ఇదేనా జగన్ విలువల రాజకీయం?!

Update: 2020-09-19 11:15 GMT

కొడుకులకు కండువాలు..తండ్రుల పదవులకు రక్షణ

ఫిరాయింపుల విషయంలో దొడ్డిదారి రూట్

సీఎం జగన్ అసెంబ్లీ సాక్షిగా చెప్పింది ఏంటి?. ఇప్పుడు చేస్తుంది ఏంటి?. ఇదేనా విలువలతో కూడిన రాజకీయం. ఫిరాయింపు ఎమ్మెల్యేలకు చంద్రబాబు నేరుగా కండువాలు కప్పారు. ఆ ఫలితం అనుభవించారు. కానీ సీఎం జగన్ ఫిరాయింపుల విషయంలో దొడ్డిదారి రాజకీయం చేస్తున్నారు. అసెంబ్లీలో మాత్రం ఎవరైనా పార్టీ మారితే తక్షణమే వారి సభ్యత్వం పోవాలని..లేదంటే రాజీనామా చేసి వస్తేనే వారిని పార్టీలో చేర్చుకుంటానని ప్రకటించారు. అప్పట్లో జగన్ ప్రకటనను అందరూ శెహబాష్ అంటూ కొనియాడారు కూడా. కానీ అక్కడ చెప్పింది ఒకటి. బయట చేస్తుంది ఒకటి. కొద్ది రోజుల క్రితమే టీడీపీ సీనియర్ నేత, ఎమ్మెల్యే కరణం బలరాం జగన్ పక్కన నిలుచున్నారు..ఆయన తనయుడు కరణం వెంకటేష్ కు మాత్రం జగన్ వైసీపీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అప్పటి నుంచి ఆయన సీఎం జగన్ కు అనుకూలంగా..చంద్రబాబుకు వ్యతిరేకంగా విమర్శలు చేస్తూనే ఉన్నారు.

ఇప్పుడు అలాంటిదే సేమ్ సీన్ రిపిట్ అయింది. విశాఖ దక్షిణ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ దీ అదే కథ. ఆయన తాడేపల్లి క్యాంప్ ఆఫీస్ లో సీఎం జగన్ పక్కన నిలుచుని ఉంటారు. ఆయన తనయులకు జగన్ వైసీపీ కండువాలు కప్పుతారు. అంటే చంద్రబాబు చేసినట్లే నేరుగా ఎమ్మెల్యేలకు కండువాలు కప్పితే చెప్పిన మాట ప్రకారం ఎమ్మెల్యేల సభ్యత్వం పోతుంది. మళ్ళీ ఎన్నికలు ఎదుర్కోవటానికి.. ఫిరాయించటానికి ఆ ఎమ్మెల్యేలు సిద్ధంగా ఉండాలి. ఈ అంశాలను పక్కన పెట్టేందుకు ఈ దొడ్డిదారి ఫిరాయింపు రాజకీయం. పోనీ ఎమ్మెల్యేలు అధికారికంగా వైసీపీలో చేరటం లేదు కాబట్టి వాళ్లకు ఈ నిబంధనలు వర్తించవు అనుకుందాం. కానీ ఈ చేరికల తర్వాత అప్పుడు కరణం బలరామ్ అయినా..ఇప్పుడు వాసుపల్లి గణేష్ చేసిన వ్యాఖ్యలు చూస్తే ఏజెండా స్పష్టంగా అర్ధం అవుతుంది. గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీని టీడీపీనే పార్టీ నుంచి బహిష్కరించటం ద్వారా ఆయనకు కొంత కుషన్ దొరికిందని చెప్పుకోవచ్చు. గుంటూరు జిల్లాకు చెందిన మద్దాల గిరి కూడా టీడీపీపై తిరుగుబాటు జెండా ఎగరేసి..వైసీపీతో జట్టుకట్టారు.

Similar News