ఆంధ్ర ప్రదేశ్ రెవెన్యూ శాఖలో అత్యంత కీలకమైన ఆర్డీఓ, డీఆరో పోస్టింగ్ ల విషయంలో పెద్ద ఎత్తున అవినీతి చేసుకుంటున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ మొత్తం వ్యవహారంలో ఒక మంత్రి భారీ వసూళ్లకు పాల్పడుతున్నట్లు ఏకంగా టీడీపీకి చెందిన వాళ్లే పలు వివరాలతో సహా సోషల్ మీడియాలో పోస్ట్ లు పెడుతుండటంతో ఇది ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చనీయంగా మారింది. 20 మంది ఆర్డీఓ లతో పాటు ఎనిమిది మంది డీఆరో ల బదిలీకి సంబంధించిన ఫైల్ ప్రస్తుతం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి దగ్గరకు వెళ్ళింది అని...ఇందులో ఎక్కువ మంది తీవ్రమైన అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న వాళ్లే అని ఆ శాఖ వర్గాలు చెపుతున్నాయి. ఇక్కడ విచిత్రం ఏమిటి అంటే నెల్లూరు-చిత్తూర్ జిల్లాల మధ్య ఒక మెగా ప్రాజెక్ట్ ని నిర్వచించే పారిశ్రామికవేత్త ఒక ఆర్డీఓ పేరు ప్రతిపాదించటం...ఆ పేరును బదిలీ కోసం సీఎం దగ్గరకు పంపటం ఇప్పుడు అధికార వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. పారిశ్రామికవేత్తలు ప్రభుత్వ పెద్దలను ప్రసన్నం చేసుకుని పనులు చేసుకోవటమే కాదు...ఇప్పుడు ఏకంగా పోస్టింగ్ ల వ్యవహారంలో తలదూర్చటం...అందుకు జిల్లా కలెక్టర్ తో పాటు సీఎంఓ లో ఒక అధికారి కూడా ఓకే చెప్పి ఆ పేరును ప్రతిపాదించటం చూసి కొంతమంది అవాక్కు అవుతున్నారు.
బదిలీల కోసం ప్రయత్నం చేస్తున్న వాళ్ళు తమ పోస్టింగ్ ల కోసం ఒక మంత్రికి భారీగా సమర్పించుకున్నట్లు రెవెన్యూ శాఖ వర్గాలు చెపుతున్నాయి. ఇక్కడ విచిత్రం ఏమిటి అంటే ఈ జాబితాలో ఉన్న వాళ్లలో కొంత మంది దగ్గర ఎసిబి సర్ప్రైజ్ విజిట్ లో గతంలో నగదు కూడా పట్టుబడినట్లు ఒక అధికారి వెల్లడించారు. ఇవేమి పట్టించుకోకుండా ఇప్పుడు అవినీతే అర్హతగా కొంతమందిని కీలక స్థానాల్లో నియమించడానికి రంగం సిద్ధం చేస్తున్నారు. రెవెన్యూ పోస్టులను నడిబజారులో పెట్టి వేలం వేస్తున్నారు అని ఒక టీడీపీ కార్యకర్త ఎక్స్ లో పోస్ట్ చేయటమే కాకుండా ఈ విషయాన్ని ప్రభుత్వ పెద్దలు అందరికి ట్యాగ్ చేశారు కూడా. నందిగామ ఆర్ డీఓ పోస్ట్ కూడా కూడా పెద్ద ఎత్తున అవినీతి ఆరోపణలు వ్యక్తిని సిఫారసు చేశారు అని..దీనికి కొంత మంది ప్రజా ప్రతినిధులు కేవలం లెటర్ ఇచ్చినందుకు పది లక్షల రూపాయల లెక్కన తీసుకున్నట్లు టీడీపీ వర్గాలే చెపుతున్నాయి.
వైజాగ్ ఆర్దీవో పోస్ట్ కు కూడా అత్యంత అవినీతిపరులుగా పేరున్న ఒక మహిళను సిఫారసు చేసినట్లు చెపుతున్నారు. అయితే ఈ ఆర్దీఓ విషయంలో ప్రభుత్వంలో కీలక స్థానంలో ఉన్న వ్యక్తే చక్రం తిప్పినట్లు అధికార వర్గాలు చెపుతున్నాయి. వైజాగ్ పై ఆయన ఇప్పుడు స్పెషల్ ఫోకస్ పెట్టినట్లు అధికార వర్గాల్లో ప్రచారంలో ఉంది. అంతే కాకుండా కోట్ల రూపాయలు కురిపించే ఫైల్స్ ముందుకు నడవాలంటే అందుకు ప్రైవేట్ వ్యక్తులను పెట్టుకుని వాళ్ళ దగ్గర నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చిన తర్వాతే రెవెన్యూలో కీలక ఫైల్స్ కదులుతున్నాయి అని ఆ శాఖ వర్గాలు చెపుతున్నాయి. వందల కోట్ల రూపాయల విలువ చేసే భూములకు సంబంధించి ఈ తతంగం సాగుతోంది. దీనికి అందరూ కలిసి పక్కాగా ఒక ప్రణాళిక ప్రకారం పనులు చేస్తున్నారు రెవెన్యూ శాఖ వర్గాలు చెపుతున్నాయి.