స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడైనా అధికార పార్టీకి అనుకూలంగానే ఉంటాయి. దీనికి చాలా అంశాలు దోహదం చేస్తాయి. ఆర్థిక వనరులతో పాటు అధికారంలో ఉన్న పార్టీకి అధికార యంత్రాంగం సహకారం కూడా తోడు అవుతుంది. ఆంధ్ర ప్రదేశ్ లో త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి ఎన్ని స్థానాలు గెలుచుకుంటుంది అన్న అంశం కంటే ఈ ఎన్నికల్లో కూటమిలో కీలక భాగస్వాములుగా ఉన్న తెలుగు దేశం పార్టీ...జనసేన ల మధ్య పొత్తు ఎంత సాఫీగా సాగుతుంది?. ఎవరికీ ఎన్ని సీట్లు వస్తాయి...వచ్చిన సీట్లలో ఆయా పార్టీల నాయకులు...క్యాడర్ సహకారం ఎంత మేర ఉంటుంది అన్నదే ఇప్పుడు అత్యంత కీలకంగా మారనుంది. గత కొంత కాలంగా జనసేన అధినేత, ఆంధ్ర ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వ్యవహరిస్తున్న తీరు తీవ్ర దుమారం రేపుతోంది. రాజకీయ అవసరాల కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ లు ఈ విషయంలో ఎక్కడా నోరు తెరిచి మాట్లాడిన సందర్భం లేదు. కాకపోతే పవన్ తీరు పై స్థానికంగా టీడీపీ నాయకులతో పాటు టీడీపీ క్యాడర్ లో కూడా తీవ్ర అసంతృప్తి ఉంది.
ఇది ఖచ్చితంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రభావం చూపిస్తుంది అనే చర్చ టీడీపీ నేతల్లో సాగుతోంది. సీట్ల విషయంలోనే పంచాయతీ తలెత్తే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇరు పార్టీలు సర్దుబాటుతో సీట్ల విషయంలో ఒక అంగీకారానికి వచ్చినా కూడా అసలు సమస్య ఎన్నికల్లో ఓటు బ్యాంకు ట్రాన్స్ఫర్ విషయంలోనే ఎదురు అయ్యే అవకాశం ఉంది. మిత్రపక్షం జనసేన కు కేటాయించిన సీట్లలో టీడీపీ నాయకులు..క్యాడర్ సహకరించకపోతే ఆ సీట్లు గెలిచే అవకాశం ఉండదు. అదే సమయంలో కూటమి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పదే పదే పదిహేను సంవత్సరాలు చంద్రబాబు సీఎం గా ఉండాలని బహిరంగంగా చేసిన ప్రకటనలు జనసేన పార్టీ నాయకులు..క్యాడర్ కు ఏ మాత్రం రుచించలేదు. కారణాలు ఏమైనా కూడా జనసేనకు, పవన్ కళ్యాణ్ కు మద్దతు ఇస్తున్న వాళ్ళు కూడా కూటమి తీరుపై సంతృప్తిగా ఏమీ లేరు. ఈ తరుణంలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలు రెండు పార్టీలు తమ తమ అభ్యర్థులను గెలిపించుకోవడంలో చూపించే సమన్వయం వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు ఎంతో కీలకం కానుంది. స్థానిక సంస్థల ఎన్నికల కారణంగా రెండు ప్రధాన పార్టీల మధ్య విబేధాలు మరింత పెరిగితే అది ఖచ్చితంగా వచ్చే అసెంబ్లీ ఎన్నికలపై పడటం ఖాయం.
ఇక్కడ మరో కీలక విషయం ఏమిటి అంటే మొన్నటి అసెంబ్లీ ఎన్నికల తరహాలో కాకుండా స్థానిక సంస్థల ఎన్నికల్లో జనసేన అధిక సీట్ల కోసం పట్టుపట్టబోతుంది అని చెపుతున్నారు. తాము బలంగా ఉన్న చోట సీట్లు అడుగుతామని..కార్యకర్తల గౌరవానికి భంగం కలగకుండా చూసుకుంటామని పవన్ కళ్యాణ్ చెపుతున్నారు. ఇక్కడ ప్రధానంగా రెండు సమస్యలు కనిపిస్తున్నాయి. టీడీపీ నుంచి జనసేన ఎంత మేర గౌరవప్రదంగా సీట్లు దక్కించుకుంటుంది...దక్కించుకున్న సీట్లను రెండు పార్టీల సమన్వయంతో ఎలా గెలిపించుకుంటుంది అన్నదే ఇక్కడ కీలకంగా మారబోతుంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ నుంచి వచ్చే సవాళ్ల కంటే కూటమి పార్టీలు టీడీపీ, జనసేన ల మధ్య సయోధ్యే ఎంతో కీలకం కానుంది అని ఒక సీనియర్ మంత్రి అభిప్రాయపడ్డారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూటమిలో భాగస్వామిగా ఉండి కూడా తాను సర్వ స్వతంత్రుడిని ...తనకు ఈ ప్రభుత్వంతో సంబంధం లేదు అన్నట్లు పలు సార్లు వ్యవహరిస్తున్నారు. ఇది కూటమికి ఇరకాటంగా మారుతోంది.