ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాలు అంటేనే చాలా వెరైటీ. కాకపోతే కొన్ని విషయాల్లో ... ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి, తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా ఒకటే. దేశంలోని కీలక పార్టీ లు అన్నీ అత్యంత ముఖ్యమైన అంశాలపై తమ వైఖరి చెపుతున్నా...జగన్, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లు మాత్రం నోరు తెరవరు. అందులో అత్యంత కీలకమైన హిండెన్ బర్గ్ రీసెర్చ్ అదానీ గ్రూప్ పై వెల్లడించిన నివేదిక. ఈ నివేదిక అదానీ గ్రూప్ తో పాటు కేంద్రంలోని మోడీ సర్కారును తీవ్ర ఇరకాటంలో పడేసింది. దీనిపై నేరుగా ప్రధాని మోడీ ఒక్కసారి అంటే ఒక్కసారి మాట్లాడ లేదు. కీలక నేతలు అదానీ- హిండెన్ బర్గ్ రీసెర్చ్ రిపోర్ట్ పై స్పందించారు. కానీ జగన్, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లు మాత్రం నోరు తెరవలేదు. అదానీ గ్రూప్ పై ప్రకంపనలు ఇంకా కొనసాగుతూ ఉన్నాయి.తాజాగా కూడా అదే పరిస్థితి. రాహుల్ గాంధీ లోక్ సభ సభ్యత్వం రద్దు అంశం దేశ వ్యాప్తంగా ప్రకంపనలు రేపుతోంది.
ఇంత కీలక అంశంపై అటు సీఎం జగన్ కానీ...ఇటు ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మాట్లాడక పోవటం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. రాహుల్ వేటుపై స్పందిస్తే ప్రధాని మోడీ కి ఎక్కడ కోపం వస్తుందో అని జగన్, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లు మౌనం దాల్చారు అనే చర్చ సాగుతోంది రాజకీయ వర్గాల్లో. వీళ్ళ ముగ్గురు అదానీకి, మోడీ కి వ్యతిరేకంగా ఏమి మాట్లాడకపోవడం అన్నది హాట్ టాపిక్ మారింది. చివరకు తెలంగాణ వైఎస్ఆర్ టిపీ ప్రెసిడెంట్ షర్మిల కూడా రాహుల్ గాంధీ సభ్యత్వ రద్దు పై స్పందించి....ఇది ఏ మాత్రం సరికాదు అని ప్రకటించారు. జగన్, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లతో పోలిస్తే చంద్రబాబు కే ఒకింత బాధ్యత ఎక్కువ ఉంది అని చెప్పాలి. ఎందుకంటే గత ఎన్నికల సమయంలో రాహుల్ గాంధీ తో కలిసి తిరిగారు కూడా...తెలంగాణ లో పొత్తు కూడా పెట్టుకున్న విషయం తెలిసిందే. కానీ ఇప్పుడు మాత్రం కనీసం మాట మాత్రంగా కూడా స్పందించటం లేదు.