కెసీఆర్ బిజెపికి వ్యతిరేకమైతే రాష్ట్రపతి అభ్యర్ధిని నిలబెడతారా?!
రాష్ట్రపతి ఎన్నికల్లో బిజెపికి మేలు చేసేందుకే టీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కెసీఆర్ పనిచేస్తున్నారని టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి ఆరోపించారు. అందరం కలసి పనిచేద్దామని గతంలో చెప్పిన కెసీఆర్ మమతా బెనర్జీ నిర్వహించిన సమావేశానికి ఎందుకు హాజరుకాలేదని ప్రశ్నించారు. బిజెపికి వ్యతిరేకంగా పనిచేసేట్లు అయితే కెసీఆర్ రాష్ట్రపతి అభ్యర్ధిని బరిలో నిలబెడతారా అని ప్రశ్నించారు. ఎన్నికలకు దూరంగా ఉండటం ద్వారా బిజెపికి మేలు చేసే యోచనలో కెసీఆర్ ఉన్నారన్నారు.
రేవంత్ రెడ్డి బుధవారం నాడు మీడియాతో మాట్లాడుతూ ఈ కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీని వరస పెట్టి ఈడీ విచారణ జరుపుతుండటంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రం, ఈడీ తీరుకు నిరసనగా గురువారం నాడు రాజ్ భవన్ ఎదుట ధర్నా చేస్తామని..ఇందుకు అందరూ తరలిరావాలని పిలుపునిచ్చారు. తాము నిరసనలు తెలుపుతుంటే పోలీసులతో దాడులు చేయిస్తున్నారని మండిపడ్డారు.