ఒక వైపు వైసీపీ షర్మిల విమర్శలతోనే ఉక్కిరిబిక్కరికి అవుతుంటే...శుక్రవారం నాడు జగన్ బాబాయ్ వై ఎస్ వివేకానంద రెడ్డి కూతురు సునీత ఢిల్లీ వేదికగా చేసిన వ్యాఖ్యలు వైసీపీ వర్గాలను షాక్ కు గురి చేసేలా ఉన్నాయనే చెప్పొచ్చు. ఆమె కూడా నేరుగా వచ్చే ఎన్నికల్లో వైసీపీ కి ఓటు వేయవద్దని ఆంధ్ర ప్రదేశ్ ప్రజలకు పిలుపునిచ్చారు. హత్యా రాజకీయాలు చేసే వాళ్ళు మనని పాలించకూడదు అంటూ వ్యాఖ్యానించారు. వై ఎస్ వివేకానంద రెడ్డి హత్యను వైసీపీ గత ఎన్నికల్లో రాజకీయంగా వాడుకున్న విషయం తెలిసిందే. ఈ హత్య వెనక అప్పటి టీడీపీ ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు ఉన్నట్లు సాక్షిలో సైతం నారాసుర రక్త చరిత్ర అంటూ భారీ ఎత్తున ప్రచారం చేశారు. జగన్ దగ్గర నుంచి వైసీపీ నేతలు అంతా కూడా ఇదే విషయంలో బహిరంగంగానే ఆరోపణలు చేశారు. కానీ సిబిఐ విచారణలో ఈ హత్య కేసు కు సంబంధించి వై ఎస్ భాస్కర్ రెడ్డి తో పాటు వై ఎస్ అవినాష్ రెడ్డి పేర్లు బయటకు వచ్చాయి. దీంతో ఈ వ్యవహారం అటు వైసీపీ తో పాటు ముఖ్యంగా సీఎం జగన్ ను మరింత ఇరకాటంలోకి నెట్టింది. సహజంగా హత్య కేసు ల్లో నిందితులను ఐదారు రోజుల్లోనే గుర్తిస్తారు అని...కానీ తన తండ్రి హత్య జరిగి ఐదు సంవత్సరాలు అవుతున్నా ఇప్పటికి ఈ విషయాన్ని తేల్చకపోవటం సరికాదు అన్నారు. ఒత్తిళ్ల వల్ల సిబిఐ విచారణ ఏ మాత్రం ముందుకు సాగటం లేదు అన్నారు. సొంత వాళ్ళను అంత సులువు అనుమానించి లేం అని...అందుకే తొలుత తన తండ్రి హత్య కేసు విషయంలో జగన్ కలిసినప్పుడు ఆయనపై తనకు ఎలాంటి అనుమానం రాలేదు అన్నారు. జగన్, భారతి పాత్రలు ఇందులో ఉన్నాయో లేదో సిబిఐ విచారణలోనే తేలాలి అన్నారు. వైసీపీ ఇప్పటికే షర్మిల పై సోషల్ మీడియా లో బయట పెద్ద ఎత్తున ఎటాక్ చేస్తోంది. ఇక ఇప్పుడు ఆ జాబితాలోకి సునీత కూడా చేరటం ఖాయం అనే చెప్పొచ్చు.