందు అలా మాట్లాడాల్సింది కాద‌ని..త‌న‌దే త‌ప్పు అని అంగీకరించిన‌ట్లు తెలిపారు. గాంధీభవన్‌లో శనివారం టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ జగ్గారెడ్డి, మహేష్‌ గౌడ్‌, సీనియర్‌ ఉపాధ్యక్షులు మల్లు రవి సమావేశమై, మీడియాతో మాట్లాడారు.

ఎమ్మెల్యే జగ్గారెడ్డి మాట్లాడుతూ.. 'సంస్థాగతంగా పార్టీ పటిష్టతపై చర్చించాము. నిన్నటి సమస్య సద్దు మణిగింది. అన్నదమ్ములం అన్నప్పుడు కొన్ని సమస్యలు ఉంటాయి.మళ్లీ కలిసిపోతాం. ఏఐసీసీ కార్యదర్శులు కొన్ని సూచనలు చేశారు. నా తప్పును అడిగారు, మరోసారి మాట్లాడనని వివరణ ఇచ్చాను. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ నాయకత్వంలో పనిచేస్తా. అంతర్గత విషయాలను బయట మాట్లాడొద్దని ఏఐసీసీ సూచించింది. అలా మాట్లాడటం తప్పని అన్నారు, నేను తప్పు ఒప్పుకున్నాను' అంటూ శుక్రవారం రోజున జగ్గారెడ్డి చేసిన వ్యాఖ్యలపై వివరణ ఇచ్చారు. 

Tags:    

Similar News