మరి ఇప్పుడు మద్య ప్రోత్సాహాకానికి ధరలు తగ్గించారా?!

Update: 2020-09-03 14:15 GMT

ఏపీలో జగన్ సర్కారు కొలువుదీరిన దగ్గర నుంచి మద్యం ధరలను ఎడాపెడా పెంచుతూ పోయింది. దీనిపై ఎన్ని విమర్శలు వచ్చినా సరే ..మద్య నియంత్రణ కోసమే ధరల పెంపు అంటూ సమర్ధించుకుంటూ వచ్చింది. మందు ప్రియులకు కూడా జగన్ సర్కారు పెంచిన ధరలు చూసిన తర్వాత మందు కొట్టకముందే తల తిరిగినంత పని అయింది. ఎన్ని విమర్శలు వచ్చినా సరే సర్కారు ధరల పెంపు విషయంలో మాత్రం మద్య నియంత్రణ వాదనే విన్పించింది. సీన్ కట్ చేస్తే ఇప్పుడు సర్కారు తాజాగా మద్యం ధరలను తగ్గించింది. అదే సమయంలో కొన్ని బాండ్లకు ధరలు పెంచింది. అయితే తగ్గించిన ధరలు అన్నీ కూడా ఎక్కువ మంది వాడే చీప్ లిక్కర్, బీర్ల ధరలు. అంటే మరి ఇప్పుడు ఈ ధరలు తగ్గింపును సర్కారు ఎలా సమర్ధించుకుంటుంది?. ఇంత కాలం చెప్పిన మద్య నియంత్రణ స్లోగన్ ఎటుపోయినట్లు?.

అంటే ఎప్పుడు ఏ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయానికి అనుగుణంగా ఓ వాదనను తెరమీదకు తీసుకురావటం..దీన్ని నమ్మండి అని చెప్పటం ప్రభుత్వాలకు అలవాటే. ఇప్పుడు జగన్ సర్కారు కూడా అదే చేస్తోంది?. సర్కారు గత వాదన ప్రకారం చూసుకుంటే ఇప్పుడు మద్య పోత్సాహం కోసం ధరలు తగ్గించినట్లు అనుకోవాలా?. అన్న అనుమానం రాకమానదు. సర్కారు గురువారం నాడు ఐఎంఎఫ్‌ లిక్కర్‌, ఫారెన్‌ లిక్కర్‌, బీర్‌, వైన్‌ ధరల్లో మార్పులు చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు గురువారం జరిగిన మంత్రివర్గ భేటీ అనంతరం ధరలను క్రమబద్దీకరిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. రూ.150 కంటే తక్కువ ధర ఉన్న బ్రాండ్లపై తగ్గించింది. అలాగే 90ఎమ్‌ఎల్‌ రూ.190 నుంచి రూ.600 వరకు ఉన్న మద్యంపై ధరలను పెంచింది. బీర్లు, రెడీ టు డ్రింక్‌ ధరలు తగ్గిస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది.

Similar News