మాజీ మంత్రి నారాయణ అరెస్ట్ పై తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడు స్పందించారు. పదో తరగతి పరీక్షల నిర్వహణా వైఫల్యాన్ని కప్పిపుచ్చుకునేందుకే నారాయణను అరెస్టు చేశారని విమర్శించారు. కక్షతోనే ఆయనను అరెస్టు చేశారని ఆరోపించారు. . పరీక్షల నిర్వహణలో విఫలమైన ప్రభుత్వం అన్ని వర్గాల నుంచి తీవ్ర విమర్శలు ఎదుర్కొందన్నారు. తమ వైఫల్యాన్ని కప్పిపుచ్చుకునేందుకే నారాయణను అరెస్టు చేసి.. ఆయనను దోషిగా చూపే ప్రయత్నం చేస్తోందని విమర్శించారు.
మాస్ కాపీయింగ్‌కు, పరీక్షల నిర్వహణలో వైఫల్యాలకు.. నారాయణను ఎలా బాధ్యుడిని చేస్తారని ప్రశ్నించారు. ముందస్తు నోటీసు ఇవ్వకుండా... విచారణ చేయకుండా, అధారాలు లేకుండా నేరుగా అరెస్టు చెయ్యడం కక్ష పూరిత చర్య కాదా? అని మండిపడ్డారు. నారాయణను జైల్లో పెట్టేందుకు అధికారంలోకి వచ్చిన రోజు నుంచి అక్రమ కేసులతో జగన్ ప్రయత్నాలు చేస్తున్నారని చంద్రబాబు ధ్వజమెత్తారు.