‘వైఎస్సార్ చేయూత’ను ప్రారంభించిన జగన్

Update: 2020-08-12 06:53 GMT

ఏపీలో మరో సంక్షేమ కార్యక్రమం అమల్లోకి వచ్చింది. మహిళా సాధికారతే లక్ష్యంగా వైఎస్సార్ చేయూత పథకం ప్రవేశపెట్టినట్లు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వెల్లడించారు. ఆయన బుధవారం నాడు తాడేపల్లి ఈ పథకానికి శ్రీకారం చుట్టారు. దీని కింద 45 నుంచి 60 ఏళ్ళ వయస్సు ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ మహిళలకు ఏటా 18,750 రూపాయలు అందించనున్నారు. నాలుగేళ్లలో ఒక్కో మహిళకు 75 వేల రూపాయల మేర అందనున్నాయి. మహిళల జీవనోపాధి మార్గాలను చూపిస్తూ ఈ నిధులను అందించనున్నారు. దీని కోసం పలు సంస్థలతో ఏపీ సర్కారు ఇప్పటికే ఒప్పందాలు కుదుర్చుకుంది. నాలుగేళ్ళలో మహిళలకు ఈ పథకం కింద ఏకంగా 17 వేల కోట్ల రూపాయలు అందనున్నాయి.

వైఎస్సార్ చేయూత పథకంలో భాగంగా తొలి విడత సీఎం జగన్ బటన్‌ నొక్కి నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లోకి రూ.18,750లు జమచేశారు. ఈ ఏడాది బడ్జెట్‌లో వైఎస్సార్‌ చేయూత పథకానికి.4,700కోట్ల రూపాయలు కేటాయించారు. లబ్ధిదారుల సాధికారిత కోసం ప్రభుత్వం అమూల్, ఐటీసీ, హెచ్‌యూఎల్, పీ అండ్‌ జీ, జియోమార్ట్‌ లాంటి ప్రఖ్యాత, దిగ్గజ కంపెనీలతో ఒప్పందం చేసుకుంది. ఔత్సాహిక వ్యాపారస్తులుగా మారడానికి అవసరమైన సాంకేతిక, మార్కెటింగ్‌ సహకారాలను ఈ కంపెనీలు అందిస్తాయి. వైఎస్సార్‌ చేయూత ద్వారా దాదాపు 25 లక్షల మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మహిళలకు మేలు జరుగుతుందని అంచనా. ఈ కంపెనీల భాగస్వామ్యం వల్ల వారికి జీవనోపాధి కలగడమే కాకుండా, గ్రామీణ స్థాయిలో ఆర్థిక కార్యకలాపాలు పుంజుకోనున్నాయి.

Similar News