మనం-మన అమరావతి పేరుతో పాదయాత్ర చేస్తున్న బిజెపికి రైతులు షాకిచ్చారు. రైతులు ఏపీ బిజెపి ప్రెసిడెంట్ సోము వీర్రాజుకు పలు ప్రశ్నలు సంధించారు. ప్రధాని మోడీ శంకుస్థాపన చేసిన రాజధాని విషయంలో మీరు వ్యవహరించేది ఇలాగేనా అంటూ ప్రశ్నించారు. ఒకే రాజధాని అనే నినాదమేనా అమరావతి కోసం చేసేది ఏమైనా ఉందా అంటూ ప్రశ్నించారు. మరో రైతు అయితే ఏకంగా మీరు, జగన్ తోడు దొంగలు అంటూ విమర్శించారు. మీరంతా ఒక్కటే అన్నారు. దీనిపై స్పందించిన సోము వీర్రాజు ఐదేళ్లు కట్టని చంద్రబాబుని ఏమీ అనకుండా తమను అనటం కరెక్ట్ కాదన్నారు. చంద్రబాబు సగం రాజధాని కట్టినా ఈ పరిస్థితి వచ్చేది కాదన్నారు.
తాము ఏమి తప్పుచేశామని..చంద్రబాబు తమను వదిలిపెట్టి వెళ్లారని..చంద్రబాబు తమతో ఉంటే అసలు జగన్ సీఎం అయ్యే వారు కాదని అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి అమరావతి రాజధాని విషయంలో ద్వంద ప్రమాణాలు పాటిస్తున్న విషయం తెలిసిందే. ఓ వైపు కేంద్రం ఏమో రాజధాని నిర్ణయం రాష్ట్ర పరిధిలోనేదే అని చెబుతుంది..ఇక్కడ బిజెపి నేతలు మాత్రం తమ రాజకీయ ప్రయోజనాల కోసం ఒకే రాష్ట్రం..ఒకే రాజధాని అంటూ ప్రకటనలు చేస్తారు. ఇప్పుడు ఇదే పేరుతో పాదయాత్రకు శ్రీకారం చుట్టారు. దీంతో అమరావతి రైతుల దగ్గర నుంచి బిజెపికి పలు ప్రశ్నలు ఎదురవుతున్నాయి.