Full Viewవైసీపీ అధినేత, సీఎం జగన్మోహన్ రెడ్డి గత కొంత కాలంగా 175 సీట్ల జపం చేస్తున్నారు. గత ఎన్నికల్లో 151 సీట్లు సాధించాం..ఈ సారి 175 సాధించటం పెద్ద కష్టమేమీ కాదు అని పార్టీ సమావేశాల్లో తరచూ వ్యాఖ్యానిస్తున్నారు. వాస్తవానికి ఏ రాజకీయ పార్టీ చరిత్రలో రాష్ట్రంలో ఉన్న అన్ని సీట్లు దక్కించుకోవటం అనేది జరిగే పని కాదు. కానీ జగన్ పార్టీ క్యాడర్ లో జోష్ నింపేందుకో..నేతల్లో స్పీడ్ పెంచేందుకో పదే పదే ఇదే మాట చెబుతున్నారు. అయితే క్షేత్రస్థాయిలో మాత్రం అందుకు భిన్నమైన పరిస్థితులు ఉన్నాయనే విషయం ఆ పార్టీ నేతలు కూడా అంగీకరిస్తున్నారు. గతంలో టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు, అప్పటి నీటిపారుదల శాఖ మంత్రి ఉమామహేశ్వరరావులు కూడా జగన్ సొంత నియోజకవర్గం పులివెందులకూ కూడా తామే నీరు ఇచ్చామని..పులివెందుల సీటు కూడా గెలుస్తామని వ్యాఖ్యానించారు.
కానీ తర్వాత ఏమి జరిగిందో అందరూ చూశారు. ఇప్పుడు సీఎం జగన్ సెప్టెంబర్ 22న కుప్పం పర్యటన పెట్టుకున్నారు. దీంతో ఆ నియోజకవర్గంలో రాజకీయం వేడెక్కుతోంది. దీనికి తోడు వైసీపీ చేసే హంగామా కూడా పెరుగుతోంది. అందుకే నిదర్శనమే ఈ వాల్ రైటింగ్స్ అని చెప్పుకోవచ్చు. కుప్పం నియోజకవర్గంలోని ఓ గోడపై 175కు 175 సీట్లు ...ఫస్ట్ టార్గెట్ కుప్పం అంటూ గోడలపై రాస్తున్నారు. ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే తాజాగా పీకె సర్వేకు సంబంధించి కొన్ని ఫలితాలు వచ్చాయని..అందులో మాత్రం లెక్క తేడాకొడుతోందని వైసీపీ వర్గాల్లోనే చర్చ సాగుతోంది. గోడలపై 175 సీట్లు అని రాసినంత మాత్రాన వస్తాయా అంటూ సొంత పార్టీ నేతలే వ్యాఖ్యానిస్తున్నారు.