వచ్చేది కాంగ్రెస్ సంకీర్ణ ప్రభుత్వమే

Update: 2023-02-22 13:30 GMT

కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ భారత జోడో యాత్ర విజయవంతం తర్వాత కాంగ్రెస్ లో కాస్త జోష్ పెరిగింది అనే చెప్పొచ్చు. అదే సమయంలో ఇటీవల వచ్చిన సర్వేల్లో కూడా కాంగ్రెస్ గణనీయంగా పుంజుకునే అవకాశం ఉందనే లెక్కలు వెలువడ్డాయి. ఇదే ఊపుతో కాంగ్రెస్ ముందుకు సాగుతోంది. కాంగ్రెస్ ప్రెసిడెంట్ మల్లికార్జున ఖర్గే తాజాగా చేసిన వ్యాఖ్యలు రాజకీయ ప్రాధాన్యత సంతరించుకున్నాయి. వచ్చే 2024 సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీని గద్దె దింపుతామని, ప్రతిపక్ష కూటమికి కాంగ్రెస్ నేతృత్వం వహిస్తుందని ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే తెలిపారు. ఇందుకోసం భావసారూప్యత కలిగిన అన్ని పార్టీలతోనూ 137 ఏళ్ల కాంగ్రెస్ చర్చిస్తుందని ప్రకటించారు. 2024లో కాంగ్రెస్ కూటమి ప్రభుత్వం కేంద్రంలో అధికారంలోకి వస్తుందని, కాంగ్రెస్ సారథ్యం వహిస్తుందని చెప్పారు. ఇతర పార్టీలతో కూడా ఈ దిశగా చర్చలు సాగిస్తున్నామని, కాంగ్రెస్ అధికారంలోకి రాకుంటే ప్రజాస్వామ్యం, రాజ్యాంగం అనేవి ఉండవు అన్నారు. . ప్రతి పార్టీతో తమ అభిప్రాయాలను పంచుకుంటామని తెలిపారు.

                                    వచ్చే ఎన్నికల్లో బీజేపీకి మెజారిటీ రాదని జోస్యం చెప్పారు. అన్ని పార్టీలను కలుపుకొని తాము మెజారిటీ సాధిస్తామని, 100 మంది మోదీలు, అమిత్ షాలు వచ్చినా గెలుపు తమదేనని ధీమా వ్యక్తం చేశారు. ''స్వాతంత్రం కోసం దేశ ప్రజలు ప్రాణాలు అర్పించారు. కాంగ్రెస్ వాళ్లు త్యాగాలు చేశారు. బీజేపీ వాళ్లు కాదు. స్వాతంత్ర్యం కోసం బీజేపీ నేత ఒక్కరైనా ఉరికంబానికి ఎక్కారా? కనీసం స్వాతంత్ర్యం కోసం పారాడారా? జైళ్లకు వెళ్లారా? దీనికి బదులు ఒక వ్యక్తి స్వాతంత్ర్యం తెస్తే , అలాంటి మహాత్మాగాంధీని వాళ్లు పొట్టనపెట్టుకున్నారు. వీళ్లా దేశభక్తి గురించి చెప్పేది?" అని ఖర్గే ఘాటుగా విమర్శించారు. దేశ ఐక్యత కోసం ఇందిరాగాంధీ ప్రాణాలు కోల్పోయారని, రాజీవ్ గాంధీ ప్రాణాలర్పించారని, కానీ బీజేపీ మాత్రం దేశానికి 2014లో స్వాతంత్ర్య వచ్చిందని చెబుతున్నారని, 1947 వాళ్లకు గుర్తులేదని ఎద్దేవా చేశారు.

Tags:    

Similar News